ప్రభుత్వ అధికారులపై హైకోర్టు మండిపాటు
సాక్షి, అమరావతి: తగినంత సమయం ఇస్తున్నా, ఆయా కేసుల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయకపోతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విషయంలో అధికారులు మందకొడిగా ఉన్నారని, ఇలా నిద్రపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లాలో లైమ్ స్టోన్ ఖనిజం ఉన్న భూములను అసైన్‌మెంట్ కింద భూమి లేని పేదలకు ఇస్తున్నారని, దీని వెనుక బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) ఉన్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ అప్పటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే) 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం అన్ని వివరాలతో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. గతంలో ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు కాలేదని తెలుసుకున్న ధర్మాసనం ‘అసలు మీరు (అధికారులు) కోర్టును సీరియస్‌గా తీసుకుంటున్నారా.. లేదా?’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది.
కౌంటర్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, అయితే అసాధారణ జాప్యానికి గాను కేంద్ర కార్యదర్శికి రూ.20 వేలు, కలెక్టర్‌కు సైతం రూ.10 వేలు ఖర్చులు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వొకేట్స్ క్లర్కుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇలా జాప్యం చేసే ప్రతి కేసులోనూ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి మెరుగైన అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment