సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన కారణంగా ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఆమోదిం చిన ఫైళ్లకు కూడా మోక్షం లభించడం అనుమానమేనని అధికారవర్గాలు చెబుతున్నా యి. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే వీటికి పరిష్కారం లభిస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారవర్గాలు చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు ఇవీ..
2,500 పండిట్, 2,500 పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు సీఎం, ఆర్థిక శాఖల ఆమోదముద్ర పడింది. ఈ ఫై లు విద్యాశాఖకు చేరేసరికి ఆ శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సెలవులో వెళ్లడంతో జీవో నిలిచి పోయింది.
పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు హాఫ్ పే లీవ్‌ను నగదుగా మార్చుకొనే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. కానీ ఆర్థిక శాఖ కొర్రీ వేయడంతో ఫైల్ నిలిచిపోయింది.
ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే జాతీయ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే పేర్లతో కూడిన ఫైల్ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చేరలేదు.
ఎయిడెడ్ టీచర్లకు గ్రాంట్ విడుదల చేయకపోవడం వల్ల జనవరి నుంచి జీతాలు రావడంలేదు. గవర్నర్ గ్రాంట్ విడుదల చేయిస్తేనే జీతాలు అందుతాయి. లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఎయిడెడ్ టీచర్లకు పస్తులే.
స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసే ఫైలు ఆర్థిక, విద్యాశాఖల మధ్య తిరుగుతోంది. ఎన్నికల ముందు ఉత్తర్వులు రావడం అనుమానమే.
ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బందికి 2009 నుంచి కారుణ్య నియామకాలు అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు 2004-09 మధ్య కూడా ఈ నియామకాలు వర్తింపజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనికి పరిష్కారం లభించే అవకాశం లేనట్లేనని అధికారవర్గాలు అంటున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతల జోక్యంతో జరిగిన 800 మంది టీచర్ల బదిలీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కాంట్రాక్టు టీచర్ల సర్వీసు క్రమబద్దీకరణ కూడా రాష్ట్రపతి పాలన కారణంగా నిలిచిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు.