రాష్ట్ర పునర్విభజన బిల్లును శాసనమండలి వ్యతిరేకించడం ఏకగ్రీవం కాదని, రికార్డులను పరిశీలించి ఆ తీర్మానాన్ని సవరించాలంటూ తెలంగాణ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు బుధవారం మండలిలో పట్టుబట్టారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లును శాసనమండలి వ్యతిరేకించడం ఏకగ్రీవం కాదని, రికార్డులను పరిశీలించి ఆ తీర్మానాన్ని సవరించాలంటూ తెలంగాణ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి తదితరులు బుధవారం మండలిలో పట్టుబట్టారు. దీంతో సీమాంధ్ర ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, శ్రీనివాసులునాయుడు, గోవిందరెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలంటూ పోడియం ముందు నినాదాలకు దిగారు. ప్రతిగా టీ ఎమ్మెల్సీ లూ నినాదాలు చేశారు. దీంతో 10.22 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి 12:15 గంటలకు ప్రారంభమవగానే ఇదే అంశంపై ఇరుప్రాంతాల ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశా రు. దీంతో 12:23 గంటలకు సభ వాయిదా పడింది.
మండలి ముందుంచాలి: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యల్ని మండలికి తెలపాలని చైర్మన్ చక్రపాణి రూలింగ్ ఇచ్చారు. బుధవారం మండలి ప్రారంభమవగానే పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, రజ్వీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి మహీధర్‌రెడ్డి జవాబిస్తూ సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగించబోమని హామీఇచ్చారు.