ముచ్చుమర్రి ఘటనలో మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడంపై సీపీఎం ఆగ్రహం
పగిడ్యాల: మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేయడానికి శుక్రవారం ముచ్చుమర్రికి వ చ్చిన మంత్రులకు భంగపాటు తప్పలేదు. ఘటన జరిగి 13 రోజులైన పరామర్శించడానికి మనస్సు రాలేదా? అంటూ సీపీఎం నేతలు, స్థానికులు మంత్రులను ప్రశ్నించారు.
కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసుల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు.. మంత్రి ఫరూక్‌ను కోరారు. దీంతో మంత్రి ఆగ్రహిస్తూ మాకు తెలుసంటూ చులకన భావంతో మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకుల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది.
ఘటన జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాన్ని బాధిత తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారని నిలదీశారు. దీంతో కమ్యూనిస్టులకు, మంత్రులకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు, రోప్ పార్టీ సిబ్బంది కమ్యూనిస్టులను కట్టడి చేసేందుకు యత్నించారు. సమాధానం చెప్పాలని, లేదంటే వాహనాలను కదలనిచ్చేది లేదని కమ్యూనిస్టులు స్వరం పెంచడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.
వెంటనే స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సీపీఎం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment