టి-బిల్లుకు నిరసనగా కార్యాలయాలు బంద్
Published Fri, Feb 7 2014 12:30 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభనను వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవో సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు గురువారం సమ్మెలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్, డీఆర్‌డీఏ, సాంఘిక సంక్షేమం, మెప్మా, గృహనిర్మాణ శాఖ కార్యాలయాలను మూయించివేశారు. సిబ్బంది సహకారించాలని కోరారు. జైసమైకాంధ్ర నినాదాలు, డప్పు వాయిద్యాలతో తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజిస్తుందని దుయ్యబట్టారు.
రాష్ర్టం విడిపోతే ఇరు ప్రాంతాల ప్రజలు నష్టపోతారన్నారు. తెలుగు వారంతా ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ బిల్లును ఉపసంహరించేవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పెరికల చిన వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే విద్యా, ఉద్యోగ, విద్యుత్, సాగునీటి విషయాలలో తీవ్ర ఇబ్బందులు పడ తామన్నారు. కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి బాస్కరరావు, రెవెన్యూ అసోసియేషన్ గుంటూరు డివిజన్ కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు ప్రతాప్, బాజీ, దయానందరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement