తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Telangana bill passed by Lok Sabha | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Published Tue, Feb 18 2014 11:18 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Telangana bill passed by Lok Sabha

 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కల సాక్షాత్కరించటంతో జిల్లాలో మంగళవారం సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్యమ పురిటిగడ్డలో విజయోత్సవ వేడుకలు హోరెత్తాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినవెంటనే  తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీ జేఏసీ, సీపీఐ, కొన్నిచోట్ల టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.

 భారీ ఎత్తున టపాసులు కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లావ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పార్టీల నాయకులతోపాటు ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వేడుకల్లో పాల్గొన్నారు.

సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం, ప్రభుత్వ అతిథి గృహం వద్ద టీఆర్‌ఎస్ నాయకులు బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

 సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీలకతీతంగా శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీచేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. పట్టణ శివారులోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణవాదుల నివాళులర్పించారు.

     పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సంబరాలు జరుపుకుని మిఠాయిలు పంచిపెట్టారు. ఇస్నాపూర్ చౌరస్తాలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, పటాన్‌చెరులో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. బీరంగూడ చౌరస్తాలో మండల బీజేపీ నాయకుడు లకా్ష్మరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
 
 జహీరాబాద్‌లో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి తెలంగాణ నినాదాలు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గం ఇంచార్జి గౌని శివకుమార్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు వై.నరోత్తం ఆధ్వర్యంలోనూ సంబరాలు జరుపుకున్నారు.  
 
 నర్సాపూర్‌లో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరిపారు. మంత్రి అంబేద్కర్ విగ్రహానికిపూల మాల వేసి మిఠాయిలు పంచి పెట్టారు. గిరిజన మహిళల తో కలిసి నృత్యం చేశారు. టీఆర్‌ఎస్, టీఎన్జీఓస్, బీజేపీ. బీవీఆర్‌ఐటీ విద్యార్థులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి టపాకాయలు కాల్చారు. కౌడిపల్లిలో, వెల్దుర్తిలో, మాసాయిపేటలో తెలంగాణవాదులు ర్యాలీలు తీసి మిఠాయిలు పంచి పెట్టారు.

 మెదక్‌లో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఏసీ నాయకులు పట్టణంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, బీజేపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కటికె శ్రీను నృత్యాలు చేస్తు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు మల్లిఖార్జున్‌గౌడ్, క్రిష్ణా రెడ్డి, హఫీజ్, మేడి మధుసూధన్ రావు, అంజా గౌడ్ పాల్గొన్నారు.

 జోగిపేటలో, నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోనూ తెలంగాణ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement