సాక్షి, అమరావతి: ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు ఇట్టే పట్టేస్తారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నేర సమాచారం పోలీస్ అధికారుల చుట్టూ వైఫై మాదిరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని ఏం జరిగినా.. నేర స్వభావం బట్టి పోలీస్ రికార్డుల ద్వారా ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు గట్టి కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నేర చరిత్ర మొత్తం పోలీస్ చేతిలో ఉండేలా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటున్నారు. పోలీస్ రికార్డులకు ఎక్కిన, జైళ్లలో ఉన్న వారి వివరాలు ఇప్పటికే ప్రతి పోలీస్ అధికారికి అందుబాటులోకి వచ్చాయి.
వీటితోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించిన వారి వివరాలను ఈ కోర్ట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా సేకరించారు. వీటితోపాటు రాష్ట్రంలో గల దాదాపు 21 వేల మంది రౌడీ షీటర్లు, 28 వేల మంది హిస్టరీ షీట్లు కూడా ఆన్‌లైన్ చేయడంతో అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులోకి వచ్చాయి. పోలీస్, జైల్స్, ఈ–కోర్ట్స్, రౌడీ షీటర్స్, హిస్టరీ షీట్స్ ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. వాటిని సైతం పోలీసులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇది అనేక నేరాల్లో ప్రాథమిక దర్యాప్తునకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు తమ వద్ద ఉన్న ఆన్‌లైన్ రికార్డుల్లోని సమాచారాన్ని చూసుకుని నేర స్వభావాన్ని బట్టి నేరస్తులను గుర్తు పట్టే ప్రయత్నం జరుగుతుంది.
కీలక అంశాలేమిటంటే..
►ఎవరైనా.. ఏదైనా కేసులో నేరస్తుడు, బాధితుడు, ఫిర్యాదుదారు, సాక్షిగా ఉంటే ఆ వివరాలన్నీ పోలీస్ స్టేషన్, జైలు, కోర్టు రికార్డుల ద్వారా పోలీసులకు ఇట్టే తెలుస్తాయి.
►సంబంధిత రికార్డులన్నిటినీ పోలీస్ రికార్డులకు అనుసంధానం చేసి ప్రతి పోలీస్ స్టేషన్, పోలీస్ అధికారులకు అందుబాటులోకి తెస్తున్నారు.
►ఈ వివరాలను కంప్యూటర్, మొబైల్ ద్వారా చూసుకుని నేర పరిశోధనలో ముందడుగు వేసే అవకాశం పోలీసులకు కలుగుతోంది.
►ఓ వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒక్కసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే ఆ వివరాలు నేర చరిత్రలో నమోదై రాష్ట్రంలోని పోలీసులందరికీ చేరతాయి.
►పోలీస్ శాఖ చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో నమోదైన వివరాలను సైతం ఆన్‌లైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు.
►రెండు కేసుల్లో నేరస్తునిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే అతనిని జీవితాంతం పోలీసుల నిఘా వెంటాడుతుంది.
►రౌడీషీట్, హిస్టరీ షీట్ ఉన్న వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వారి కదలికలపై దృష్టి పెట్టడంతోపాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసేలా చర్యలు తీసుకుంటారు.
నేర పరిశోధనలో కీలకం
నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతోంది. అనేక కేసుల్లో పోలీసుల వద్ద ఉండే ప్రాథమిక సమాచారం దర్యాప్తులో ఉపయోగపడుతుంటుంది. నేర స్వభావం కలిగిన వ్యక్తులు, ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు చేస్తుంటారు.. ఎవరు ఎక్కువగా చేస్తుంటారు అనే కీలక వివరాలను పోలీసులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతోనే ఈ ప్రక్రియను చేపట్టాం. సాధ్యమైనన్ని వివరాలు పోలీసులకు అందుబాటులో ఉంచాలనే పోలీస్ రికార్డులు, ఈ–ప్రిజన్స్, ఈ కోర్ట్స్ విభాగాల సమాచారాన్ని ఒక అప్లికేషన్ (యాప్) ద్వారా నిక్షిప్తం చేసి రాష్ట్రంలోని పోలీసులకు అందిస్తున్నాం. నేరస్తుల ఫొటోలు, వేలి ముద్రలు, చిరునామా తదితర పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్ల దర్యాప్తు సులభతరం అవుతోంది. దీనిని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి పోలీసులకు అందిస్తాం.
– గౌతమ్ సవాంగ్, డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment