సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ అంకం సోమవారం ముగియడంతో తుది బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ప్రత్యర్థులు ఎవరనేది తేలడంతో అభ్యర్థులు సరికొత్త వ్యూహాలతో ప్రచార రంగంలోకి దూకారు. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 334 మంది నామినేషన్లు వేయగా వీరిలో 144 మంది సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఒక్కో స్థానానికి సగటున ఆరుగురు పోటీపడుతున్నారు. పార్టీ అధిష్టాన నేతల బుజ్జగింపులు, బెదిరింపుల కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థులు పలువురు వెనక్కితగ్గారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామన్న భరోసాతో పోటీ నుంచి తప్పుకొన్నారు. జిల్లా మొత్తం మీద ఇబ్రహీంపట్నం, మంచాల జెడ్పీటీసీ స్థానాల నుంచి అత్యధిక సంఖ్యలో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.
డివిజన్ల వారీగా చూస్తే తూర్పు డివిజన్‌లోని 8 స్థానాల్లో 72 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల నుంచి 33 మంది అభ్యర్థులను నిలపగా తెలుగుదేశం పార్టీ 30 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థులతో ఉన్న సర్దుబాటు కారణంగా మూడు స్థానాల్లో పోటీ నుంచి తప్పుకుంది. టీఆర్‌ఎస్ కూడా ఒక స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. సరూర్‌నగర్ నుంచి ఆ పార్టీ పోటీలో లేదు.
జెడ్పీచైర్మన్ పోటీ రసవత్తరం
ప్రతిష్టాత్మక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో పార్టీలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. నవాబ్‌పేట్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున లక్ష్మారెడ్డి చైర్మన్ కుర్చీ రేసులో ఉన్నారు. ఘట్‌కేసర్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. ఇక చైర్మన్‌పదవి కోసం టీఆర్‌ఎస్ పార్టీ నుంచి తిరిగి పోటీపడుతున్న మాజీ జెడ్పీచైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి యాలాల జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. చైర్మన్ అభ్యర్థులు బరిలో ఉన్న ఈ మూడు స్థానాల్లో పోటీ రసవత్తరంగా ఉంది.
బరిలో 190 మంది
Published Tue, Mar 25 2014 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement