సిటీలో నేరాల తీరుపై పోలీసులు అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రతి ఏడాది గణాంకాలను సైతం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు నమోదైన సొత్తు సంబంధిత నేరాల గణాంకాలను వెలికితీయగా.. శనివారమే ఎక్కువ క్రైమ్స్ జరిగినట్లు తేల్చారు. వీటిలో ఒక్కో వారం, ఒక్కో తీరు నేరం చోటు చేసుకున్నట్లు గుర్తించారు.
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ‘హైదరాబాద్ కాప్’ ద్వారా నేరాల తీరును గుర్తిస్తున్న అధికారులు కారణాలు విశ్లేషిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు నమోదైన సొత్తు సంబంధిత నేరాల గణాంకాలను పరిశీలించిన అధికారులు శనివారమే ఎక్కువ క్రైమ్స్ జరిగినట్లు తేల్చారు. వీటిలో ఒక్కో వారం, ఒక్కో నేరం జరుగుతున్నట్లు గుర్తించారు.
‘కాప్’ విశ్లేషణలో వెలుగులోకి...
నగర పోలీసులు తమ యాప్‌లో నేరాలు జరిగే క్రైమ్ ప్రోన్ ఏరియాలతో పాటు అవి జరిగే సమయాలు, రోజుల్నీ నమోదు చేస్తున్నారు. తరచు నేరాలు చోటు చేసుకునే ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలని పిలుస్తారు. పోలీసుస్టేషన్ వారీగా ఈ వివరాలను యాప్‌కు సంబంధించిన సర్వర్‌లోని ఎంట్రీ చేయిస్తున్న అధికారులు నేరాల నిరోధం కోసం వివిధ కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన నేరాలను అధ్యయనం చేసిన పోలీసు విభాగం అత్యధిక నేరాలు శనివారమే జరిగినట్లు గుర్తించారు. ఈ రోజునే నేరాలు చోటు చేసుకోవడానికి కారణాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. అలాగే గస్తీ వి«ధానంలో మార్పుచేర్పులు చేస్తున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలను జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది పక్కాగా జరుగుతోందా? లేదా? అనే అంశాన్నీ సాంకేతికంగానే పర్యవేక్షిస్తున్నారు.
ఈ రెండే అత్యంత కీలకం...
నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే రోజు ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి హైదరాబాద్ కాప్ యాప్‌లోని ‘క్రైమ్ మ్యాపింగ్’ విభాగంలో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ అంశం ఏర్పాటు చేశారు. ఓ అధికారి/సిబ్బంది ఇందులోకి ప్రవేశించడం ద్వారా వారంలో ఫలానా రోజు ఏ ప్రాంతంలో, ఏ తరహా నేరాలు జరిగాయో సంఖ్యలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది.
ఫలితంగా ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం... ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దొంగతనాలు తదితర కేసుల వివరాలను పొందుపరిచారు. ఇక నగరంలో ఓ ఠాణా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నాయనేది యాప్ స్పష్టంగా చూపిస్తుంది. ఆ ఠాణా పరిధిలో ఏ పరిధి (కిలోమీటర్ల విస్తీర్ణంతో సహా) నేరాలను ఆలవాలంగా మారిందనేదీ మ్యాప్‌పైన చూపిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజులు, సమయాల్లో ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు జారీ చేయవచ్చు.
ఈ ఏడాది గణాంకాలు పరిశీలిస్తే...
♦ అక్టోబర్ వరకు పది రకాలైన సొత్తు సంబంధిత నేరాలు 2169 నమోదయ్యాయి.
♦ వీటితో 339 నేరాలతో శనివారం ‘మొదటి స్థానం’లో నిలించింది.
♦ దోపిడీలు, పగటి చోరీలు, సొత్తు కోసం హత్య, సాధారణ చోరీలు ఈ వారమే ఎక్కువగా చోటు చేసుకున్నాయి.
♦ వాహనచోరీలు సోమవారం ఎక్కువగా జరిగాయి. మొత్తం 671 కేసులకూ... ఈ వారం 113 జరిగాయి.
♦ దృష్టి మళ్ళించి దోచుకునే నేరాలు గురువారం ఎక్కువగా జరిగాయి. మొత్తం 97 నేరాలకు ఈ వారం 22 చోటు చేసుకున్నాయి.
♦ రాత్రి పూట చోరీలు సైతం గురువారమే ఎక్కువ చోటు చేసుకున్నాయి. 219 కేసుల్లో ఈ వారం 37 నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment