Crime Alert system
-
డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి?
జనాన్ని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాలను కనుగొంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ పేరిట నూతన తనహా వంచనకు తెర లేపుతున్నారు. ఈ పద్దతిలో సైబర్ నేరగాళ్లు పోలీసు, సీబీఐ లేదా కస్టమ్స్ అధికారులుగా నటించి, తాము టార్గెట్ చేసుకున్న వారికి ఫోన్ చేసి, వారిని ఇంట్లో బందీలుగా మారుస్తున్నారు. అనంతరం వారి బ్యాంక్ ఖాతాలోని సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఇదే కోవలో ఇంటి తాకట్టు మోసానికి సంబంధించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.ఆర్బీఐ ఇటీవల వెలువరించిన ఒక నివేదికలోని వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రూ. 302.5 బిలియన్లు అంటే రూ. 30 వేల కోట్లకు పైగా డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో అంటే జూన్ 1, 2014 నుండి మార్చి 31, 2023 వరకు భారతీయ బ్యాంకులలో 65,017 మోసం కేసులు నమోదయ్యాయి. రూ. 4.69 లక్షల కోట్ల మేరకు చీటింగ్ జరిగింది. యూపీఐ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, ఓటీపీ స్కామ్, జాబ్ స్కామ్, డెలివరీ స్కామ్ మొదలైన వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతి ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది.మోసగాళ్లు తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇంట్లో బంధించి, వారిని మోసం చేసేందుకు ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆడియో, వీడియో కాల్స్ చేస్తూ, అలజడి వాతావరణాన్ని సృష్టిస్తారు. స్కామర్లు ఏఐ సాయంతో రూపొందించిన వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా పోలీసులు లేదా అధికారుల మాదిరిగా నటించి, బాధితుల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌తో తప్పులు దొర్లాయని చెబుతారు. ఇంతటితో ఆగకుండా ఆ మోసగాళ్లు అధికారులుగా నటిస్తూ, తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇళ్లలో బంధించి, వారికి అరెస్టు భయం కల్పించడంతోపాటు, వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో అరెస్టు, పరువు నష్టం భయంతో బాధితులు స్కామర్ల ఉచ్చులో సులభంగా పడిపోతారు. దీంతో నిండా మోసపోతుంటారు.ఈ రకమైన మోసానికి గురికాకుండా ఉంటాలంటే విజిలెన్స్ సహకారం అవసరం. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు విజిలెల్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఇటువంటి సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథి వెబ్సైట్లో చక్షు పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి తోడు ఇలాంటి మోసాల బారిన పడినవారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు. ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థ ఎవరినీ పిన్, లేదా ఓటీపీని అడగదు. ఇటువంటి సందర్భాల్లో పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఆన్లైన్ మోసాల నివారణకు సోషల్ మీడియాతోపాటు బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం ఉత్తమమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
సినిమా స్టైల్ క్రైం స్టోరీ : ‘ముక్కోటి’కి ముందురోజే ముహూర్తం..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మానకొండూరు: కాల్పుల మోతతో మానకొండూరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పల్లెలో తుపాకులు గర్జన విని జనం భీతిల్లారు. రౌడీషీటర్ అరుణ్‌పై కత్తులు, తుపాకులతో జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేరచరిత్ర కలిగిన అరుణ్ ఆది నుంచి వివాదాస్పదుడే. వరుసగా ఇతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత సీపీ సత్యనారాయణ ఇతనికి కమిషరేట్ నుంచి బహిష్కరణ విధించారు. ఇటీవల కమిషనరేట్ బహిష్కరణ పూర్తిచేసుకుని వచ్చిన అరుణ్‌పై తుపాకులతో హత్యాయత్నం జరగడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటనకు బీజం ఇప్పుడు పడింది కాదు, పాత కక్షల నేపథ్యంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ముందురోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ప్రధాన నిందితుడు సాయితేజ్ హనుమాన్ ఆలయంలోనే అరుణ్‌ని చంపుతానని ప్రతినబూనాడు. వస్తూనే దాడి.. కాల్పులు ● పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ఉండే వీణవంక సాయితేజ్ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ముందురోజు రాత్రి (నూతన సంవత్సరం రోజు) జీఎం కాలనీలోని హనుమాన్ గుడిలో తన సోదరి మరణానికి కారణమైన ‘మానకొండూరు అరుణ్ గాని తలకాయ కోసి.. జీఎం కాలనీ చౌరస్తాలో పెట్టకపోతే నేను సూరి కొడుకునే కాదు’ అని శపథం చేశాడు. ● ఈ విషయాన్ని పలువురు స్థానికులు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఈ వీడియో కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో ‘సాక్షి’ చేతికి చిక్కింది. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న సాయి.. బుధవారం అర్ధరాత్రి తన మిత్రులు భువనగిరి జిల్లా దత్తారుపల్లికి చెందిన పాల మల్లేశ్, మానకొండూరు మండలం కెల్లెడ గ్రామానికి చెందిన బైరగోని మధు, గోదావరిఖనికి చెందిన చంటితో కలిసి రాత్రి 9 గంటల సమయంలో వాహనంలో మానకొండూరుకు వచ్చాడు. ● వెల్ది గ్రామానికి వెళ్లే మార్గం నుంచి వీరు గ్రామంలోకి తుపాకీ, కత్తులతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 9.30 గంటల సమయంలో అరుణ్ తన ఇంటి ముందు సోదరులతో కలిసి మద్యం తాగుతుండగా.. వీరికి తారసపడ్డాడు. వారిని చూడగానే భయంతో అరుణ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ● అతడిని వెంబడించిన నలుగురు బీరు బాటిళ్లతో దాడిచేశారు. అడ్డువచ్చిన అరుణ్ భార్య సుమ, పెద్ద కూతురు వైష్ణవిని తుపాకీ చూపించి తీవ్రంగా కొట్టారు. పారిపోతున్న అరుణ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరపగా గురితప్పాయి. ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. అరుణ్‌పై కోపంతో సదరు ఇంట్లోని ఐదుగురు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా, రక్తాలు కారేలా కొట్టారు. ● వీరి అరుపులు విన్న స్థానికులు వచ్చారు. వచ్చిన వారిని తుపాకీ చేతబూనిన వ్యక్తి బెదిరించి పంపాడు. తరువాత చాలామంది రావడంతో సాయితేజ్ పరారు కాగా.. పాలమల్లేశ్, మధును పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ● పేలని బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడింది కంట్రీమేడ్ తుపాకీ (తపంచా) అని తూటా ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. మరో నిందితుడు చంటి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడని సమాచారం. తనకు సంబంధం లేదంటున్న అరుణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిందితులు గోదావరిఖనికి చెందిన సాయితేజ్, చంటి, మరో ఇద్దరు మిత్రులు అని వెల్లడించాడు. ఎందుకు దాడి చేశారు..? అని అడిగిన ప్రశ్నకు.. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని, తనకువారితో ఎలాంటి సంబంధమూ లేదని, వారు గంజాయి విక్రయిస్తారని తెలిపాడు. సంబంధం లేని వ్యక్తి చేసే పని, చిరునామా, పేరుతో సహా ఎలా తెలపగలిగాడు..? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. అతనికి సాయితేజకు ఉన్న వైరం ఏంటీ..? అతని సోదరి మరణంలో అరుణ్ ప్రమేయం ఎంతవరకు ఉంది..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితులకు, బాధితుడికి నేరచరిత ఉన్న విషయం వాస్తవమేనని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు ‘సాక్షి’కి తెలిపారు. నిందితుల కోసం మొత్తం మూడు బృందాలు సాయి కోసం గాలిస్తున్నాయి. ఇందులో రెండు హైదరాబాద్‌కు వెళ్లగా.. ఒక టీం గోదావరిఖనికి వెళ్లినట్లు సమాచారం. బిహార్ నుంచి ఆయుధం..? ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికి ఆయుధం ఎక్కడిది..? అన్న విషయంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుపాకీ కాల్చడంలో నిందితులకు అనుభవం లేదని తాజా ఘటనతో తేలిపోయింది. బుల్లెట్లు వేగంగా లోడు చేయలేకపోవడం.. గురిచూసి కాల్చలేకపోయిన విధానాన్ని బట్టి నిందితులు ఇటీవలే తుపాకీ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. రెండు నెలల క్రితం ఓ కేసు విషయంలో సాయి సెల్లోకేషన్ బిహార్‌లో చూపించిందని గోదావరిఖని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అతను కాశీయాత్రకు వెళ్లి వచ్చాడని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సాయికి బిహార్‌లో మిత్రులు ఉండి ఉంటారని, వారి ద్వారానే ఆయుధం కొని ఉంటాడని అనుమానిస్తున్నారు. మాట్లాడకుండానే.. దాడి చేశారు.. మానకొండూర్‌లో ఉన్న మా అత్త గారింటికి నా పిల్లలను చూసేందుకు వచ్చాను. బుధవారం రాత్రి అన్నం తిని బయట ఉండగా గొడవ అవుతోంది. ఈ లోగానే అరుణ్ మా ఇంటి వైపు వచ్చాడని కొందరు మా ఇంటివైపు పరుగు తీసుకుంటూ వచ్చారు. వాడేడి అంటూ ఆగ్రహంతో నాపై స్టీలు ప్యాల క్యాన్‌తో దాడి చేశారు. తల పగిలి రక్తస్రావం జరిగింది. ఇంట్లో వాళ్లపై దాడి చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తర్వాత భయాందోళనతో చాలా సేపు తలుపు వేసుకుని ఇంట్లోనే ఉన్నాం, పోలీసులు వచ్చాక బయటకు వచ్చా. – బీరం శ్రీనివాస్, గాయపడ్డ వ్యక్తి -
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు.. అయినా పని చేయని మూడో నేత్రం
సాక్షి, అంబర్‌పేట( హైదరాబాద్): అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసుస్టేషన్ పరిధిలో ఎల్ అండ్ టీ కమ్యూనిటీ పోలీస్, నేను సైతం కార్యక్రమాల పేరిట సుమారు నాలుగు వేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను ప్రోత్సహించి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలో దాదాపు 50 శాతం కెమెరాలు పని చేయడం లేదు. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు లేకుండా పోతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించిన పోలీసులు వాటి నిర్వహణను ప్రోత్సహించకపోవడం గమనార్హం. 50 శాతం కెమెరాలు పని చేయకపోవడంతో ఘటన జరిగినప్పుడు నేరాలను ఛేదించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలోని కెమెరాల నిర్వహణపై స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించాలని పలువురు కోరుతున్నారు. సాక్ష్యాలు కనుమరుగు పోలీసుస్టేషన్ పరిధిలోని శివంరోడ్డు, సీపీఎల్ రోడ్, గోల్నాక, అంబర్‌పేటలోని ప్రధాన రోడ్లు, ప్రధాన ప్రాంతాలైన డీడీకాలనీ, తులసీరాంనగర్ కాలనీ, అనంతరాంనగర్ కాలనీతో పాటు నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అంబర్‌పేటలోని ప్రధాన రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన కెమెరాలు పని చేయని పరిస్థితి వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే పోలీసులు సులువుగా సీసీ టీవీ కెమెరాలను చూద్దామని వెళుతున్నారు. దీంతో అవి పని చేయలేదన్న విషయాన్ని అప్పుడు గానీ తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పలు కేసులకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. నిర్వహణ బాధ్యత స్థానికులదే ‘నేను సైతం, కమ్యూనిటీ పోలీసు’ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ప్రజల బాధ్యతే. అవి పని చేయకపోతే వారే మరమ్మతులు చేసుకోవాలి. ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల నిర్వాహణ ప్రత్యేక ఏజెన్సీ చూస్తున్నది. పోలీసుస్టేషన్ పరిధిలో పని చేయని కెమెరాలను గుర్తించి పని చేసేలా చొరవ తీసుకుంటాను. – సుధాకర్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
నేరం చేస్తే ఇట్టే పట్టేస్తారు
సాక్షి, అమరావతి: ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు ఇట్టే పట్టేస్తారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నేర సమాచారం పోలీస్ అధికారుల చుట్టూ వైఫై మాదిరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని ఏం జరిగినా.. నేర స్వభావం బట్టి పోలీస్ రికార్డుల ద్వారా ప్రాథమిక అంచనాకు వచ్చేందుకు గట్టి కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నేర చరిత్ర మొత్తం పోలీస్ చేతిలో ఉండేలా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటున్నారు. పోలీస్ రికార్డులకు ఎక్కిన, జైళ్లలో ఉన్న వారి వివరాలు ఇప్పటికే ప్రతి పోలీస్ అధికారికి అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించిన వారి వివరాలను ఈ కోర్ట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా సేకరించారు. వీటితోపాటు రాష్ట్రంలో గల దాదాపు 21 వేల మంది రౌడీ షీటర్లు, 28 వేల మంది హిస్టరీ షీట్లు కూడా ఆన్లైన్ చేయడంతో అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులోకి వచ్చాయి. పోలీస్, జైల్స్, ఈ–కోర్ట్స్, రౌడీ షీటర్స్, హిస్టరీ షీట్స్ ఉన్న వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వాటిని సైతం పోలీసులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇది అనేక నేరాల్లో ప్రాథమిక దర్యాప్తునకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎక్కడ ఏ నేరం జరిగినా పోలీసులు తమ వద్ద ఉన్న ఆన్లైన్ రికార్డుల్లోని సమాచారాన్ని చూసుకుని నేర స్వభావాన్ని బట్టి నేరస్తులను గుర్తు పట్టే ప్రయత్నం జరుగుతుంది. కీలక అంశాలేమిటంటే.. ►ఎవరైనా.. ఏదైనా కేసులో నేరస్తుడు, బాధితుడు, ఫిర్యాదుదారు, సాక్షిగా ఉంటే ఆ వివరాలన్నీ పోలీస్ స్టేషన్, జైలు, కోర్టు రికార్డుల ద్వారా పోలీసులకు ఇట్టే తెలుస్తాయి. ►సంబంధిత రికార్డులన్నిటినీ పోలీస్ రికార్డులకు అనుసంధానం చేసి ప్రతి పోలీస్ స్టేషన్, పోలీస్ అధికారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ►ఈ వివరాలను కంప్యూటర్, మొబైల్ ద్వారా చూసుకుని నేర పరిశోధనలో ముందడుగు వేసే అవకాశం పోలీసులకు కలుగుతోంది. ►ఓ వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒక్కసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే ఆ వివరాలు నేర చరిత్రలో నమోదై రాష్ట్రంలోని పోలీసులందరికీ చేరతాయి. ►పోలీస్ శాఖ చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో నమోదైన వివరాలను సైతం ఆన్లైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ►రెండు కేసుల్లో నేరస్తునిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే అతనిని జీవితాంతం పోలీసుల నిఘా వెంటాడుతుంది. ►రౌడీషీట్, హిస్టరీ షీట్ ఉన్న వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వారి కదలికలపై దృష్టి పెట్టడంతోపాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసేలా చర్యలు తీసుకుంటారు. నేర పరిశోధనలో కీలకం నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతోంది. అనేక కేసుల్లో పోలీసుల వద్ద ఉండే ప్రాథమిక సమాచారం దర్యాప్తులో ఉపయోగపడుతుంటుంది. నేర స్వభావం కలిగిన వ్యక్తులు, ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు చేస్తుంటారు.. ఎవరు ఎక్కువగా చేస్తుంటారు అనే కీలక వివరాలను పోలీసులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతోనే ఈ ప్రక్రియను చేపట్టాం. సాధ్యమైనన్ని వివరాలు పోలీసులకు అందుబాటులో ఉంచాలనే పోలీస్ రికార్డులు, ఈ–ప్రిజన్స్, ఈ కోర్ట్స్ విభాగాల సమాచారాన్ని ఒక అప్లికేషన్ (యాప్) ద్వారా నిక్షిప్తం చేసి రాష్ట్రంలోని పోలీసులకు అందిస్తున్నాం. నేరస్తుల ఫొటోలు, వేలి ముద్రలు, చిరునామా తదితర పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం వల్ల దర్యాప్తు సులభతరం అవుతోంది. దీనిని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి పోలీసులకు అందిస్తాం. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
దొంగ సూది
సూది మందు ప్రాణం పోయడానికి...తీయడానికి కాదు.జీవించాలంటే కష్టం చేయాలి...నేరం కాదు.ఎత్తున ఎగిరే రాబందు కూడానేలకు దిగాల్సిందేతప్పించుకుని తిరిగే నిందితుడు చట్టానికి చిక్కాల్సిందే డిసెంబర్ 21– 2014. రాత్రి 11 గంటలు. నల్లగొండ జిల్లా భువనగిరి పరిధిలోని బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్.ఫోన్ మోగింది.‘సార్.. మర్యాల శివారులో ఎవరిదో శవం పడి ఉంది సార్. బాడీ అంతా కాలిపోయి ఉంది’ అని ఎవరో గ్రామస్తుడు çకంగారుగా సమాచారం అందించాడు. బొమ్మలరామారం ఎస్ఐ ప్రసాద్ వెంటనే పోలీసులను తీసుకుని అక్కడకు వెళ్లాడు.పొదల సమీపంలో ఒక శవం పడి ఉంది.ఇంకా కమురు వాసన పోలేదు. 90 శాతం కాలిపోయి ఉంది. ప్యాంటూ షర్టూ ఉన్నాయి. మగ మనిషే.రాత్రి కావడం, శవం ఉండటంతో నలుగుదైరుగు గ్రామస్తులు కూడా అటుగా రాలేదు. కనుక ఏ వివరాలు తెలియలేదు. ‘బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపండి’ అన్నాడు ఎస్.ఐ ఏర్పాట్లను పురమాయిస్తూ. రెండు రోజులు గడిచాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ఊపిరాడకుండా చేయడం వల్ల మరణం సంభవించిందని తేలింది. అంటే చంపేసి తెచ్చి కాల్చి ఉండాలని అర్థమైంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకో వివరం కూడా చెప్పింది. ‘చేతికి ఇస్లాం చిహ్నం ఉన్న వెండి ఉంగరం ఉంది. సున్తీ చేసిన అనవాళ్లు ఉన్నాయి. కనుక ఇతను ముస్లిం కావచ్చు’...ఆ ప్రాంతంలో పెద్దగా ముస్లిం జనాభా లేదు. ఈ వ్యక్తి ఎక్కడి వాడు?‘సార్... చుట్టుపక్కల జిల్లాల మిస్సింగ్ కేసులు చూద్దాం’ అన్నాడు కానిస్టేబుల్.‘ఆ పని మొదలెట్టండి’ అన్నాడు ఎస్.ఐ.వెంటనే పోలీసులు ఆన్లైన్ వెరిఫికేషన్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను జల్లెడ పట్టడం ప్రారంభించారు. గత పదిహేను రోజులుగా నమోదైన కేసుల వివరాలను గమనించారు. ఏమీ లాభం లేకపోయింది. కాని రెండు రోజుల తర్వాత నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు వారిని ఆకర్షించింది. మృతుని ముఖకవళికలు సరితూగాయి. వెంటనే నిజామాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. మార్చురీలో ఉన్న శవాన్ని గుర్తించి భోరుమన్నారు.‘సార్. ఇతని పేరు ఇలియాస్. కారు డ్రైవర్.’ చెప్పారు బంధువులు.‘శత్రువులు ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు ఎస్.ఐ.‘ఎవరూ లేరు సార్. చాలా మంచివాడు. కష్టపడి పని చేస్తాడు. అతడికి కారు ఉంది. దానిని దొంగలించడానికే చంపి ఉంటారు’ అన్నారు వాళ్లు.ఇలియాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలియాస్ మృతదేహం చూసి కన్నీరు మున్నీరవుతున్న వారిని చూసి ఎస్.ఐకు కడుపులో దేవినట్టయ్యింది.‘అమాయకుణ్ణి చంపినవాళ్లను వదిలిపెట్టను’ అనుకున్నాడు. హంతకులకు సంబంధించి ఎలాంటి మిగతా ఆధారాలు లభించకపోవడంతో టెక్నాలజీని వాడుకోవాలన్న ఆలోచనతో వెంటనే టవర్ డంప్‌పై దృష్టి పెట్టారు. మర్యాల శివారులో ఉన్న సెల్‌పోన్ టవర్, కుకూనూర్పల్లి పోలీస్‌స్టేషన్, కరీంనగర్, నిజామామాద్, కొండగట్టు, గజ్వెల్ ప్రాంతాలలోటవర్డంప్ ద్వారా యాక్టివ్ కాల్స్ సాగిన నెంబర్లను సేకరించారు. అయితే చాలా నెంబర్లు స్థానికులవే కావడంతో వారందరిలో నిందితులు లేరని నిర్ధారించుకున్నారు. అయితే హంతకులు ఎవరు? దాదాపు సంవత్సరం గడిచిపోయింది.నవంబర్ 10. 2015.ఎస్.ఐ ప్రసాద్‌కి ఫోన్ వచ్చింది. చేసింది కుకూనూర్ పల్లి ఎస్.ఐ.‘మా ఏరియాలో ఒక కారు దొంగతనం జరిగింది. కిరాయికి మాట్లాడుకున్నవారు డ్రైవర్ కంట్లో కారం కొట్టి మత్తు మందు ఇచ్చి కారుతో పాటు ఉడాయించారు. మీ స్టేషన్ పరిధిలో బాడీ దొరికిన ఇలియాస్ కేసులో ఉన్నది వీళ్లే కావచ్చు’ అన్నాడు ఎస్.ఐ.వెంటనే ఎస్.ఐ ప్రసాద్ రంగంలో దిగి అటాక్‌కు గురైన డ్రైవర్ని కలిశాడు.‘వాళ్లు మొత్తం నలుగురు. కిరాయికి మాట్లాడుకుని బయలుదేరారు. దారిలో పాస్‌కు ఆపమన్నారు. నేను స్లో చేసి ఆపుతుండగానే కంట్లో కారం చల్లారు. తర్వాత ఏదో గుచ్చినట్టుగా అనిపించింది. బహుశా సిరంజీ కావచ్చు. లేచాక చూస్తే రోడ్డు పక్కన పడి ఉన్నాను. వాళ్లు నా ఏ.టి.ఎం కార్డును కూడా తీసుకెళ్లారు’ అన్నాడు.‘వాళ్లను ఇంతకు ముందు చూశావా?’‘లేదు సార్. పూర్తిగా కొత్తవాళ్లు’పోలీసులు వెంటనే కారు కోసం వేట ప్రారంభించారు. కాని నిందితులు కారు నంబర్ మార్చేయడంతో ఆ పని కష్టమైంది. మరోవైపు నేర చరిత్ర ఉన్న ఆర్.ఎమ్.పి డాక్టర్ల గురించికూడా కూపీ లాగడం మొదలైంది. సిరంజీ ఆపరేట్ చేస్తున్నారంటే మెడికల్ ఫీల్డ్‌కు సంబంధం ఉన్నవాళ్లే అయి ఉండాలి.ఇంతలో ఎస్.ఐ ప్రసాద్‌కు అటాక్ అయిన డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది.‘సార్. నా ఏ.టి.ఎం కార్డుతో వాళ్లు డబ్బు డ్రా చేశారు. ఆ కార్డు మీద నేను నా పిన్ నంబర్ రాసుకుని ఉన్నాను మర్చిపోతానని. అందువల్ల డ్రా చేశారు. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది’ అన్నాడతను.వెంటనే డ్రా ఎక్కడ చేశారన్న విషయం కూపీ లాగారు.వరంగల్ జిల్లా ఖాజీ పేట ఏ.టి.ఎం.సిసి కెమెరా ఫుటేజ్‌ను వెలికి తీశారు. డ్రా చేస్తున్న వ్యక్తి కనిపించాడు.‘ఇతనే సార్. నా కారు ఎక్కింది’ అన్నాడు డ్రైవర్.వెంటనే నిందితుని ఫొటో అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లింది. పాత నేరస్తుల ఫొటోలతో ట్యాలీ చేసి చూడటం పూర్తయ్యింది. నాలుగు రోజుల తర్వాత కరీం నగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు తన గ్యాంగ్‌తో ఇలియాస్ హత్య ఎలా చేశాడో వివరించాడు. డిసెంబర్ 20. 2014. నిజామాబాద్. ఆ టౌన్‌లోని ఎండి.ఇలియాస్ అహ్మద్‌కు íస్విఫ్ట్ డిజైర్ కారు ఉంది. అద్దెకు తిప్పుతుంటాడు. ఆ రోజు అతని దగ్గరకు కొత్త వ్యక్తులు నలుగురు వ్యక్తులు వచ్చారు. ‘మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులం. వేములవాడ వెళ్లడానికి కారు కావాలి’ అని అడిగారు. వచ్చింది మంచి బేరం అని ఇలియాస్‌కు సంతోషం కలిగింది. వెంటనే బయలు దేరాడు.‘ఈ దారి వద్దు. ఇది హైవే.అనవసరంగా టోల్గేట్లకు డబ్బు కట్టాలి. సరదాగా అడ్డదారిలో వెళదాం’ అన్నారు వాళ్లు.కారు బయలుదేరింది. ఆ నలుగురు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకచోట వైన్ షాప్ కనిపిస్తే ఆపమన్నారు.ఇలియాస్కి ఇది ఆడ్‌గా అనిపించింది.‘దేవుడి పని మీద వెళుతూ మందు తాగుతారా?’ అని అడిగాడు.‘అబ్బెబ్బె... దర్శనం అయ్యాక తాగుదామని’ అని కవర్ చేశారు వాళ్లు.కారు వేములవాడ చేరుకుంది. దేవస్థానం పార్కింగ్ ఏరియాలో కారు ఆపాడు ఇలియాస్.‘మీరు దర్శనానికి వెళ్లి రండి’ అన్నాడు.దిగిన నలుగురూ దేవస్థానం వైపు వెళ్లారు. కాని గుడిలోని సిసి కెమెరాలకు చిక్కుతామన్న భయంతో లోపలకే వెళ్లలేదు. బయటే తచ్చాట్లాడి గుడికి ఆవల మద్యం సేవించి కారు దగ్గరకు వచ్చారు.‘ఇంతదూరం వచ్చాం. కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని వెళదాం. నీకు కిరాయి డబుల్ ఇస్తాము లే’ అన్నారు వాళ్లు.కిరాయి వస్తుందన్న ఆనందంతో ఇలియాస్ కొట్టగట్టుకు బయలుదేరాడు. కారు కొండగట్టు ఆర్చీ, జెఎన్టీయూసీ దగ్గరకు వచ్చింది.అప్పటికి చీకటి పడిపోయింది.‘కొంచెం పాస్‌కు ఆపు’ అన్నారు వాళ్లు.ఇలియాస్ ఆపాడు.అంతే. ఒకడు వేగంగా కదిలాడు. వెనుక నుంచి సిరంజీని ఇలియాస్ మెడ మీద గుచ్చాడు. మరొకడు వైర్‌తో అహ్మద్ గొంతును బిగించాడు. కొంత పెనుగాలాట జరిగాక నలుగురి బలం ముందు నిలువలేక ఇలియాస్ హతమయ్యాడు.శవాన్ని కారు డీక్కిలో వేసుకుని టోల్గేట్ సీసీ కెమెరాలకు చిక్కకుండా రకరకాల మార్గాల ద్వారా గజ్వెల్ మీదుగా బొమ్మల రామారం మండలం మర్యాల శివారుకు వచ్చారు. అక్కడ ఇలియాస్ శవాన్ని కాల్చేసి కారులో పారిపోయారు. ఇంత ఘాతుకానికి కారకుడైన శ్రీనివాస్‌కు పెద్ద చరిత్రే ఉంది. అతనిది కరీంనగర్ జిల్లా ధర్మారం. రకరకాల వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రీనివాస్ చివరకు ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్‌గా చేరాడు. ఈ సమయంలోనే మెడికల్ టెర్మినాలజీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్‌తో గొడవపడి మెడికల్ ఏజెన్సీ ప్రారంభించి అప్పులపాలయ్యాడు. కరీంనగర్లో నక్సలైట్‌నని బెదిరించిన కేసులో, ఒకరిని కొట్టిన కేసులో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అతని మీద కేసులు నమోదయ్యాయి. తొందరగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో తన గ్రామానికే చెందిన మహేష్, గౌరయ్య, శ్రీధర్‌తో కలిసి జట్టుగా ఏర్పడి నేరాలు చేయడం ప్రారంభించాడు. నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తరచూ సీఐడీ సీరియల్‌ను చూసేవాడు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా క్రమంగా కార్ల దొంగతనాలకు మళ్లింది. నిజామాబాద్‌కు చెందిన ఇలియాస్‌ను చంపి అతని కారును దొంగతనం చేసి అతడి శవాన్ని సీటుకవర్లు వేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. మహరాష్ట్రలో రెండుకార్లు దొంగతనం చేశారు. రోడ్డుపక్కన బస్ కోసం ఎదురుచూస్తున్న వారికి లిప్ట్ ఇస్తామని ఇద్దరు మహిళల వద్ద బంగారు అభరణాలు, నగదు అపహరించుకుపోయారు. ఎంతటి నేరస్తుడైనా క్లూ వదులుతాడనికి గుర్తుగా ఏటిఎంలో డబ్బు డ్రా చేసి దొరికిపోయారు. నేరం చేసినవారు దొరికిపోవడం ఖాయం. – యంబ నర్సింహులు స్టాఫ్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా -
భయం లేకే బరితెగింపు!
చట్టాల పట్ల నిర్భీతితో, సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందోళనకరం. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచారణ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించి, శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం. గత పదిహేనురోజుల్లో పట్టపగలు నడిరొడ్డున జరి గిన హత్యలు, హత్యాయ త్నాలు సగటు మనిషిలో భయం పుట్టిస్తున్నాయి. ఎంచుకున్న వారిని జనం చూస్తుండగానే వెంటాడి హతమార్చిన తీరు, అçక్కడ నెలకొన్న భీతావహ వాతావరణం, తర్వాత జరుగుతున్న చర్చ... ఇదంతా ఒక ‘న్యూస్‌రీల్’లా కళ్ల ముందు తిరుగు తోంది. నాగరిక సమాజంగా మనం ఎటు పయని స్తున్నాం? అనే ఊహ గగుర్పాటు కలిగిస్తోంది. ‘అంతటా, రోజూ ఇవే జరుగుతున్నాయా? ఏదో ఒకటీ, అరా ఘటనలకు ఇంతలా కంగారు పడాలా?’ అనొచ్చు సగటు మేధావులెవరైనా! కానీ, అవి జరి గిన తీరు, అందుకు దారితీసిన కారణాలు, రాగల పరిణామాల్ని లోతుగా విశ్లేషిస్తే, అలా తీసిపారేయ డానికి వీళ్లేదు అనిపిస్తోంది. చట్టం–న్యాయ ప్రక్రియ, పోలీసు వ్యవస్థ, మీడియా, సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలు... ఇలా అన్నీ ఇపుడు చర్చకు వస్తున్నాయి. ఆయా ఘటనల ముందు, వెనక పరి స్థితులెలా ఉన్నా, రెండంశాలు మాత్రం తీవ్రంగా కలత రేపుతున్నాయి. చట్టాల పట్ల నిర్భీతితో, జనం చూస్తుండగానే సాటి మనిషిని వెంటాడి, నరికి చంపేందుకు ఉన్మాదులు తెగబడుతున్న తీరు ఆందో ళనకరం. అదే సమయంలో... జనం అచేతన, నిష్క్రి యత్వం, తమకేమీ పట్టనట్టు సాఫీగా సాగిపోతున్న తీరు మరింత గగుర్పాటు కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాలు వంటి ‘కృత్రిమ ప్రపంచం’ (వర్చువల్ వల్డ్)లో ఉన్నంత క్రియాశీలంగా జనం వాస్తవిక ప్రపంచంలో ఉండట్లేదు. ఈ పరిస్థితులిలాగే ఉంటే, ఇంకెన్ని ఘాతుకాల్ని చూడాల్సి వస్తుందోననే భయం పలువురిని కలవరపెడుతోంది. ఈ ఘోరాల వెనుక భూవివాదాలు, వివాహేతర సంబంధాలు, పరువు భావనలు, కులాంతర ధ్వేషాగ్నులు, పగ–కక్ష సాధిం పులు ప్రధాన కారణాలవటం వికటిస్తున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇవన్నీ తమకేమీ సంబంధంలేని వ్యవహారాలన్నట్టు పాలకులు స్పంద నారహితంగా ఉండటం మరింత ఆశ్చర్యకరం. ఏ విరుగుడు చర్యలూ తీసుకోకుండా ఈ పరిస్థితుల్ని ఇలాగే కొనసాగనిస్తే, అవింకా ఎటు దారితీస్తాయో అంతుబట్టని అయోమయం! నిరంతరం తలపై వేలాడే కత్తిలా చట్టమంటే ఓ ‘భయం’ నెలకొల్పడం ద్వారానే నేరాల్ని నియంత్రించగలమనే సంప్రదాయ భావన తరచూ గుర్తుకొస్తోంది. ఆ భయం సడలు తోంది. అందుకు, అనేకాంశాలు కారణమవుతు న్నాయి. మారిన ప్రభుత్వాల ప్రాధాన్యతలు, వ్యవ స్థాగత లోపాలు, సన్నగిల్లిన సామాజిక విలువలు, పలుచనైన మానవ సంబంధాలు, ప్రపంచీకరణ తాలూకు ఆర్థిక అసమానతలు... ఇలా ఎన్నెన్నో అంశాలు పరిస్థితుల్ని అక్కడికి తోస్తున్నాయి. ఎవరూ దీన్ని గట్టిగా పట్టించుకోక మనుషుల భద్రత గాల్లో దీపమయితే ఎలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంత నిర్భీతి ప్రమాదకరం! చట్టం, న్యాయ వ్యవస్థ, శిక్షలంటే ఇంతటి భయంలేని తనం ప్రమాద సంకేతమని సామాజికవేత్తలంటు న్నారు. మొన్న మిర్యాలగూడ, నిన్న ఎర్రగడ్డ, నేడు అత్తాపూర్‌లో జరిగిన çఘటనలు మనకదే భావన కలి గించాయి. ఇవి కాకుండా ఇలాంటి హత్యలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇది పరిమితంగా అక్క డక్కడ పొడచూపుతున్నదే అనుకున్నా... ఈ సంకే తాలు సమాజానికంత శ్రేయస్కరం కాదనేది ఆందో ళన.. పట్టపగలు, జనం మధ్య మారణాయుధాలతో తలపడి మనుషుల్ని తెగనరకడం అన్నదో ఉన్మాద చర్య! ఇందుకు కారణాలు చాలానే ఉండొచ్చు. తర్వాత తామెదుర్కోబోయే ఇబ్బందుల కన్నా లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తిని మట్టుపెట్టడమే ప్రధాన మనే ఉన్మాదపు భావనతోనో, మద్యం సేవించిన మత్తులోనో కొందరు ఇలాంటి దాష్టీకాలకు పాల్పడ వచ్చని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఏం చేసయినా తర్వాతి పరిస్థితిని తామెదుర్కొనగలమనే మొండి ధీమా కూడా ఇలాంటి చర్యలకు వారిని పురిగొల్పే ఆస్కారముందని సామాజిక శాస్త్రవేత్తలం టున్నారు. నేర–న్యాయ ప్రక్రయలోని లోపాలే ఈ నిర్భీతికి ముఖ్య కారణమని నిపుణుల విశ్లేషణ. నేర దర్యాప్తు, సాక్ష్యాల పరీక్ష, న్యాయ విచారణ–అప్పీలు తదితర ప్రక్రియల్ని ఏ దశలోనయినా ప్రభావితం చేయగలలమనే ధీమాయే ఇటువంటి తెగింపులకు కారణమౌతోంది. ప్రక్రియలో జాప్యం, సాక్ష్యాల్ని తారుమారు చేయడం, సాక్షులు మాట మార్చేలా చూడ్డం, అప్పీలుతో శిక్షల అమలు వాయిదా వేయిం చుకోవడం.... ఇలా ఎన్నో మాయోపాయాలతో నేర స్తులు తప్పించుకుంటున్నారు. మహా అంటే రెండు, మూడు నెలలు జైళ్లో ఉంటాం, తర్వాత బెయిలో, అప్పీలో.. బయటకొచ్చేస్తామనే ధైర్యం కూడా వారినీ దుశ్చర్యలకు పురిగొల్పుతోంది. దర్యాప్తు–విచార ణల్లో అసాధారణ జాప్యాలు, అతి తక్కువ (సగటు 27 శాతం) కేసుల్లోనే శిక్షలు పడుతున్న తీరు, శిక్ష ఖరారయ్యాక కూడా దాని అమలు వాయిదాతో అప్పీళ్లు దశాబ్దాలపాటు సాగేలా చూసుకోవడం ఇందుకు నిదర్శనం. ఇటువంటి దురాగతాలకు రాజ కీయ నాయకులు, పలుకుబడి గలిగిన వారు వత్తాసుగా నిలవడం పరిస్థితిని ఇంకా దిగజా రుస్తోంది. సంబంధాలు తెగిన సమాజం మనుష్యుల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఒకరికొకరు సంబంధం లేకుండానే బతికేస్తున్నారు. పక్కింట్లో ఏం జరుగు తోందో ఈ ఇంటివాళ్లకు తెలియదు. రోడ్డు మీద కత్తిపోటుకు గురైన మనిషి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుంటే... ఓ చూపు చూసి, నిట్టూర్చి తమ మానాన తాము సాగిపోవడం రివాజయింది. కళ్లె దుట ఒకర్ని మరొకరు పొడుస్తున్నా చోద్యం చూస్తు న్నారు. పని ఒత్తిడి లేకుంటే కాసేపు నిలబడి సెల్ ఫోన్లో ఫోటోనో, వీడియోనో తీసి సామాజిక మాధ్య మాల్లో పోస్టింగ్ పెట్టడం మామూలయింది. తెగించ యినా ప్రాణాలు నిలబెట్టడం మనిషి ప్రధాన కర్తవ్య మనే భావన తగ్గుతోంది. రిస్కు తీసుకోవడానికి సిద్దపడట్లేదు. ‘దాడి నాపై కాదు కదా! నాకెందుకు... అడ్డుకున్నందుకు దుండగులు నాపై కక్ష కడితేనో! సాక్షమివ్వడానికి పోలీస్‌స్టేషన్ చుట్టో, కోర్టు చుట్టో తిరగాల్సి వస్తేనో..! ఇలాంటి శంక, మీమాంస ఎక్కు వయింది. ఎర్రగడ్డ ఘటనలో సాహసించిన ఓ యువ కుడు వెనకనుంచి పటేల్మని తన్నడంతో నిందితుడు పడిపోయినందువల్ల, ఒక పోటు తగ్గి మాధవి ప్రాణా లతో బతికి బట్టకట్టింది. కనీసం ఆ జోక్యం లేకుంటే! ఏమయ్యేదో! అత్తాపూర్‌లో ఒక వ్యక్తి నిందితుడ్ని వెనకనుంచి పట్టుకొని నిరోధించడానికి యత్నిం చినా.. తానొక్కడవడం వల్లేమో అది సాధ్యపడ లేదు. విదిల్చుకున్న నిందితుడు వరుస పోట్లతో, లక్ష్యం చేసుకున్న వ్యక్తిని అక్కడికక్కడే హతమా ర్చాడు. దుండగుడి చేతిలో ఉన్నది గన్ వంటి ప్రమా దకర మారణాయుధం కాదు, గొడ్డలే అయినందున అక్కడున్నవారిలో ఓ నలుగురయిదుగురు పరస్పరం కనుసైగ చేసుకొని ఒక్కసారిగా నిందితులపై లంఘించి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో? అనే భావన అత్యధికులు వ్యక్తం చేశారు. ఇలా సాహసం చేసే వారికి తర్వాతయినా పోలీసులు రక్షణ కల్పిం చాలి. ప్రభుత్వం, పోలీసులు, మీడియా... తగు ప్రోత్సాహకాలివ్వడం, అవార్డులు–రివార్డులతో సత్కరించడం వంటివి చేయాలి. ‘కాదు, మా గుర్తింపు గోప్యంగా ఉంచండ’ని వారు కోరితే అదే చేయాలి. సదరు సాహసం ఇతరులకు స్ఫూర్తి అవు తుంది. నేరగాళ్లను అడ్డుకునేందుకు ఇంకెందరో సిద్ద మవుతారు. ఘటనా స్థలిలో సాటి మనుషులే అడ్డు కున్న సందర్భాలు పెరిగితే దుండగుల మొండి సాహ సాలు, హంతక చర్యలు తగ్గుతాయి. మీడియాకూ బాధ్యత ప్రసారమాధ్యమాలు సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని సామాజికవేత్తలంటు న్నారు. పట్టపగలు, వెంటాడి మనిషిని మనిషి చంపే దాష్టీకాలు జరిగినపుడు ప్రసారాల్లో విచక్షణ చూపా లనేది వారి అభిప్రాయం. వాటిని పదే పదే చూపి, ‘ఓస్! ఇంతేనా.... హత్య ఇంత తేలికా..? ఇంత సుల భంగా నేరస్థలి నుంచి జారుకోవచ్చా!’ అన్న భావ నలు బలపడనీకుండా ప్రసారాల్లో జాగ్రత్త వహిం చాలి. చిరు చొరవే అయినా.. సాహసించిన వారిని హీరోలుగా చూపాలి. వేగంగా దర్యాప్తు–విచారణ ముగించి, సత్వర న్యాయంతో శిక్షలు పడ్డపుడు మీడియా వాటికెక్కువ ప్రాచుర్యం కల్పించాలనేది నిపుణుల అభిప్రాయం. పౌరులెవరైనా.. తామే పాఠకులు, తామే రిపోర్టర్లయ్యే వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లోనూ విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ధృవీకరణ లేని వార్తల వ్యాప్తిని ఇక్కడ నిలువరించాలి. శీఘ్ర విచారణలు నిరంతరం జరగాలి పోలీసుల నేర దర్యాప్తు ప్రక్రి యల్లో ఇటీవల ఎంతో శాస్త్రీయత వచ్చింది. సాధారణ వేలి ముద్రలకు తోడు డీఎన్యే వేలిముద్రల్ని సరిపోల్చడం, ఇతర ఫొరెన్సిక్ పరీక్షలు, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, లై డిటెక్టర్ల వాడకం... ఇలా పలు పద్దతులతో నిందితుల్ని ఇట్టే పట్టేస్తున్నారు. దర్యాప్తు వేగంగా ఓ కొలిక్కి తెస్తు న్నారు. శాస్త్ర–సాంకేతిక సహకారం వల్ల వివిధ విభాగాల మధ్య సమన్వయం, దర్యాప్తుల్లో ఖచ్చి తత్వం పెరిగాయి. ఇదే పరిస్థితి న్యాయ విచా రణ–శిక్షల ఖరారులోనూ ఉంటే, నేరస్తుల మీద చట్ట ప్రభావం ఎంతో ఉంటుంది. శిక్ష భయంతో నేరం చేయడానికి జంకుతారు. నేర తీవ్రతను బట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సత్వర న్యాయం కోసం ‘శీఘ్ర విచారణ న్యాయ స్థానాల్ని’ (ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సు) ఏర్పాటు చేస్తున్నారు. నిర్భయ వంటి కేసుల్లో విచారణ వేగంగా జరిపి, తక్కువ సమయంలోనే శిక్షల్ని ఖరారు చేశారు. అలాంటి కొన్ని న్యాయ స్థానాలను శాశ్వత ప్రాతిపదికన నడపాలి. తీవ్ర నేరాలు చోటుచేసుకున్నపుడు, సదరు కేసుల విచా రణ అక్కడ జరిపించి సత్వర న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దాంతో ప్రజలకు విశ్వాసం, నేరస్తులకు భయం పెరుగుతాయి. జన సమక్షంలో హత్యలు చేసి, పోలీసుల వద్ద నిందితులు లొంగిపోయి, తగు సాక్ష్యాధారాలున్నపుడు... ఏ మాత్రం జాప్యం చేయకుండా వేగంగా విచారణ ముగించాలి. సత్వరం శిక్షలు పడేలా చూస్తే, సమా జంలో చట్టాలు–శిక్షల భయం నిలుస్తుంది. తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ మనిషి ఉత్కృష్ట జీవనగతి కోసమే! మనిషి ప్రాణాల్ని కాపాడటం సదరు వ్యవస్థలన్నిటి ప్రాథమిక కర్తవ్యం. దిలీప్ రెడ్డి -
ఒక్కో వారం... ఒక్కో నేరం!
సిటీలో నేరాల తీరుపై పోలీసులు అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రతి ఏడాది గణాంకాలను సైతం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు నమోదైన సొత్తు సంబంధిత నేరాల గణాంకాలను వెలికితీయగా.. శనివారమే ఎక్కువ క్రైమ్స్ జరిగినట్లు తేల్చారు. వీటిలో ఒక్కో వారం, ఒక్కో తీరు నేరం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ‘హైదరాబాద్ కాప్’ ద్వారా నేరాల తీరును గుర్తిస్తున్న అధికారులు కారణాలు విశ్లేషిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు నమోదైన సొత్తు సంబంధిత నేరాల గణాంకాలను పరిశీలించిన అధికారులు శనివారమే ఎక్కువ క్రైమ్స్ జరిగినట్లు తేల్చారు. వీటిలో ఒక్కో వారం, ఒక్కో నేరం జరుగుతున్నట్లు గుర్తించారు. ‘కాప్’ విశ్లేషణలో వెలుగులోకి... నగర పోలీసులు తమ యాప్‌లో నేరాలు జరిగే క్రైమ్ ప్రోన్ ఏరియాలతో పాటు అవి జరిగే సమయాలు, రోజుల్నీ నమోదు చేస్తున్నారు. తరచు నేరాలు చోటు చేసుకునే ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలని పిలుస్తారు. పోలీసుస్టేషన్ వారీగా ఈ వివరాలను యాప్‌కు సంబంధించిన సర్వర్‌లోని ఎంట్రీ చేయిస్తున్న అధికారులు నేరాల నిరోధం కోసం వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన నేరాలను అధ్యయనం చేసిన పోలీసు విభాగం అత్యధిక నేరాలు శనివారమే జరిగినట్లు గుర్తించారు. ఈ రోజునే నేరాలు చోటు చేసుకోవడానికి కారణాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. అలాగే గస్తీ వి«ధానంలో మార్పుచేర్పులు చేస్తున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలను జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది పక్కాగా జరుగుతోందా? లేదా? అనే అంశాన్నీ సాంకేతికంగానే పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండే అత్యంత కీలకం... నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే రోజు ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి హైదరాబాద్ కాప్ యాప్‌లోని ‘క్రైమ్ మ్యాపింగ్’ విభాగంలో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ అంశం ఏర్పాటు చేశారు. ఓ అధికారి/సిబ్బంది ఇందులోకి ప్రవేశించడం ద్వారా వారంలో ఫలానా రోజు ఏ ప్రాంతంలో, ఏ తరహా నేరాలు జరిగాయో సంఖ్యలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఫలితంగా ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం... ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దొంగతనాలు తదితర కేసుల వివరాలను పొందుపరిచారు. ఇక నగరంలో ఓ ఠాణా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నాయనేది యాప్ స్పష్టంగా చూపిస్తుంది. ఆ ఠాణా పరిధిలో ఏ పరిధి (కిలోమీటర్ల విస్తీర్ణంతో సహా) నేరాలను ఆలవాలంగా మారిందనేదీ మ్యాప్పైన చూపిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజులు, సమయాల్లో ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ ఏడాది గణాంకాలు పరిశీలిస్తే... ♦ అక్టోబర్ వరకు పది రకాలైన సొత్తు సంబంధిత నేరాలు 2169 నమోదయ్యాయి. ♦ వీటితో 339 నేరాలతో శనివారం ‘మొదటి స్థానం’లో నిలించింది. ♦ దోపిడీలు, పగటి చోరీలు, సొత్తు కోసం హత్య, సాధారణ చోరీలు ఈ వారమే ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ♦ వాహనచోరీలు సోమవారం ఎక్కువగా జరిగాయి. మొత్తం 671 కేసులకూ... ఈ వారం 113 జరిగాయి. ♦ దృష్టి మళ్ళించి దోచుకునే నేరాలు గురువారం ఎక్కువగా జరిగాయి. మొత్తం 97 నేరాలకు ఈ వారం 22 చోటు చేసుకున్నాయి. ♦ రాత్రి పూట చోరీలు సైతం గురువారమే ఎక్కువ చోటు చేసుకున్నాయి. 219 కేసుల్లో ఈ వారం 37 నమోదయ్యాయి. -
‘క్రైమ్ అలెర్ట్’తో నేరగాళ్లకు చెక్
ఇతర రాష్ట్ర పోలీసులతో సమన్వయం ఆయా ప్రాంతాల్లో ఇన్ఫార్మర్ నెట్వర్క్ వలస దొంగల కట్టడికి పక్కా వ్యూహం బీహార్‌కు చెందిన సునీల్ సహానీ నేతృత్వంలోని అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్. జంట కమిషనరేట్ల పరిధిలో నెల రోజుల వ్యవధిలో వరుస స్నాచింగ్స్ చేసిన యూపీకి చెందిన బవరియా గ్యాంగ్ తన అనుచరులతో కలిసి చోరీలకు తెగబడ్డ కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన సర్దార్ పార్ధీ గ్యాంగ్ సభ్యుడు ఇళ్లల్లో చోరీలు చేస్తూ చిక్కిన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సచిన్ గోహర్, యోగేష్ మండాలియాలు వీరే కాదు... పొరుగు రాష్ట్రాల నుంచి వస్తూ నగరంలో పంజా విసురుతున్న వ్యక్తులు, ముఠాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సిటీబ్యూరో: ఇలాంటి వలస నేరగాళ్లకు చెక్ చెప్పడానికే నగర పోలీసులు క్రైమ్ అలెర్ట్ సిస్టం (సీఏఎస్) పేరుతో వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాకు చెందిన ముఠాలు కొన్నేళ్ల క్రితం రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వరుసపెట్టి పంజా విసిరాయి. దాదాపు నాలుగు రాష్ట్రాల పోలీసులకు ఈ గ్యాంగ్స్ ముచ్చెమటలు పట్టించాయి. అప్పట్లో వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నా... ఫలితాలు అంతంత మాత్రమే. దీంతో అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)కు వచ్చారు. ఆ ముఠాలు నివసించే ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులను ఆశ్రయించి, వారి సహకారంతో ఈ ముఠాలను కట్టడి చేయగలిగారు. నిత్యం నగరంలో తెగబడుతున్న అటెన్షన్ డైవర్షన్ ముఠాలు, సూడో పోలీస్ గ్యాంగ్స్, చైన్ స్నాచర్లు, దోపిడీ, చోరీ ముఠాలకు చెక్ చెప్పేందుకూ ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. దీనికి క్రైమ్ అలర్ట్ సిస్టం (సీఏఎస్) అని పేరు పెట్టారు. ఈ ప్రాంతాల నుంచే అధికం... జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుని జనాల పుట్టి ముంచే ఈ ముఠాలన్నీ బయటి ప్రాంతాల నుంచి వస్తున్నవే. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్‌లో తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న రామ్జీనగర్, తిరుచ్చిలతో పాటు మహారాష్ట్రలోని పుణే, భివండి నుంచి వచ్చే ముఠాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా నగరి ముఠాలు కొన్ని నగరంలో యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. ఇక, సూడో పోలీసుల విషయానికి వస్తే బెంగళూరు పరిసరాలకు చెందిన ఇరానీ గ్యాంగ్, బీదర్, గుంతకల్ నుంచి వచ్చి తమ ‘పని’ చక్కపెట్టుకుపోతున్నాయి. ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్ సహా అనేక ప్రాంతాల నుంచి వచ్చి గొలుసులు లాక్కుపోతున్న చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ సైతం ఉన్నాయి. పోలీసు రికార్డుల్లోకి ఎక్కకుండా పని చక్కపెట్టుకుపోతున్న ముఠాలు, నేరగాళ్లు ఇంకా ఎందరో ఉన్నారని పోలీసులే అంటున్నారు. ఇక్కడ గుర్తుపట్టడం కష్టమే... వీరంతా నగరంలోని లాడ్జీలు, శివారు ప్రాంతాల్లోని అద్దె ఇళ్లల్లో డెన్స్ ఏర్పాటు చేసుకుని టిప్‌టాప్‌గా తయారై... విద్యార్థులు, ఉద్యోగస్తుల మాదిరిగా సంచరిస్తారు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్‌కు చెందిన ఐదారుగురు గ్యాంగ్‌గా బయటకు వచ్చి బ్యాంకులు, జ్యువెలరీ దుకాణాలు, వ్యాపార కేంద్రాల వద్ద రెక్కీ నిర్వహించి టార్గెట్‌పై పంజా విసురుతారు. చైన్ స్నాచర్లైతే వస్త్రవ్యాపారుల ముసుగులో షెల్టర్లు తీసుకుంటూ... రెండు బృందాలుగా బయటకు వచ్చి పక్కా పథకం ప్రకారం రెచ్చిపోతున్నారు. అయితే నగరంలో ఎల్లప్పుడూ వీరిపై నిఘా వేసి ఉంచడం సాధ్యం కావట్లేదు. ఒకసారి నగరంలోకి ప్రవేశించిన గ్యాంగ్ వరుసపెట్టి నేరాలు చేసి వెళ్తోంది. ఈ ముఠాలను పట్టుకోవడం, రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారిపోతోంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి నిందితుల అరెస్టుకు యత్నిస్తే పోలీసులకూ ఒక్కోసారి చావుదెబ్బలు తప్పట్లేదు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడం కోసమే సీఏఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదీ సీఏఎస్ స్వరూప, స్వభావాలు... క్రిమినల్ అలర్ట్ సిస్టం (సీఏఎస్)లో నగర పోలీసులకు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల పోలీసులతో సమన్వయం కలిగి ఉండి, దొంగల అరెస్టుకు వారి సహకారం తీసుకుంటారు. ఆయా రాష్ట్రాలు, నేరగాళ్లు నివసించే ప్రాంతాల పోలీసు అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటారు. అనివార్య కారణాల నేపథ్యంలో వారి ప్రాంతంలో ఉంటున్న కరుడుగట్టిన, వ్యవస్థీకృత ముఠాలను అరెస్టు చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆయా అధికారులను వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా కోరతారు. అక్కడ నుంచి ఈ గ్యాంగ్స్ బయలుదేరిన వెంటనే వారి కదలికలను పసిగట్టి నగర పోలీసులను అప్రమత్తం (అలర్ట్) చేసేలా నెట్వర్క్ ఏర్పటు చేసుకోనున్నారు. తద్వారా నగర వాసులతో పాటు జ్యువెలరీ దుకాణాలు, బ్యాంకుల వారిని అప్రమత్తం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నేరాలు నిరోధించడం, అవకాశం దొరికితే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం చేస్తారు.