
స్నేహితుడి ఇంట్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లా రేపల్లెలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్నేహితుడి గదిలో ఆమె ఉరి వేసుకుని మరణించింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని అనే అమ్మాయి గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దాంతో చుట్టుపక్కల అంతా వెతికిన తల్లిదండ్రులు.. శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఉదయం అక్కడకు సమీపంలోని ఒక ఇంట్లో ఒక యువతి ఉరి వేసుకుని మరణించినట్లు ఆ ఇంటి యజమాని పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా.. ఆ మృతదేహం తేజస్వినిదే అని తెలిసింది.
తాను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, తన పేరు నరసింహారావు అని చెప్పిన యువకుడు ఆ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అతడి అసలు పేరు నాగరాజు అని పోలీసుల విచారణలో తెలిసింది. అతడు తన పేరు, ఆచూకీ వివరాలు కూడా ఎందుకు రహస్యంగా ఉంచాడో తెలియరాలేదు. అసలు అతడెవరో తమకు గానీ, తమ కుమార్తెకు గానీ తెలియదని తేజస్విని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఆమె అక్కడకు ఎందుకు వెళ్లిందో, ఆమె తనకు తానే ఉరేసుకుందా.. లేక ఏమైనా అఘాయిత్యం జరిగిందా అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.