బోధన్, న్యూస్‌లైన్ : ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి, ప్రత్యేక రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న యూపీఏ చైర్‌పర్సన్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి యావత్ తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. బోధన్‌లోని శక్కర్‌నగర్ ఎన్‌ఎస్‌ఎఫ్ క్రీడామైదానంలో శుక్రవారం నిర్వహించిన జైత్రయాత్ర సభలో వారు పాల్గొన్నారు. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని కీర్తిస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, బస్వరాజ్ సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.కె.అరుణ, సునీత ల క్ష్మారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ప్రసాద్‌రావు, ఎంపీలు మధుయాష్కీ, సురేశ్‌షెట్కార్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కె.రాజగోపాల్‌రెడ్డి, వి.హన్మంత్‌రావు, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ గండ్ర వెంకట్రమణ రెడ్డి, ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్, యాదవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఆకుల లలిత, గడుగు గంగాధర్, తాహెర్‌బిన్ హందాన్, అరుణ తార, గంగాశంకర్, పోతారెడ్డి, గంగాధర్ పట్వారీ తదితరులు పాల్గొన్నారు.
గొప్ప నిర్ణయం..
ఈ ప్రాంత ప్రజల దశాబ్ధాల కలను నెరవేర్చేందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సమాజం సోనియాగాంధీకి రుణపడి ఉంటుంది. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీలో తీర్మానం, కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలా చేశారు. రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్నారు. వచ్చే తెలంగాణలో మన భూములను సస్యశ్యామలం చేసుకుందాం.
-పి.సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి
తెలంగాణ ఇక తథ్యం..
తెలంగాణ ఏర్పాటు ఖాయం. ఇందుకు సోనియాగాంధీ కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. దీనికి ఆసియా ఖండంలోనే పేరు పొందిన బోధన్‌లో నిజాంషుగర్స్ ప్రైవేట్‌పరం చేయడం నిదర్శనం. ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలను సోనియా గుర్తించారు. సీమాంధ్ర ప్రజలతో మనకు ఎలాంటి పేచీ లేదు, విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందాం. -డి.శ్రీనివాస్,
ఎమ్మెల్సీ, పీసీసీ మాజీ చీఫ్
బిల్లు ఆమోదం కోసమే..
తెలంగాణ బిల్లు ఆమోదం కోసమే సోనియాగాంధీ నాకు పార్లమెంట్ డిప్యూటీ చీఫ్ విప్ పదవి ఇచ్చారు. బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యతంతా భుజస్కంధాలపై మోస్తాను. చంద్రబాబునాయుడు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. తీరా రాష్ట్రం ఏర్పడే సమయంలో అడ్డుపడుతున్న టీడీపీని తెలంగాణ ప్రాంతం నుంచి తరిమికొట్టాలి. నిజాంషుగర్స్, సింగూర్ ప్రాజెక్ట్ నీళ్లను దూరం చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. -మధుయాష్కీగౌడ్, ఎంపీ, నిజామాబాద్
పకడ్బందీ నిర్ణయం..
తెలంగాణ ఎంపీలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సమష్టి కృషితో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాబోతోంది. ఈప్రాంత ప్రజల దశాబ్ధాల ఆకాంక్షను యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ గుర్తించారు. అందుకే రాష్ట్ర విభజనకు పకడ్బందీగా నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను సోనియాగాంధీ నిలబెట్టుకున్నారు.
-సురేశ్ షెట్కార్,
ఎంపీ, జహీరాబాద్
ప్రతిగుండెలో సోనియా..
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ జైత్రయాత్ర సభను నిర్వహించినాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన జరిగితే నదీజలాల కోసం యుద్ధాలు వస్తాయని ప్రకటన చేసిండ్రు. దీనికి మంత్రి సుదర్శన్‌రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు.
-షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ
రాష్ట్రం రాదన్న బెంగవద్దు
సీమాంధ్ర నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లొంగకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాదని ఇక బెంగ పడాల్సిన అవసరం లేదు. కలిసుందామంటున్న సీమాంధ్రులు ఇప్పటికే తెలంగాణలోని సగం సంపదను దోచుకున్నారు. మిగిలింది ఊడ్చుకెళ్లడానికే ఇంకా కలిసుందామంటున్నారు.
-ఈరవత్రి అనిల్, ప్రభుత్వ విప్
అమరుల కుటుంబాలను ఆదుకోవాలి
తెలంగాణ సాధనోద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలుగా గుర్తించాలి. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన ఉంది. ప్రాణత్యాగాలకు చలించిపోయిన సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు.
-కె.ఆర్.సురేశ్‌రెడ్డి, మాజీ స్పీకర్