సాక్షి, మంచిర్యాల :
జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు మరోసారి భగ్గుమన్నారు. ముందు నుంచి ‘సమైక్య’ వాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పుకొస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై వ్యవహరించిన తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖానాపూర్ బస్టాండ్ ఎదురుగా ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యు) రాష్ట్ర కమిటీ పిలువు మేరకు నాయకులు కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో పీడీఎస్‌యు నాయకులు, కార్యకర్తలు కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లక్సెట్టిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీడీఎస్‌యూ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ముందడుగు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మరో ముందడుగు పడింది. ఎట్టకేలకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై గురువారంతో అసెంబ్లీలో చర్చ ముగిసింది. బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ మనోహర్ ప్రకటించారు. రాష్ట్రపతికి వెళ్లిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో బిల్లు కేబినెట్‌కు, రెండో వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పుడు జిల్లావాసుల దృష్టి హస్తినపై పడింది. తెలంగాణపై పార్లమెంటులో ఎలాంటి తీర్పు వస్తుందోనని తెలంగాణవాదుల్లో ఉత్కంఠత నెలకొంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బిల్లు తిరస్కరణకు గురైనంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మానదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం తీర్మానం విలువ లేనిది..
ముఖ్యమంత్రి సమైక్యరాష్ట్రం కోసం శాసనసభలో చేసిన తీర్మానం ఏమాత్రం విలువ లేనిది. తెలంగాణ బాల్ ప్రస్తుతం పార్లమెంట్ కోర్టులో ఉంది. 86 మంది ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనగా 9072 సవరణలు వచ్చాయి. తెలంగాణపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ తెలంగాణకు అనుకూలంగా చర్చలో పాల్గొన్నాయి.
- గుండా మల్లేశ్, సీపీఐ శాసనసభా పక్షనేత
సీమాంధ్ర సీఎం.. స్పీకర్ కుట్ర..
తెలంగాణ బిల్లుపై 42 రోజులపాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బిల్లుపై ఎమ్మెల్యేలు కొందరు ప్రసంగంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంకొందరు లిఖిత పూర్వకంగా అందజేశారు. బిల్లు తిరస్కరించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మానదు.
- నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే, చెన్నూరు.
రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లు తిరస్కరించామని పేర్కొనడం సిగ్గు చేటు. దీనిపై తెలంగాణ ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగకపోయిన ఆర్టికల్ -3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుంది. ఇది తెలంగాణ ప్రాంత విజయం. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి కేంద్రం మరో 15 రోజుల్లో ఆమోదిస్తుంది.
- జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్.
తెలంగాణవాదులు ఆందోళన చెందవద్దు
సీమాంధ్రనేతలు, సీఎం కిరణ్ చేసే కుట్రలకు తెలంగాణవాదులు బయపడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో పునఃనిర్మాణంపై ఓటింగ్ జరగలేదని, సీఎం రాసిన లేఖపై ఓటింగ్ జరిగిందన్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినపుడు మైనార్టీలుగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ను విడదీశారని, అదే తరహాలో మెజార్టీ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర నాయకులు ఉన్నా పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందుతుంది.
- లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు
పార్లమెంటులో ఆమోదం పొందుతుంది
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. అసెంబ్లీలో చర్చ, చివరి అభిప్రాయ ఘట్టం ముగిసింది. ఆసెంబ్లీలో ఓటింగ్ జరగలేదు. బిల్లుపై అసెంబ్లీలోఎవరు అవును, కాదన్నా ఆగే ప్రసక్తి లేదు. - ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
తెలంగాణ వస్తుందని సీఎంకు తెలుసు..
టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చించి అభిప్రాయాలు పంపమని రాష్ట్రపతి చెబితే.. సీఎం కిరణ్ ఆ బిల్లును తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని సీఎంకు తెలుసు అయినా.. సీమాంధ్రులను మభ్యపెట్టి మోసం చేసేందుకే ఇదంతా చేస్తున్నారు.
- గడ్డం అరవిందరెడ్డి,
ఎమ్మెల్యే, మంచిర్యాల
తిరస్క‘రణం’
Published Fri, Jan 31 2014 6:11 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement