సూది మందు ప్రాణం పోయడానికి...తీయడానికి కాదు.జీవించాలంటే కష్టం చేయాలి...నేరం కాదు.ఎత్తున ఎగిరే రాబందు కూడానేలకు దిగాల్సిందేతప్పించుకుని తిరిగే నిందితుడు చట్టానికి చిక్కాల్సిందే
డిసెంబర్ 21– 2014. రాత్రి 11 గంటలు. నల్లగొండ జిల్లా భువనగిరి పరిధిలోని బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్.ఫోన్ మోగింది.‘సార్.. మర్యాల శివారులో ఎవరిదో శవం పడి ఉంది సార్. బాడీ అంతా కాలిపోయి ఉంది’ అని ఎవరో గ్రామస్తుడు çకంగారుగా సమాచారం అందించాడు. బొమ్మలరామారం ఎస్‌ఐ ప్రసాద్ వెంటనే పోలీసులను తీసుకుని అక్కడకు వెళ్లాడు.పొదల సమీపంలో ఒక శవం పడి ఉంది.ఇంకా కమురు వాసన పోలేదు. 90 శాతం కాలిపోయి ఉంది. ప్యాంటూ షర్టూ ఉన్నాయి. మగ మనిషే.రాత్రి కావడం, శవం ఉండటంతో నలుగుదైరుగు గ్రామస్తులు కూడా అటుగా రాలేదు. కనుక ఏ వివరాలు తెలియలేదు. ‘బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపండి’ అన్నాడు ఎస్.ఐ ఏర్పాట్లను పురమాయిస్తూ.
రెండు రోజులు గడిచాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ఊపిరాడకుండా చేయడం వల్ల మరణం సంభవించిందని తేలింది. అంటే చంపేసి తెచ్చి కాల్చి ఉండాలని అర్థమైంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకో వివరం కూడా చెప్పింది. ‘చేతికి ఇస్లాం చిహ్నం ఉన్న వెండి ఉంగరం ఉంది. సున్తీ చేసిన అనవాళ్లు ఉన్నాయి. కనుక ఇతను ముస్లిం కావచ్చు’...ఆ ప్రాంతంలో పెద్దగా ముస్లిం జనాభా లేదు. ఈ వ్యక్తి ఎక్కడి వాడు?‘సార్... చుట్టుపక్కల జిల్లాల మిస్సింగ్ కేసులు చూద్దాం’ అన్నాడు కానిస్టేబుల్.‘ఆ పని మొదలెట్టండి’ అన్నాడు ఎస్.ఐ.వెంటనే పోలీసులు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను జల్లెడ పట్టడం ప్రారంభించారు. గత పదిహేను రోజులుగా నమోదైన కేసుల వివరాలను గమనించారు. ఏమీ లాభం లేకపోయింది. కాని రెండు రోజుల తర్వాత నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు వారిని ఆకర్షించింది. మృతుని ముఖకవళికలు సరితూగాయి. వెంటనే నిజామాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. మార్చురీలో ఉన్న శవాన్ని గుర్తించి భోరుమన్నారు.‘సార్. ఇతని పేరు ఇలియాస్. కారు డ్రైవర్.’ చెప్పారు బంధువులు.‘శత్రువులు ఎవరైనా ఉన్నారా?’ అడిగాడు ఎస్.ఐ.‘ఎవరూ లేరు సార్. చాలా మంచివాడు. కష్టపడి పని చేస్తాడు. అతడికి కారు ఉంది. దానిని దొంగలించడానికే చంపి ఉంటారు’ అన్నారు వాళ్లు.ఇలియాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇలియాస్ మృతదేహం చూసి కన్నీరు మున్నీరవుతున్న వారిని చూసి ఎస్.ఐకు కడుపులో దేవినట్టయ్యింది.‘అమాయకుణ్ణి చంపినవాళ్లను వదిలిపెట్టను’ అనుకున్నాడు. హంతకులకు సంబంధించి ఎలాంటి మిగతా ఆధారాలు లభించకపోవడంతో టెక్నాలజీని వాడుకోవాలన్న ఆలోచనతో వెంటనే టవర్ డంప్‌పై దృష్టి పెట్టారు. మర్యాల శివారులో ఉన్న సెల్‌పోన్ టవర్, కుకూనూర్‌పల్లి పోలీస్‌స్టేషన్, కరీంనగర్, నిజామామాద్, కొండగట్టు, గజ్వెల్ ప్రాంతాలలోటవర్‌డంప్ ద్వారా యాక్టివ్ కాల్స్ సాగిన నెంబర్లను సేకరించారు. అయితే చాలా నెంబర్లు స్థానికులవే కావడంతో వారందరిలో నిందితులు లేరని నిర్ధారించుకున్నారు. అయితే హంతకులు ఎవరు?
దాదాపు సంవత్సరం గడిచిపోయింది.నవంబర్ 10. 2015.ఎస్.ఐ ప్రసాద్‌కి ఫోన్ వచ్చింది. చేసింది కుకూనూర్ పల్లి ఎస్.ఐ.‘మా ఏరియాలో ఒక కారు దొంగతనం జరిగింది. కిరాయికి మాట్లాడుకున్నవారు డ్రైవర్ కంట్లో కారం కొట్టి మత్తు మందు ఇచ్చి కారుతో పాటు ఉడాయించారు. మీ స్టేషన్ పరిధిలో బాడీ దొరికిన ఇలియాస్ కేసులో ఉన్నది వీళ్లే కావచ్చు’ అన్నాడు ఎస్.ఐ.వెంటనే ఎస్.ఐ ప్రసాద్ రంగంలో దిగి అటాక్‌కు గురైన డ్రైవర్‌ని కలిశాడు.‘వాళ్లు మొత్తం నలుగురు. కిరాయికి మాట్లాడుకుని బయలుదేరారు. దారిలో పాస్‌కు ఆపమన్నారు. నేను స్లో చేసి ఆపుతుండగానే కంట్లో కారం చల్లారు. తర్వాత ఏదో గుచ్చినట్టుగా అనిపించింది. బహుశా సిరంజీ కావచ్చు. లేచాక చూస్తే రోడ్డు పక్కన పడి ఉన్నాను. వాళ్లు నా ఏ.టి.ఎం కార్డును కూడా తీసుకెళ్లారు’ అన్నాడు.‘వాళ్లను ఇంతకు ముందు చూశావా?’‘లేదు సార్. పూర్తిగా కొత్తవాళ్లు’పోలీసులు వెంటనే కారు కోసం వేట ప్రారంభించారు. కాని నిందితులు కారు నంబర్ మార్చేయడంతో ఆ పని కష్టమైంది. మరోవైపు నేర చరిత్ర ఉన్న ఆర్.ఎమ్.పి డాక్టర్ల గురించికూడా కూపీ లాగడం మొదలైంది. సిరంజీ ఆపరేట్ చేస్తున్నారంటే మెడికల్ ఫీల్డ్‌కు సంబంధం ఉన్నవాళ్లే అయి ఉండాలి.ఇంతలో ఎస్.ఐ ప్రసాద్‌కు అటాక్ అయిన డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది.‘సార్. నా ఏ.టి.ఎం కార్డుతో వాళ్లు డబ్బు డ్రా చేశారు. ఆ కార్డు మీద నేను నా పిన్ నంబర్ రాసుకుని ఉన్నాను మర్చిపోతానని. అందువల్ల డ్రా చేశారు. ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది’ అన్నాడతను.వెంటనే డ్రా ఎక్కడ చేశారన్న విషయం కూపీ లాగారు.వరంగల్ జిల్లా ఖాజీ పేట ఏ.టి.ఎం.సిసి కెమెరా ఫుటేజ్‌ను వెలికి తీశారు. డ్రా చేస్తున్న వ్యక్తి కనిపించాడు.‘ఇతనే సార్. నా కారు ఎక్కింది’ అన్నాడు డ్రైవర్.వెంటనే నిందితుని ఫొటో అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లింది. పాత నేరస్తుల ఫొటోలతో ట్యాలీ చేసి చూడటం పూర్తయ్యింది. నాలుగు రోజుల తర్వాత కరీం నగర్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు తన గ్యాంగ్‌తో ఇలియాస్ హత్య ఎలా చేశాడో వివరించాడు.
డిసెంబర్ 20. 2014. నిజామాబాద్. ఆ టౌన్‌లోని ఎండి.ఇలియాస్ అహ్మద్‌కు íస్విఫ్ట్ డిజైర్ కారు ఉంది. అద్దెకు తిప్పుతుంటాడు. ఆ రోజు అతని దగ్గరకు కొత్త వ్యక్తులు నలుగురు వ్యక్తులు వచ్చారు. ‘మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులం. వేములవాడ వెళ్లడానికి కారు కావాలి’ అని అడిగారు. వచ్చింది మంచి బేరం అని ఇలియాస్‌కు సంతోషం కలిగింది. వెంటనే బయలు దేరాడు.‘ఈ దారి వద్దు. ఇది హైవే.అనవసరంగా టోల్‌గేట్లకు డబ్బు కట్టాలి. సరదాగా అడ్డదారిలో వెళదాం’ అన్నారు వాళ్లు.కారు బయలుదేరింది. ఆ నలుగురు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒకచోట వైన్ షాప్ కనిపిస్తే ఆపమన్నారు.ఇలియాస్‌కి ఇది ఆడ్‌గా అనిపించింది.‘దేవుడి పని మీద వెళుతూ మందు తాగుతారా?’ అని అడిగాడు.‘అబ్బెబ్బె... దర్శనం అయ్యాక తాగుదామని’ అని కవర్ చేశారు వాళ్లు.కారు వేములవాడ చేరుకుంది. దేవస్థానం పార్కింగ్ ఏరియాలో కారు ఆపాడు ఇలియాస్.‘మీరు దర్శనానికి వెళ్లి రండి’ అన్నాడు.దిగిన నలుగురూ దేవస్థానం వైపు వెళ్లారు. కాని గుడిలోని సిసి కెమెరాలకు చిక్కుతామన్న భయంతో లోపలకే వెళ్లలేదు. బయటే తచ్చాట్లాడి గుడికి ఆవల మద్యం సేవించి కారు దగ్గరకు వచ్చారు.‘ఇంతదూరం వచ్చాం. కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని వెళదాం. నీకు కిరాయి డబుల్ ఇస్తాము లే’ అన్నారు వాళ్లు.కిరాయి వస్తుందన్న ఆనందంతో ఇలియాస్ కొట్టగట్టుకు బయలుదేరాడు.
కారు కొండగట్టు ఆర్చీ, జెఎన్‌టీయూసీ దగ్గరకు వచ్చింది.అప్పటికి చీకటి పడిపోయింది.‘కొంచెం పాస్‌కు ఆపు’ అన్నారు వాళ్లు.ఇలియాస్ ఆపాడు.అంతే. ఒకడు వేగంగా కదిలాడు. వెనుక నుంచి సిరంజీని ఇలియాస్ మెడ మీద గుచ్చాడు. మరొకడు వైర్‌తో అహ్మద్ గొంతును బిగించాడు. కొంత పెనుగాలాట జరిగాక నలుగురి బలం ముందు నిలువలేక ఇలియాస్ హతమయ్యాడు.శవాన్ని కారు డీక్కిలో వేసుకుని టోల్‌గేట్ సీసీ కెమెరాలకు చిక్కకుండా రకరకాల మార్గాల ద్వారా గజ్వెల్ మీదుగా బొమ్మల రామారం మండలం మర్యాల శివారుకు వచ్చారు. అక్కడ ఇలియాస్ శవాన్ని కాల్చేసి కారులో పారిపోయారు. ఇంత ఘాతుకానికి కారకుడైన శ్రీనివాస్‌కు పెద్ద చరిత్రే ఉంది. అతనిది కరీంనగర్ జిల్లా ధర్మారం. రకరకాల వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రీనివాస్ చివరకు ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్‌గా చేరాడు. ఈ సమయంలోనే మెడికల్ టెర్మినాలజీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్‌తో గొడవపడి మెడికల్ ఏజెన్సీ ప్రారంభించి అప్పులపాలయ్యాడు. కరీంనగర్‌లో నక్సలైట్‌నని బెదిరించిన కేసులో, ఒకరిని కొట్టిన కేసులో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అతని మీద కేసులు నమోదయ్యాయి. తొందరగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో తన గ్రామానికే చెందిన మహేష్, గౌరయ్య, శ్రీధర్‌తో కలిసి జట్టుగా ఏర్పడి నేరాలు చేయడం ప్రారంభించాడు. నేరం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తరచూ సీఐడీ సీరియల్‌ను చూసేవాడు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా క్రమంగా కార్ల దొంగతనాలకు మళ్లింది. నిజామాబాద్‌కు చెందిన ఇలియాస్‌ను చంపి అతని కారును దొంగతనం చేసి అతడి శవాన్ని సీటుకవర్‌లు వేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. మహరాష్ట్రలో రెండుకార్లు దొంగతనం చేశారు. రోడ్డుపక్కన బస్ కోసం ఎదురుచూస్తున్న వారికి లిప్ట్ ఇస్తామని ఇద్దరు మహిళల వద్ద బంగారు అభరణాలు, నగదు అపహరించుకుపోయారు. ఎంతటి నేరస్తుడైనా క్లూ వదులుతాడనికి గుర్తుగా ఏటిఎంలో డబ్బు డ్రా చేసి దొరికిపోయారు. నేరం చేసినవారు దొరికిపోవడం ఖాయం.
– యంబ నర్సింహులు
స్టాఫ్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment