
గాజులమండ్యం ఎస్‌వీ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న టెక్నికల్ కమిటీ
గత ఐదేళ్లుగా ఖాయిలాపడ్డ కర్మాగారానికి పూర్వవైభవం ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూసిన వేలాది వెతల జీవుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెరకు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా అడుగులు పడుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గత ప్రభుత్వంలో మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఓ టెక్నికల్ కమిటీని నియమించారు. ఆ కమిటీ సభ్యులు మంగళవారం గాజులమండ్యం ఎస్‌వీ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు.
సాక్షి, రేణిగుంట: చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. దీంతో మోడువారిన రైతులు, ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీలోని చీఫ్ ఇంజినీరు పి.ప్రసాద్‌రావు, చీఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కెవి రమణ, అడ్వైజర్ కె.రవికుమార్‌తో కూడిన సభ్యులు మంగళవారం గాజులమండ్యం ఎస్‌వీ షుగర్ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. అక్కడ ఫ్యాక్టరీలోని భవనాలు, యంత్ర పరికరాలను పరిశీలించారు. మిల్‌హౌస్, బ్రాయలర్, గ్రావర్ సెక్షన్, పవర్ హౌస్, బాయిలింగ్ సెక్షన్, మొలాసిస్ ట్యాంకులను, స్ప్రే బాండ్, ఈటీ ప్లాంటులను చూశారు.
ప్రస్తుతం యంత్ర పరికరాలు పనిచేసే స్థితిలో ఉన్నా యా అని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చక్కెర నిల్వ చేసే గిడ్డంగులను పరిశీలించారు. ఫ్యాక్టరీ సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తమకు ఐదేళ్లుగా వేతనాలను చెల్లించలేదని, ప్రభుత్వం బకాయిలను చెల్లించి ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తే ఫ్యాక్టరీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే దిశగా శ్రమిస్తామని సిబ్బంది వారి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఈ సీజన్‌లోనే లక్ష టన్నుల చెరకు తరలించేందుకు సిద్ధమని కొందరు రైతులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 50మంది ఫ్యాక్టరీ సిబ్బందితో పాటు రైతులతోనూ కర్మాగారం స్థితిగతులపై చర్చించి కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలను తీసుకున్నారు.
రాష్ట్రంలో ఆరు కర్మాగారాలపై నివేదిక
రాష్ట్రంలో చిత్తూరు జిల్లా గాజులమండ్యం ఎస్‌వీ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, కడప జిల్లా చెన్నూరు మండలంలోని సహకార షుగర్ ఫ్యాక్టరీ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ, తెనాలి, అనకాపల్లి షుగర్ ప్యాక్టరీలను ఈ బృంద సభ్యులు పరిశీలించి ఫ్యాక్టరీ స్థితిగతులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు కమిటీ బృందం వివరించింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని వివరించింది.
నేడు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీకి టెక్నికల్ కమిటీ
చిత్తూరు అగ్రికల్చర్: చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టెక్నికల్ కమిటీ బుధవారం రానుంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను పునఃçప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ముం దస్తుగా ఆయా ఫ్యాక్టరీల స్థితిగతులు, యంత్రాల పరిస్థితులను పరిశీలించేందుకు గాను టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ మంగళవారం జిల్లాలోని గాజులమండ్యం ఫ్యాక్టరీని పరిశీలించింది. అదేవిధంగా బుధవారం చిత్తూరులో మూతపడిన సహకార షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించనుంది. ఉదయం 8.30 గంటలకు ఫ్యాక్టరీ వద్దకు కమిటీ సభ్యులు రానున్నారని ఫ్యాక్టరీ జనరల్ మేనేజరు వెంకటరమణరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment