
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై మొదలైన చర్చ
హైదరాబాద్ : శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళనను పట్టించుకోకుండానే ప్రభుత్వం విభజన బిల్లుపై చర్చను ప్రారంభించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల తీవ్ర నిరసనల మధ్యే సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ముందుగా విభజన బిల్లుపై చర్చను ప్రారంభించారు.
సభ్యుల నినాదాల మధ్య దాదాపు రెండు నిమిషాలు పాటు వసంతకుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగానే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకిస్తున్నట్టు వసంతకుమార్ అన్నారు. అంతకు ముందు సభ ప్రారంభంకాగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు.
చర్చకు సహకరించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యుల కోరిన ఏ సమాచారామైన ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఆ వెంటనే సభ్యుల్ని తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేయడంతో..... సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలంతా వెనక్కి తగ్గారు. వారివారి స్థానాల్లో కూర్చున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సభ జరిగినంత సేపు స్పీకర్ పోడియం ముందు నిల్చోని తమ నిరసన తెలిపారు. దాంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.