ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా తుఫానులా వ్యాపించిందని తెలంగాణ శాసన మండలి సభ్యుడు కె.యాదవరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా తుఫానులా వ్యాపించిందని తెలంగాణ శాసన మండలి సభ్యుడు కె.యాదవ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో విపత్కర పరిస్థితులు సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని యాదవ్ రెడ్డి ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు వచ్చిన తర్వాత కూడా సిగ్గుతో తల దించుకోకుండా, అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..ఈ కేసులో ఉన్న ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీటీడీపీనేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారని, ఏసీబీ కాదు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని వితండవాదం చేస్తున్నారని, అవినీతి వ్యవహారాలను ఏసీబీ విచారిస్తుందని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ మూర్ఖత్వం మానుకోవాలని యాదవరెడ్డి హితవు పలికారు.