ఎల్.కె.అద్వానీ
న్యూఢిల్లీ: ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే పార్లమెంటును ప్రొరోగ్ చేయలేదని ఆయన చెప్పారు.
ఫిబ్రవరిలో జరిగే సమావేశాలే పార్లమెంటు చివరి సమావేశాలు. ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెడితే పెట్టినట్లు లేకపోతే ప్రస్తుతానికి లేనట్లే. ఫిబ్రవరి మూడో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రస్తుత లోక్‌సభ గడువు మే నెలాఖరుకు ముగుస్తుంది. జూన్ ఒకటిన కొత్త లోక్‌సభ ఏర్పాటయ్యేలా ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది.రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ఈ నెల 23 వరకే రాష్ట్రపతి తుది గడువు ఇచ్చారు. ఆ తరువాత బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రెండు వారాల గడువు ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 6 లేక 7వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎంత హర్రీబర్రీగా చేశారో అలా చేస్తేనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.