సాక్షి, హైదరాబాద్: బహిరంగసభలో పార్టీ కండువా మార్చిన యాదవరెడ్డిని ఎమ్మెల్సీగా అనర్హుడిని చేస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలోనే యాదవరెడ్డి టీఆర్‌ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని గుర్తు చేశారు. మేడ్చల్‌లో గతేడాది నవంబర్ 23న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్‌గాంధీల సమక్షంలో యాదవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని, మండలి చైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.
ఎమ్మెల్సీగా అనర్హుడిగా మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యాదవరెడ్డి, రాములు నాయక్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పత్రికల్లో వచ్చిన వార్తలు కాకుండా కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు చూపాలని ధర్మాసనం కోరింది. దీంతో గతేడాది సెప్టెంబర్ 14న దిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలిశారని బదులిచ్చారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేందుకు మాత్రమే వెళ్లారని యాదవరెడ్డి ఒప్పకున్నారని ధర్మాసనం గుర్తు చేసింది.
యాదవరెడ్డి కాంగ్రెస్‌లో చేరినట్లు తమ వద్ద ఆధారాలు మాత్రం లేవని అదనపు ఏజీ బదులిచ్చారు. అయితే అన్ని పత్రికల్లోనూ, మీడియాలోనూ కాంగ్రెస్ తీర్థం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయని, వాటిని ఏనాడూ యాదవరెడ్డి ఖండించలేదని గుర్తుచేశారు. మహాకూటమి నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ కండువా మార్చడమే పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని చెప్పారు. విచారణ సమయంలో యాదవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి లేచి.. సోనియా, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలకు చెప్పేందుకే పిటిషనర్ ఢిల్లీ వెళ్లారని, ఆ ఫొటోలను పత్రికలు ప్రచురిస్తే పార్టీ ఫిరాయించినట్లు పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాలి కదా?
‘పత్రికల్లో వచ్చిన వార్తల గురించి పదేపదే చెబుతున్నారు. న్యాయవ్యవస్థకు ఆధారాలు ముఖ్యం. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్–3 ప్రకారం ఇరుపక్షాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. మండలి చైర్మన్ అవకాశం ఇచ్చారా. నేరారోపణ కేసు విచారణకు వచ్చినప్పుడు నిందితుడ్ని విచారించాక ఆ నిందితుడికి కూడా తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాలి. మండలి చైర్మన్ ఎందుకు అవకాశం ఇవ్వలేదు.
పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా న్యాయవ్యవస్థ ఒక నిర్ణయానికి రాకూడదని సుప్రీం కోర్టు సైతం చెప్పింది. ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆధారం కావాలి.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా చర్యలు తీసుకోవడం తప్పు అవుతుంది. తెలంగాణ ఇచ్చినందుకు యాదవరెడ్డి దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలే చెప్పానని అంటున్నారు. కాంగ్రెస్‌లో చేరారని చెప్పడానికి ఆ«ధారం ఏముందో చూపండి’అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ 10కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment