
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు ఎటువంటి నోటీసులు అందలేదని ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీఆర్‌ఎస్ శుక్రవారం ఆయనను బహిష్కరించింది. దీనిపై ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. మీడియా ద్వారానే తనకు తెలిసిందని, అధికారిక సమాచారం లేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని చెప్పారు. (ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్‌ఎస్)
‘దీనికి కారణాలు ఏమిటనేది వాళ్లే చెప్పాలి. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా ఒక్కరోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. గ్రూపు రాజకీయాలు చేయలేదు. పార్టీ వ్యతిరేక ప్రకటన చేయలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వీళ్ల నిర్వచనం ఏంటో వాళ్లే చెప్పాలి. షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా బహిష్కరించడం సహేతుకం కాద’ని అన్నారు.
కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో మీపై చర్య తీసుకున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడతాయని చెప్పారు. ఎంత మంది పార్టీని వీడారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలవడమే తప్పా, ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదని యాదవరెడ్డి వివరించారు. కాగా, టీఆర్‌ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యాదవరెడ్డిపై వేటు పడినట్టుగా భావిస్తున్నారు.
అయితే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఈరోజు మధ్యాహ్నం ఖండించిన యాదవరెడ్డి.. రాత్రి మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment