జెడ్పీ కొర్రీలు...టీచర్లకు కన్నీళ్లు | Teachers tears ZP tears | Sakshi
Sakshi News home page

జెడ్పీ కొర్రీలు...టీచర్లకు కన్నీళ్లు

Published Fri, Jul 18 2014 2:24 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

జెడ్పీ కొర్రీలు...టీచర్లకు కన్నీళ్లు - Sakshi

జెడ్పీ కొర్రీలు...టీచర్లకు కన్నీళ్లు

 విజయనగరం అర్బన్: ‘సర్వీసు చేసిన రోజులలో దాచుకున్న పీఎఫ్ సొమ్ము కోసం మూడు నెలలుగా జెడ్పీలోని పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెపుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అత్యవసరాల కోసం సకాలంలో సొమ్ము అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నా ను....’ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఆవేదన.ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉపాధ్యాయుని పరిస్థితి ఇది. పీఎఫ్ చట్ట నిబంధనల మేరకు ఉద్యోగ విరమణ పొందిన రోజునాటికి దాచుకున్న సొమ్ము చేతికి అందాలి. అయితే కనీసం నాలుగు నెలలపాటు పీఎఫ్‌కార్యాలయం చుట్టూ తిరిగితేగాని అందని పరిస్థితి ఉంది. అదే విధంగా పీఎఫ్ నిధి నుంచి రుణం కావాలన్నా.... నాలుగు నుంచి ఆరు నెలలపాటు తిరిగాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 స్లిప్‌లకూ తిప్పలే...
 జిల్లా పరిషత్ అధికారుల నిర్వాకంతో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల నుంచి ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ మినహాయిస్తున్నా ఎంత మొత్తంలో తమ ఖాతాలో ఉందో చెప్పేవారే కరువయ్యారు. చాలా జిల్లాల్లో పీఎఫ్ ఖాతాలు ఆన్‌లైన్ చేయగా   జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. 2012లో ఆన్‌లైన్ చేసినట్లు ప్రకటించి ఆ ఏడాదిలో ఒకేఒక సారి ఆన్‌లైన్ స్లిప్‌లు ఇచ్చారు. అది కూడా వడ్డీ కలపకుండా ఇచ్చారు. ఆ తరువాత నుంచి రెండేళ్లుగా నెలావారీ ఆన్‌లైన్ స్లిప్ ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో జిల్లా పరిషత్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన దాదాపు ఎనిమిది వేల మంది ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల నిర్వహణ అస్తవ్యస్తంగా  మారింది. ఏ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం సొమ్ము  ఉందో తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది.
 
 మరీ దా‘రుణం’
 ఉపాధ్యాయులకు ఆరు మాసాలుగా పీఎఫ్ సొమ్ము నుంచి రుణాలు ఇవ్వడం లేదు. ఇంట్లో శుభకార్యాలకు గాని, వైద్య ఖర్చులకు గాని పీఎఫ్ ఖాతాలోని సొమ్మును రుణంగా పొందే వెసులుబాటు ఉంది. ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ము ఆధారంగా వివిధ అవసరాల నిమిత్తం ఈ నిధి నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకొనే వారికి చెల్లింపులు చేసే బాధ్యత జెడ్పీ డెప్యూటీ సీఈవోది. ఈ పోస్టు కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. ఆరు నెలల వ్యవధిలో దాదాపు 400కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఖాతాలు సెటిల్ చెయ్యని ఉద్యోగ విరమణ ఉపాధ్యాయులు 15 మంది వరకు మూడు నెలలుగా తిరుగుతున్నారు.
 
 సమాధానం చెప్పే వారేలేరు?
 జిల్లా పరిషత్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు ఎనిమిది వేల మంది ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ము వివరాలను తెలియజేసేందుకు ప్రత్యేక ఆపరేటర్‌ను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేశారు. ఎవరైనా ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో చెప్పాలని ఇక్కడకు ఫోన్ చేస్తే కంప్యూటర్ పనిచేయడం లేదని, వివరాలు అందుబాటులో లేవని సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నారు. ఉదాహరణకు ఉపాధ్యాయుని పీఎఫ్ ఖాతాలో రూ. 2 లక్షల నగదు ఉంటే అందులో లక్ష రూపాయల వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది. వైద్య అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు తదితర అవసరాల వరకు 80 శాతం వరకు పీఎఫ్ సొమ్ము నుంచి రుణంగా అందించే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ ఈ వ్యవమారాలన్నీ చూడాల్సిన ఉండగా ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో  జెడ్పీ సీఈఓ ఈ బాధ్యతలను పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పీఎఫ్ రుణం కోసం దూరప్రాంతం నుంచి జిల్లా పరిషత్‌కు వస్తే డెప్యూటీ సీఈఓ, పీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో తమకు సమాధానం చెప్పేవారే కరువయ్యారని వాపోతున్నారు. రుణం కోసం దరఖాస్తు చేసుకుని ఒకటికి పదిసార్లు అధికారుల అనుమతి పొందినా ట్రెజరీలో హెడ్ ఆఫ్ ఎకౌంట్ రావాలని చెప్పి మరింత జాప్యం చేస్తున్నారని  ఆరోపిస్తున్నారు.
 
 తప్పించుకుంటున్న హెచ్‌ఎంలు, ఎంఈఓలు
 ఉపాధ్యాయులకు సంబంధించి పీఎఫ్ సొమ్ము ఖాతాల నిర్వహణ, రుణాల మంజూరు తదితర పనులు జిల్లా పరిషత్ అధికారులకు భారంగా మారడంతో ప్రభుత్వం ఈ బాధ్యతలను ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలకు, మండలస్థాయిలో ఎంఈఓలకు అప్పగించింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఆయా ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈఓలు ముందుకు రావడం లేదు. పీఎఫ్ సొమ్ము నుంచి రుణాలు మంజూరు చేసే విధివిధానాలు తమకు తెలియవని వారు చెప్పి తప్పించుకుంటున్నారు.  గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిన జెడ్పీ సీఈఓ ఆయా ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం, ఎంఈఓలకు పీఎఫ్ సొమ్ము రుణాల మంజూరుకు సంబంధించి విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆ బాధ్యతను వారికి అప్పగించాల్సి ఉండగా ఇంతవరకు ఆ పని జరగలేదని  ఉపాధ్యాయులు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన సమయంలోనూ  ఉపాధ్యాయులు పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్ చేయకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకుండా, జెడ్పీ డెప్యూటీ సీఈఓ పోస్టును భర్తీ చేయకుండా ఉండటంతో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇబ్బందుల పాలవుతున్నారు.    నూతన కలెక్టర్ కలుగుజేసుకొని చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement