yadava reddy
-
ఆ ఇద్దరికి హైకోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్ : అనర్హతకు గురైన ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైంది. తమపై అనర్హత వేటు వేయడంపై రాములు నాయక్, యాదవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. రాములు నాయక్, యాదవరెడ్డిలను అనర్హులుగా పేర్కొంటూ శాసనమండలి వెలువరించిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని కోర్టు తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది.. తాము సుప్రీం కోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆపాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థనను ఎన్నికల సంఘానికి తెలపాలని ఈసీ తరఫు న్యాయవాదికి సూచించింది. -
బహిరంగ సభలోనే కండువా మార్చారు
సాక్షి, హైదరాబాద్: బహిరంగసభలో పార్టీ కండువా మార్చిన యాదవరెడ్డిని ఎమ్మెల్సీగా అనర్హుడిని చేస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలోనే యాదవరెడ్డి టీఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని గుర్తు చేశారు. మేడ్చల్‌లో గతేడాది నవంబర్ 23న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్‌గాంధీల సమక్షంలో యాదవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని, మండలి చైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. ఎమ్మెల్సీగా అనర్హుడిగా మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యాదవరెడ్డి, రాములు నాయక్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పత్రికల్లో వచ్చిన వార్తలు కాకుండా కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు చూపాలని ధర్మాసనం కోరింది. దీంతో గతేడాది సెప్టెంబర్ 14న దిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలిశారని బదులిచ్చారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేందుకు మాత్రమే వెళ్లారని యాదవరెడ్డి ఒప్పకున్నారని ధర్మాసనం గుర్తు చేసింది. యాదవరెడ్డి కాంగ్రెస్‌లో చేరినట్లు తమ వద్ద ఆధారాలు మాత్రం లేవని అదనపు ఏజీ బదులిచ్చారు. అయితే అన్ని పత్రికల్లోనూ, మీడియాలోనూ కాంగ్రెస్ తీర్థం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయని, వాటిని ఏనాడూ యాదవరెడ్డి ఖండించలేదని గుర్తుచేశారు. మహాకూటమి నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ కండువా మార్చడమే పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని చెప్పారు. విచారణ సమయంలో యాదవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి లేచి.. సోనియా, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలకు చెప్పేందుకే పిటిషనర్ ఢిల్లీ వెళ్లారని, ఆ ఫొటోలను పత్రికలు ప్రచురిస్తే పార్టీ ఫిరాయించినట్లు పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాలి కదా? ‘పత్రికల్లో వచ్చిన వార్తల గురించి పదేపదే చెబుతున్నారు. న్యాయవ్యవస్థకు ఆధారాలు ముఖ్యం. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్–3 ప్రకారం ఇరుపక్షాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. మండలి చైర్మన్ అవకాశం ఇచ్చారా. నేరారోపణ కేసు విచారణకు వచ్చినప్పుడు నిందితుడ్ని విచారించాక ఆ నిందితుడికి కూడా తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాలి. మండలి చైర్మన్ ఎందుకు అవకాశం ఇవ్వలేదు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా న్యాయవ్యవస్థ ఒక నిర్ణయానికి రాకూడదని సుప్రీం కోర్టు సైతం చెప్పింది. ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆధారం కావాలి.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా చర్యలు తీసుకోవడం తప్పు అవుతుంది. తెలంగాణ ఇచ్చినందుకు యాదవరెడ్డి దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలే చెప్పానని అంటున్నారు. కాంగ్రెస్‌లో చేరారని చెప్పడానికి ఆ«ధారం ఏముందో చూపండి’అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ 10కి వాయిదా వేశారు. -
ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వేటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఊహించినట్టుగానే శాసనమండలి సభ్యుడు కొంపల్లి యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. టీఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరి.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని ఇటీవల ఆ పార్టీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న చైర్మన్ బుధవారం యాదవరెడ్డిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన యాదవరెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు ఆయన టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి సొంతగూటికి చేరారు. అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్‌ను వదిలిన ఆయన అదే పరిణామాల మధ్య నేడు టీఆర్ఎస్ను వీడాల్సివచ్చింది. 2014లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయన వికారాబాద్ జిల్లా నవాబుపేట జెడ్పీటీసీగా గెలుపొందారు. జెడ్పీచైర్మన్‌గా ఆయన పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. దీనికి తగ్గట్టుగా జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు అనువైన సంఖ్యా బలాన్ని కూడా ఆ పార్టీ సమకూర్చుకుంది. అయితే, ఊహించని రీతిలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆయనను మరో ఇద్దరు సభ్యులు అనుసరించడంతో మేజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ జెడ్పీ చైర్మన్ పదవి అందకుండా పోయింది. కష్టకాలంలో పార్టీకి మద్దతు పలికిన యాదవరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ద్వారా గులాబీ దళపతి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. పదవీకాలం ముగిసిన అనంతరం మరోసారి గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా చేశారు. కొండాకు అండ! కొన్నాళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల వేళ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గులాబీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అమరవీరుల ఆశయాల సాధనలో ప్రభుత్వం విఫలమైందని ధిక్కారస్వరం వినిపించారు. అక్రమార్కులకు పట్టం కడుతూ..తెలంగాణ కోసం పోరాడినవారిని విస్మరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్కు రాజీనామా చేసి.. రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాదవరెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రచారాన్ని ఖండిçస్తూనే వస్తున్నా.. టీఆర్ఎస్ నాయకత్వం యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదేరోజు సాయంత్రం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో సొంతగూటికి చేరారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆఖండ విజయం సాధించడంతో యాదవరెడ్డి ఎమ్మెల్సీ పదవి ప్రశ్నార్థకంగా మారింది. యాదవరెడ్డితోపాటు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన మరికొందరు సభ్యులపై వేటు వేయాలని టీఆర్ఎస్ శాసనమండలి పక్షం ఫిర్యాదు చేయడమేగాకుండా.. ఆధారాలు కూడా సమర్పించడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ యాదవరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
ఆయనతో టచ్‌లో లేను: యాదవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు ఎటువంటి నోటీసులు అందలేదని ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీఆర్ఎస్ శుక్రవారం ఆయనను బహిష్కరించింది. దీనిపై ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. మీడియా ద్వారానే తనకు తెలిసిందని, అధికారిక సమాచారం లేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని చెప్పారు. (ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్) ‘దీనికి కారణాలు ఏమిటనేది వాళ్లే చెప్పాలి. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా ఒక్కరోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. గ్రూపు రాజకీయాలు చేయలేదు. పార్టీ వ్యతిరేక ప్రకటన చేయలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వీళ్ల నిర్వచనం ఏంటో వాళ్లే చెప్పాలి. షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా బహిష్కరించడం సహేతుకం కాద’ని అన్నారు. కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో మీపై చర్య తీసుకున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడతాయని చెప్పారు. ఎంత మంది పార్టీని వీడారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలవడమే తప్పా, ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదని యాదవరెడ్డి వివరించారు. కాగా, టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యాదవరెడ్డిపై వేటు పడినట్టుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఈరోజు మధ్యాహ్నం ఖండించిన యాదవరెడ్డి.. రాత్రి మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం గమనార్హం. -
ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. నేడు యాదవ రెడ్డి సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా సోనియా సభలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇకపోతే మరో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీని వీడే నేతలను ముందుగానే గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు అర్థమవుతోంది. -
