
'తెలంగాణ మంత్రులు మమ్మల్ని కలుపుపోవాలి'
హైదరాబాద్ : రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా రెండు చోట్ల శాసనమండళ్లు కొనసాగుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము న్యాయ సలహా తీసుకున్నామని ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎల్పీలో గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ప్రత్యేక రాష్ట్రా అంశానికి సంబంధించిన కార్యక్రమాలలో తెలంగాణ మంత్రులు ఎమ్మెల్సీలను కలుపుకోవాలన్నారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మంత్రుల బృందానికి పలు అంశాలతో కూడిన నివేదిక సమర్పిస్తామని తెలిపారు. అపోహలు, అనుమానాలు పెంచవద్దని ఈ సందర్భంగా ఆమోస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించాల్సిందిగా సీమాంధ్ర నాయకులను కోరాలని ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలు సమర్పిస్తామన్నారు. కేబినెట్ నోట్లో పొందుపరిచిన విధంగా మంత్రుల కమిటీ ఆరువారాల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు.
వచ్చే ఏడాది రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నందున తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేయాలన్నారు. కేబినెట్ నోట్లో పొందుపరిచిన విధంగా గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే ఉమ్మడి రాజధాని పరిమితం కావాలన్నారు.