లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో రాష్ట్రంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
సాక్షి, ముంబై: లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో రాష్ట్రంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్న బుల్డానా, అకోలా, అమరావతి, వార్దా, రామ్‌టెక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరొలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు సోమవారం పరిశీలించారు. సరైన వివరాలు లేని కారణంగా 48 నామినేషన్లు తిరస్కరించామని ప్రకటించారు.
నాగపూర్‌లో దాఖలైన 51 నామినేషన్లలో ఆరు, రాంటెక్ స్థానంలో దాఖలైన 30 నామినేషన్లలో మూడు తిరస్కరించినట్టు తెలిపారు. అకోలాలో తొమ్మిది మంది అభ్యర్థులు 22 నామినేషన్లు దాఖలు చేశారని, వీటిలో బి ఫార్మ్ లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. బుల్డానా లోక్‌సభ నియోజకవర్గంలో కూడా 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 48 నామినేషన్లలో ఐదు, వార్ధాలో ఏకంగా 13 మంది నామినేషన్లను తిరస్కరించారు. అమరావతిలో మూడు, భండారా-గోండియాలో నాలుగు, చంద్రాపూర్‌లో ఆరు, గడ్చిరోలి-చిమూర్‌లో రెండు, యావత్మాల్-వాషీంలో నలుగురి నామినేషన్లు తప్పుగా ఉన్నాయని ఈసీ అధికారులు తెలిపారు.
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు
నామినేషన్లను ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే అనేకమంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మంగళవారం కూడా మరికొంతమంది ఉపసంహరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉండనున్నారనేది ఖచ్చితంగా తెలియనుంది.