'ఓటుకు నోటు కేసు తుఫానులా వ్యాపించింది'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా తుఫానులా వ్యాపించిందని తెలంగాణ శాసన మండలి సభ్యుడు కె.యాదవ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో విపత్కర పరిస్థితులు సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని యాదవ్ రెడ్డి ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు వచ్చిన తర్వాత కూడా సిగ్గుతో తల దించుకోకుండా, అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..ఈ కేసులో ఉన్న ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీటీడీపీనేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారని, ఏసీబీ కాదు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని వితండవాదం చేస్తున్నారని, అవినీతి వ్యవహారాలను ఏసీబీ విచారిస్తుందని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ మూర్ఖత్వం మానుకోవాలని యాదవరెడ్డి హితవు పలికారు. -
చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి
-
చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును A-1 ముద్దాయిగా చేర్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ఆయన బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని యాదవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు సహకరించలేదనే భావనతోనే గవర్నర్ నరసింహన్‌పై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇదే గవర్నర్‌ను కొనసాగించాలని టీడీపీ నేతలు కోరారనే విషయాన్ని యాదవరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబే గందరగోళం సృష్టిస్తున్నారని యాదవరెడ్డి మండిపడ్డారు. -
పొన్నాల తీరు పై యాదవరెడ్డి ఆగ్రహం
-
బరిలో 190 మంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ అంకం సోమవారం ముగియడంతో తుది బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ప్రత్యర్థులు ఎవరనేది తేలడంతో అభ్యర్థులు సరికొత్త వ్యూహాలతో ప్రచార రంగంలోకి దూకారు. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 334 మంది నామినేషన్లు వేయగా వీరిలో 144 మంది సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఒక్కో స్థానానికి సగటున ఆరుగురు పోటీపడుతున్నారు. పార్టీ అధిష్టాన నేతల బుజ్జగింపులు, బెదిరింపుల కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థులు పలువురు వెనక్కితగ్గారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామన్న భరోసాతో పోటీ నుంచి తప్పుకొన్నారు. జిల్లా మొత్తం మీద ఇబ్రహీంపట్నం, మంచాల జెడ్పీటీసీ స్థానాల నుంచి అత్యధిక సంఖ్యలో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. డివిజన్ల వారీగా చూస్తే తూర్పు డివిజన్లోని 8 స్థానాల్లో 72 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల నుంచి 33 మంది అభ్యర్థులను నిలపగా తెలుగుదేశం పార్టీ 30 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థులతో ఉన్న సర్దుబాటు కారణంగా మూడు స్థానాల్లో పోటీ నుంచి తప్పుకుంది. టీఆర్ఎస్ కూడా ఒక స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. సరూర్‌నగర్ నుంచి ఆ పార్టీ పోటీలో లేదు. జెడ్పీచైర్మన్ పోటీ రసవత్తరం ప్రతిష్టాత్మక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో పార్టీలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. నవాబ్‌పేట్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున లక్ష్మారెడ్డి చైర్మన్ కుర్చీ రేసులో ఉన్నారు. ఘట్కేసర్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. ఇక చైర్మన్పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి పోటీపడుతున్న మాజీ జెడ్పీచైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి యాలాల జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. చైర్మన్ అభ్యర్థులు బరిలో ఉన్న ఈ మూడు స్థానాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. -
టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా సునీత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సునీతా మహేందర్‌రెడ్డి మరోసారి నిలిచారు. 2006లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుఫున గెలిచిన ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బంట్వారం జెడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసిన ఆమె... మహిళా(జనరల్) కోటాలో జెడ్పీ పీఠాన్ని అధిష్టించారు. ఇటీవల ఆమె భర్త, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో సునీత కూడా ఆయన బాటను అనుసరించారు. తాజాగా యాలాల జిల్లా ప్రాదేశిక స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి జిల్లా పరిషత్ రిజర్వేషన్ జనరల్‌కు ఖరారు కావడంతో కాంగ్రెస్, టీడీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. ఈ క్రమంలోనే నవాబ్‌పేట మండలం నుంచి కొం పల్లి ఆనంతరెడ్డిని నిలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ కూడా జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరును ప్రకటించడం, ఆయనా ఇదే మండలం నుంచి పోటీకి దిగడంతో ఆనంతరెడ్డి వెనక్కితగ్గారు. స్థానిక టీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపులు కూడా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న తరుణంలో సునీతను చైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా ప్రకటించేందుకు టీఆర్ఎస్ సుముఖత చూపుతోంది. శనివారం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్యుల సమావేశంలో ఈమె పేరును అధికారికంగా ఖరారు చేసే అవకాశముంది. -
'కిరణ్‌పై తెలంగాణ ప్రభుత్వంతో విచారణ జరిపిస్తాం'
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అన్నారు. శుక్రవారం టి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం లోక్‌సభ, శాసనసభ స్థానాలలో విజయం సాధించి సోనియాకు కానుకగా ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా రాజీనామా చేసిన కిరణ్‌పై ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ తన పదవికి రాజీనామా చేసే ఆరునెలల ముందు నుంచి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని త్వరలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించుకుని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాబోతున్న తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ వరకు గన్‌పార్క్ వరకు భారీగా ర్యాలీ చేపడుతున్నట్లు టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. -
విభజన బిల్లును వ్యతిరేకించడం ఏకగ్రీవం కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లును శాసనమండలి వ్యతిరేకించడం ఏకగ్రీవం కాదని, రికార్డులను పరిశీలించి ఆ తీర్మానాన్ని సవరించాలంటూ తెలంగాణ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు బుధవారం మండలిలో పట్టుబట్టారు. దీంతో సీమాంధ్ర ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, శ్రీనివాసులునాయుడు, గోవిందరెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలంటూ పోడియం ముందు నినాదాలకు దిగారు. ప్రతిగా టీ ఎమ్మెల్సీ లూ నినాదాలు చేశారు. దీంతో 10.22 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి 12:15 గంటలకు ప్రారంభమవగానే ఇదే అంశంపై ఇరుప్రాంతాల ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశా రు. దీంతో 12:23 గంటలకు సభ వాయిదా పడింది. మండలి ముందుంచాలి: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యల్ని మండలికి తెలపాలని చైర్మన్ చక్రపాణి రూలింగ్ ఇచ్చారు. బుధవారం మండలి ప్రారంభమవగానే పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, రజ్వీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి మహీధర్‌రెడ్డి జవాబిస్తూ సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగించబోమని హామీఇచ్చారు. -
'బాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నాడు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి డిమాండ్ చేశారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు ఏం చేయాలో కూడా చెప్పాలన్నారు. ప్రధానమంత్రి హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వారు శనివారమిక్కడ పేర్కొన్నారు. టీడీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ఆమోస్, యాదవరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సబ్ జూనియర్ నేతగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై ఓటింగే అవసరం లేనప్పుడు ఎమ్మెల్యేలను కొనే అవసరం ఎవరికుందని సూటిగా ప్రశ్నించారు. -
'తెలంగాణ మంత్రులు మమ్మల్ని కలుపుపోవాలి'
హైదరాబాద్ : రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా రెండు చోట్ల శాసనమండళ్లు కొనసాగుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము న్యాయ సలహా తీసుకున్నామని ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎల్పీలో గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ప్రత్యేక రాష్ట్రా అంశానికి సంబంధించిన కార్యక్రమాలలో తెలంగాణ మంత్రులు ఎమ్మెల్సీలను కలుపుకోవాలన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మంత్రుల బృందానికి పలు అంశాలతో కూడిన నివేదిక సమర్పిస్తామని తెలిపారు. అపోహలు, అనుమానాలు పెంచవద్దని ఈ సందర్భంగా ఆమోస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించాల్సిందిగా సీమాంధ్ర నాయకులను కోరాలని ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలు సమర్పిస్తామన్నారు. కేబినెట్ నోట్లో పొందుపరిచిన విధంగా మంత్రుల కమిటీ ఆరువారాల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నందున తెలంగాణ పీసీసీ ఏర్పాటు చేయాలన్నారు. కేబినెట్ నోట్లో పొందుపరిచిన విధంగా గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే ఉమ్మడి రాజధాని పరిమితం కావాలన్నారు.