సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం బంద్ పాటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. అన్ని సంఘాలూ బంద్‌లో పాల్గొనడంతో జిల్లాలోని ఆరు డిపోల్లో ఉన్న 635 బస్సులు రోడ్డెక్కలేదు. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ మార్కెట్‌లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రగతిభవన్‌నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ వాదులు నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. బోధన్ ఎన్‌డీఎస్‌ఎల్ కర్మాగారంలో కార్మికులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. బోధన్‌లో ఆర్టీసీ డిపో గేటుకు తాళం వేశారు.
నాగన్‌పల్లి, రెంజల్ మండలం తూంపల్లిలలో రాస్తారోకో చేశారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, మహిళలు, కులసంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారంతా బంద్‌ను జయప్రదం చేయడం ద్వారా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్షపాత వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిజామాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బంద్‌ను పర్యవేక్షించారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి, డీజీపీల అండదండలున్నాయని నేతలు ఆరోపించారు. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వెలవెలబోయాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. శనివారం ప్రగతిభవన్‌లో జరగాల్సిన నీటి సలహా బోర్డు సమావేశాన్ని బంద్ కారణంగా అధికారులు వాయిదా వేశారు.
నిరసన కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతల చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణ వాదులు రాస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ యునివర్సిటీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతులు బహిష్కరించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ హాస్టల్‌తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యకాండను తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌పై సీమాంధ్ర పోలీసులు దాడి చేయడాన్ని తప్పుపట్టారు. ఉద్యోగుల పేరుతో సంఘ వ్యతిరేక శక్తులను హైదరాబాద్ తరలించి, తెలంగాణవాదులపై దాడి చేయించారని ఆరోపించారు. విద్యార్థులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్‌ను జయప్రదం చేయడానికి రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలైన టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీలోని రెండు వర్గాలు, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు తీశారు.
జిల్లా బంద్ సంపూర్ణం
Published Sun, Sep 8 2013 5:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement