శ్రీకాకుళం: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల సందర్భంలో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు విమర్శలు చేసి అధికారంలోనికి వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను బదిలీ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారులు పలువురికి బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు సోమవారం అందాయి. జిల్లాకు చెందిన 17 మంది వరకు బదిలీలు జరిగినట్టు తెలియవచ్చింది. ఈ బదిలీ ఉత్తర్వులు విద్యాశాఖ అధికారుల నుంచి కాకుండా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కార్యదర్శుల ద్వారా విద్యాశాఖాధికారులకు రావడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్‌జిల్లా బదిలీలను కూడా రాష్ట్రస్థాయిలో చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగితే తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన అప్పటి ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సమయంలో బదిలీలు కౌన్సెలింగ్ ద్వారానే జరుపుతామని దొడ్డిదారిన బదిలీలు ఉండవని చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వీటిని రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తున్నారు. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులకు దారితీస్తుందో వేచిచూడాలి.
నాడు విమర్శలు...నేడు ఇష్టారాజ్యంగా బదిలీలు
Published Tue, Nov 25 2014 12:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement