పార్లమెంటులో తెలంగాణ బిల్లు?
-
15లోగా బిల్లుకు ఆమోదం లభించేలా కేంద్రం చర్యలు
-
4న జీవోఎం భేటీ.. బిల్లులో సవరణలు ప్రతిపాదించే అవకాశం
-
6న కేంద్ర కేబినెట్‌కు బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై తుది అంకానికి కేంద్రం సిద్ధమవుతోంది. తెలంగాణ బిల్లును వచ్చే నెల 10వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టి, 15వ తేదీకల్లా ఆమోదింపజేసుకొనే ఏర్పాట్లలో ఉంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఇప్పటికే ప్రకటించారు. వచ్చే నెల 5 నుంచి 21 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. యూపీఏ-2 ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. అందువల్ల రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి మండలి డిసెంబర్ 5న చేసిన తీర్మానం మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. బిల్లుకు తుది రూపం ఇవ్వడానికి చర్యలు చేపడుతోంది. బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు తెలంగాణ ఏర్పాటుపై షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం (జీవోఎం) వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. వచ్చే నెల 3లోగా శాసనసభ అభిప్రాయం కేంద్ర హోంశాఖకు చేరుతుందని, 4న జరిగే జీవోఎంలో అసెంబ్లీ ప్రతిపాదించిన ప్రధాన సవరణలను బిల్లులో చేర్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. బిల్లుపై కేంద్రం తన వైఖరిని చెబుతూ తదుపరి ప్రక్రియను చేపట్టాల్సిందిగా రాష్ట్రపతిని కోరేందుకు వచ్చే నెల 6న కేంద్ర మంత్రి మండలి భేటీ అవనుంది. అనంతరం వచ్చేనెల 10న బిల్లు పార్లమెంటు చేరే అవకాశం ఉంది. వచ్చేనెల 15కల్లా బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకుని, 17వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. ఒకవేళ బిల్లు ఆమోదం పొందడంలో ఆలస్యం జరిగితే సమావేశాలను మరో నాలుగు రోజులు పొడిగించే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి.
సవరణలపై కసరత్తు
రాష్ట్ర విభజన బిల్లులో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది. ఇప్పటికే దాదాపు 9 వేల సవరణలకు ప్రతిపాదనలు వ చ్చాయని, వీటిలో ప్రధానంగా దాదాపు 10 సవరణలను బిల్లులో చేర్చే అవకాశం ఉందని తెలిసింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు, పార్టీలు ప్రతిపాదిస్తున్న రీతిలో పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడం, నదీ జలాల పంపకం, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలతోపాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై పలు సవరణలు చేయవచ్చని సమాచారం. వీటికి సంబంధించిన సమాచారం కోసం కేంద్ర హోంశాఖ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.