సాక్షి, అంబర్‌పేట( హైదరాబాద్): అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసుస్టేషన్ పరిధిలో ఎల్ అండ్ టీ కమ్యూనిటీ పోలీస్, నేను సైతం కార్యక్రమాల పేరిట సుమారు నాలుగు వేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను ప్రోత్సహించి కెమెరాలను ఏర్పాటు చేయించారు.
ఇలా ఏర్పాటు చేసిన వాటిలో దాదాపు 50 శాతం కెమెరాలు పని చేయడం లేదు. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు లేకుండా పోతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించిన పోలీసులు వాటి నిర్వహణను ప్రోత్సహించకపోవడం గమనార్హం. 50 శాతం కెమెరాలు పని చేయకపోవడంతో ఘటన జరిగినప్పుడు నేరాలను ఛేదించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలోని కెమెరాల నిర్వహణపై స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించాలని పలువురు కోరుతున్నారు.
సాక్ష్యాలు కనుమరుగు
పోలీసుస్టేషన్ పరిధిలోని శివంరోడ్డు, సీపీఎల్ రోడ్, గోల్నాక, అంబర్‌పేటలోని ప్రధాన రోడ్లు, ప్రధాన ప్రాంతాలైన డీడీకాలనీ, తులసీరాంనగర్ కాలనీ, అనంతరాంనగర్ కాలనీతో పాటు నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అంబర్‌పేటలోని ప్రధాన రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధాన కెమెరాలు పని చేయని పరిస్థితి వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే పోలీసులు సులువుగా సీసీ టీవీ కెమెరాలను చూద్దామని వెళుతున్నారు. దీంతో అవి పని చేయలేదన్న విషయాన్ని అప్పుడు గానీ తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పలు కేసులకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.
నిర్వహణ బాధ్యత స్థానికులదే
‘నేను సైతం, కమ్యూనిటీ పోలీసు’ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ప్రజల బాధ్యతే. అవి పని చేయకపోతే వారే మరమ్మతులు చేసుకోవాలి. ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల నిర్వాహణ ప్రత్యేక ఏజెన్సీ చూస్తున్నది. పోలీసుస్టేషన్ పరిధిలో పని చేయని కెమెరాలను గుర్తించి పని చేసేలా చొరవ తీసుకుంటాను.
– సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్
చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment