సమైక్య పోరుకు దూరంగా ఉపాధ్యాయులు | teachers avoid united andhra movement | Sakshi
Sakshi News home page

సమైక్య పోరుకు దూరంగా ఉపాధ్యాయులు

Published Sun, Sep 1 2013 3:16 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

teachers avoid united andhra movement

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నెల రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఎక్కువ మంది దూరంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేధావులుగా.. సమాజ నిర్దేశకులుగా పేరొందిన ఉపాధ్యాయులు కీలక సమయంలో ప్రేక్షకపాత్ర కే పరిమితమయ్యారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగితే మెజారిటీ ఉపాధ్యాయులు మాత్రం దూరంగానే ఉన్నారు. ఏవో పొంతన లేని కుంటిసాకులు చెబుతూ సమ్మె నుంచి దూరం జరుగుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో మొదటిగా ఎన్జీవోలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా ఉపాధ్యాయుల్లో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
 
 ప్రకాశం భవనం ఎదుట రెండు రోజులు నిరాహారదీక్షలు నిర్వహించింది. రిలే దీక్షలు ముగింపు సందర్భంగా నగరంలో ర్యాలీ కూడా నిర్వహించింది. అనంతరం ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు కూడా చొరవ చూపి తమ కార్యాలయంలోనే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వైఎస్‌ఆర్ టీఎఫ్ ఏర్పాటు చేసింది. రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు తమ మద్దతు తెలిపారు. దీంతో అన్ని సంఘాలతో కలిపి ఉపాధ్యాయ జేఏసీ ఆవిర్భవించింది. తీరా సమ్మెలోకి వెళ్లే విషయంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు యూటర్న్ తీసుకున్నాయి. సీమాం ధ్రలోని 13జిల్లాల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ విజయవాడలో సమావేశమై ఆగస్టు 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులందరూ సమ్మెలో పాల్గొనాలని తీర్మానించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. డీఈవోకు సమ్మె నోటీసు కూడా అందజేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు అంగీకారం తెలిపిన 10 సంఘాల్లో కేవలం 5సంఘాలు మాత్రమే సమ్మె నోటీసులో సంతకం చేశాయి. నోటీసులో సంతకం చేసిన 5 సంఘాల సభ్యులు కూడా పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొనక పోవడంతో జిల్లాలో ఉపాధ్యాయుల సమ్మె వెలవెలపోతోంది.
 
 ఇదీ.. వాస్తవ పరిస్థితి
 రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలుగా విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఉండదు. రాష్ట్ర రెవెన్యూలో సింహభాగం అంటే 60 శాతం వరకు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల నుంచి 16 శాతం రెవెన్యూ వస్తోంది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రాబడిలో 76 శాతం ఒక్క తెలంగాణకే దక్కుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి కేవలం 24 శాతం రెవెన్యూ మాత్రమే వస్తోంది. అంటే భవిష్యత్తులో సీమాంధ్ర జిల్లాలో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. ఇక భవిష్యత్తులో పీఆర్‌సీ, డీఏల ఊసే ఉండదు.   విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఐటీ ఫార్మా పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. అంటే సీమాంధ్రలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల్లేనట్లే. సీమాంధ్రలోని జిల్లాల్లో కనీసం 400 మందికి ఉపాధి కల్పించే సంస్థ ఒక్కటీ లేదు.
 
 ఇక జల వివాదాల వల్ల సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ప్రాంతానికి దుర్భర పరిస్థితులు దాపురించనున్నాయి. ఈ పరిస్థితులను ముందుగానే ఊహించి ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. విద్యార్థులు వారికి తోడుగా నిలిచారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా జేఏసీగా ఆవిర్భవించి సమైక్యాంధ్ర ఉద్యమానికి తమ వంతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించి నిరసనలు తెలుపుతున్నాయి. ఇవేమీ మెజారిటీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు పట్టడం లేదు. సమాజహితాన్ని విస్మరించి కేవలం బెల్లు, బిల్లుకే పరిమితమవుతున్నారు. దీంతో ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ సెల్‌ఫోన్లలో మెసేజ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం స్వీపర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఎన్‌జీవోలు, డాక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌టీసీ, హెచ్‌ఎంలు, ఎంఈఓలు, జిల్లా అధికారులు, ఆర్‌డీఓలు, కుల సంఘాలు, హిజ్రాలు సైతం ఉద్యమిస్తున్నారు. మేధావులైన ఉపాధ్యాయులు మాత్రం దూరంగా ఉంటున్నారంటూ ఆ మెసేజ్‌ల సారాంశం. మరికొన్నింటిలో ఆర్థిక లాభం కలిగించే ఇంక్రిమెంట్లు, డీఏలు, పీఆర్‌సీల కోసం ఆందోళనలు చేసే టీచర్లుకు సమైక్యాంధ్ర పట్టదంటూ మెసేజ్‌లు ఇస్తున్నారు.
 సమ్మెలో ఐదు సంఘాలు
 సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాలన్నింటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమ్మెలో పాల్గొంటుండటంతో పాఠశాలలు మూతబడ్డాయి. జిల్లాలో మాత్రం ఐదు ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే సమ్మెకు మద్దతు తెలిపి డీఈఓకు నోటీసులిచ్చాయి. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, ప్రధానోపాధ్యాయుల సంఘం, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం, పీఆర్‌టీయూ, బీయీడీ ఉపాధ్యాయ సంఘం మాత్రమే నోటీసులో సంతకం చేశాయి. మిగిలిన సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నాయి. జిల్లాలోని 2940 ప్రాథమిక పాఠశాలల్లో 83069 మంది ఉపాధ్యాయులు, 428 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,339 మంది ఉపాధ్యాయులు, 441 హైస్కూళ్లలో 7015 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
 
 సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీ నాయకులు చెప్పిన వివరాల ప్రకారం 430 మంది హైస్కూలు హెడ్మాస్టర్లకు గాను 298 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. హైస్కూళ్లలో పనిచేసే స్కూలు అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు 1970 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. అంటే జిల్లాలోని మొత్తం ఉపాధ్యాయుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో పాల్గొనవద్దని ప్రచారం చేస్తున్న కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులైతే సమైక్యాంధ్ర పేరు ఉచ్ఛరించేందుకు కూడా ఇష్టపడటం లేదు. సమ్మెలో పాల్గొనవద్దంటూ మెసేజ్‌లు పంపుతూ ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తున్నారు. అదే తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా (ఓడీ) సాధించుకుని జీతాలు కూడా తీసుకున్నారు. ఇక్కడ మాత్రం ఉపాధ్యాయులు కుంటిసాకులు చెబుతూ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని సమైక్యాంధ్ర పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించకపోతే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినవారవుతారని పలువురు పేర్కొంటున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement