nomination withdrawal
-
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలే.. ట్విస్ట్ ఇచ్చిన ఆప్ అభ్యర్థి
సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు తమ నేతను బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని, దాన్ని అధికారికంగా ఆమోదించవద్దని ఆప్ నేతలు ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు. అయితే అనూహ్యంగా ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాల్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో సందేశం విడుదల చేశారు. తన మనస్సాక్షి చెప్పినట్టే చేశానని, స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఎవరూ ఒత్తిడి చేయలేది స్పష్టం చేశారు. దీంతో ఆప్ నేతలు షాక్ అయ్యారు. ఆప్ అభ్యర్థిగా ప్రచారం చేసే సమయంలో నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు తనను కేజ్రీవాల్ పార్టీ తరఫున పోటీ చేయొద్దని కోరారని కంచన్ జరీవాల్ చెప్పుకొచ్చారు. తనను యాంటీ నేషనల్, యాంటీ గుజరాత్ అని పిలిచారని పేర్కొన్నారు. అందుకే ప్రజల అభీష్టం మేరకే తన మనస్సాక్షి చెప్పేది పాటించి పోటీ నుంచి స్వతహాగా తప్పుకుంటున్నట్లు చెప్పారు. అంతకుముందు తమ అభ్యర్థిని బీజేపీ గూండాలు కిడ్నాప్ చేశారని ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. బలవంతంగా లాక్కెళ్లి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని వీడియో షేర్ చేసింది. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించింది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
చివరి రోజు ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై థరూర్ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు శశి థరూర్. తనకు ఎదురయ్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్ నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కాల్స్ రావటం ఆశ్చరానికి గురి చేసింది. వారు ఢిల్లీ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అయితే.. అవన్నీ అవాస్తవం. నా జీవితంలో ఇంతవరకెప్పుడూ సవాళ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. తగ్గను కూడా. ఇది పోరాటం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న స్నేహపూర్వక పోటీ. ఇందులో నేను చివరి వరకు పోరాడాలి. నేను పోటీలో ఉన్నా. అక్టోబర్ 17న హాజరై ఓటు వేయాలని కోరుతున్నాను. రేపటి కోసం, థరూర్ కోసం ఆలోచించండి’ - శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ నామినేషన్లకు చివరి రోజైన అక్టోబర్ 8న థరూర్ ఈ వీడియో పోస్ట్ చేయడంతో అధ్యక్ష పదవికి పోలింగ్ ఖాయమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్‌తో పాటు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ అనివార్యమైంది. అక్టోబరు 17న ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గేకు ఎక్కువమంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. Surprised to get calls saying that “sources in Delhi” claim that I have withdrawn! I am on this race till the finish. #ThinkTomorrowThinkTharoor pic.twitter.com/zF3HZ8LtH5 — Shashi Tharoor (@ShashiTharoor) October 8, 2022 ఇదీ చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్ఎస్ విఫలయత్నం.. ‘విత్‌డ్రా’మా.. వివాదం
సాక్షి, ఆదిలాబాద్: ‘స్థానిక’ఎమ్మెల్సీ నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజైన శుక్రవారం ఆదిలా బాద్‌లో వివాదాలు తలెత్తాయి. తమ అభ్యర్థి దండె విఠల్‌ను ఏకగ్రీవం చేసుకునేందుకు టీఆర్ఎస్ నేత లు చివరివరకు ప్రయత్నించారు. నామినేషన్లు ఉప సంహరించుకోవాలంటూ స్వతంత్ర అభ్యర్థులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో అందరూ విత్‌డ్రా చేసుకున్నా.. స్వతంత్ర అభ్యర్థి, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పరాణి పోటీలో నిలిచారు. అంతకుముందు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ ఉపసంహరించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద పుష్పరాణి ధర్నా చేశారు. ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు, బీజేపీ శ్రేణులు ఆమెకు మద్దతు రావడం.. మరోవైపు పోటీగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీ సులు అప్రమత్తమై.. ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే పుష్పరాణి పోటీలో ఉన్నట్టు రిటర్నింగ్ అధి కారి ప్రకటించాక.. ఈ వివాదం సద్దుమణిగింది. (చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు) మరో అభ్యర్థి ఆందోళన మరోవైపు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నేతలు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్‌ను ఉప సంహరించారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని, కోర్టును కూడా ఆశ్రయిస్తానని తెలిపారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
Huzurabad Bypoll 2021: బరిలో 30 మంది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బీజేపీ నుంచి ఈటల జమున, కాంగ్రెస్ నుంచి ఒంటెల లింగారెడ్డితోపాటు మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 30 మంది మాత్రమే తుదిపోరులో నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించామని హుజూ రాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ల స్వీకరణ, స్రూ్కటినీ, ఉపసంహరణ కార్యక్రమాలు పూర్తిచేశామని తెలిపారు. రెండు ఈవీఎం(ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్)లతోనే ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉపపోరులో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపఎన్నికలో పోటీ చేయాలని అనుకున్నారు. నామినేషన్ల దాఖలుకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వారు భారీగా తరలివచ్చారు. అయితే ఎన్నికల నిబంధనల పేరిట అధికారులు వారిని వెనక్కి పంపారు. చివరిరోజు 12 మంది మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. వీరిలోనూ తొమ్మిది మంది నామినేషన్లను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. కమలాపూర్‌కు చెందిన గుర్రం కిరణ్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ బుధవారం నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన తిరుపతి నాయక్ (గౌను గుర్తు), వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన గంజి యుగంధర్ (కుండ గుర్తు) మాత్రమే తుదిపోరులో నిలిచారు. వీరు త్వరలోనే హుజూరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గుర్తుల కేటాయింపు ఇలా.. ప్రధానపార్టీల నుంచి ఈటల రాజేందర్ (బీజేపీ), గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) బరిలో నిలిచారు. మిగిలిన ఏడుగురు రిజిస్టర్డ్ పార్టీలవారు కాగా, మరో 20 మంది ఇండిపెండెంట్లు. వీరికి ఎన్నికల సంఘం బుధవారం గుర్తులు కేటాయించింది. స్వతంత్రులకు కేటాయించిన కాలీఫ్లవర్, పెన్నుపాళీ గుర్తులు కమలం గుర్తును పోలి ఉన్నాయని, దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బరి నుంచి తప్పుకున్నది వీరే 1.ఈటల జమన(బీజేపీ) 2. ఒంటెల లింగారెడ్డి (కాంగ్రెస్) 3.కొలుగూరి రాజ్‌కుమార్ 4.ఎమ్మడి రవి 5.అంగోత్ వినోద్‌కుమార్ 6.రేకల సైదులు 7.కౌటం రవీందర్ 8. ఎనగందుల వెంకటేశ్వర్లు 9.నూర్జహాన్ బేగం 10. వరికోలు శ్రీనివాస్ 11.పెట్టెం మల్లిఖార్జున్ 12 గుర్రం కిరణ్ -
Huzurabad Bypoll: ఈటల జమున నామినేషన్ విత్ డ్రా
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా చేసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్ సతీమణి ఈటల జమున, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 42మంది బరిలో ఉండగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. చదవండి: Huzurabad Bypoll: బజాజ్ చేతక్ స్కూటర్లంటే సెంటిమెంట్ ‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..? ఇంకా బరిలో 39మంది అభ్యర్థులు 31మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ఆధారంగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 15మంది అభ్యర్థులు, 1నోటా కలిపి 16మందికి అవకాశం ఉండనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, నెంబర్లతో అక్షరక్రమంలో సింబల్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Huzurabad Bypoll 2021: బరిలో ఉండే వారేవరో తేలేది నేడే..
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉండే వారెవరో తేలేది నేడే. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు. మొత్తం 61 మంది నామినేషన్ వేయగా.. స్క్రూటినీ తర్వాత 42 మంది మిగిలారు. బుధవారం 3 గంటల వరకూ నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇప్పటివరకూ నామినేషన్ వేసిన వారిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు.. ఏడు ఇతర పార్టీల నుంచి 32 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. (చదవండి: ఒక్క వాహనం కూడా లేదు..‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..?) ఒక్కో ఈవీఎంలో 16 మంది వివరాలు మాత్రమే పొందు పరిచే అవకాశం ఉంది. ఆ లెక్కన 42 మందిలో సగం మంది వైదొలగినా 21 మంది ఉన్నా కూడా రెండు ఈవీఎంలు తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తుంది. ఒకవేళ 32 మంది పోటీలో ఉంటే నోటాతో కలిపి మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం సాయంత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. చదవండి: తెలంగాణ: 7 జాతీయ, 4 ప్రాంతీయ పార్టీలు -
లెక్కతేలిన సాగర్ అభ్యర్థులు
సాక్షి, నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నిర్వహణలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారంతో గడువు ముగిసింది. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకోవడంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు. ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) ద్వారా జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్‌లో మూడు ఈవీఎంలను వినియోగించనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రచారానికి మిగిలింది 12 రోజులే ఎన్నికల్లో ప్రధాన అంకమైన పోలింగ్ ఈనెల 17వ తేదీన జరగనుంది. దీంతో 15వ తేదీన ప్రచారం ముగియనుంది. అంటే మరో పన్నెండు రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 14వ తేదీన హాలియాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 5, 6 ,7 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఏర్పాటు చేశారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు, త్రిపురారం మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్ షోల్లో కేటీఆర్ పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు వివరించాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ అభ్యర్థి (జానారెడ్డి) తరఫున ప్రచారం చేసేందుకు మండలాల వారీగా ఇన్చార్జులను నియమించింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నేతలందరూ కలసి జనగర్జన ప్రచార సభను నిర్వహించారు. మరోవైపు బీజేపీ సైతం రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలను ఏర్పాటు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల పర్యటనలు, సభలు జరిగాయి. -
అద్దంకిలో టీడీపీ బరితెగింపు..
అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు. ఆధారాలున్నాయి, సీరియస్‌గా తీసుకుంటాం.. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు. 8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి చంద్రబాబు మాట.. అబద్ధాల మూట కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
మాస్టార్ కోసం నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, విశాఖపట్నం: మనిషి జీవితంలో తల్లితండ్రి తరువాతి స్థానం గురువుదే.. ఆ తర్వాతే దైవం. ఎందుకంటే అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు చదువు చెప్పి విద్యాబుద్దులు నేర్పి.. జీవితంలో మంచి మార్గంలో నడవడానికి.. ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. జీవితంలో మనం మంచి స్థాయిలో ఉన్నామంటే అందుకు తల్లితండ్రులతో పాటు గురువు కూడా కారణమే. అలాంటి మాస్టారుకు ఏమిచ్చినా తక్కువే. వారి రుణం తీర్చుకునే అవకాశం లభించడమే అదృష్టం. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది కొందరు గ్రామస్తులకి. గురువు మీద అభిమానంతో వారు చేసిన పనిని అందరు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు. ఈ క్రమంలో కొయ్యూరు మండలం మంప గ్రామంలో స్కూల్ టీచర్‌గా పని చేసిన ఇంగువ త్రినాథ్ పడాల్ సర్పంచ్‌గా బరిలో నిలిచారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువు పట్ల కృతజ్ఞతగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఉపాధ్యాయుడు ఇంగువ త్రినాధ్ పడాల్ మంప గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. చదవండి: ఓటర్ల దీవెన.. సర్పంచ్‌లుగా ముగ్గురు వలంటీర్లు -
నిజామాబాద్ ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవం
నిజామాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పటికే వరంగల్, మెదక్ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో రెండు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది. మెదక్, నిజామాబాద్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు స్థానాలను గెలుచుకోవడం దాదాపుగా ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీష్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
విదర్భ ప్రాంతంలో 48 నామినేషన్లు తిరస్కరణ
సాక్షి, ముంబై: లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో రాష్ట్రంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్న బుల్డానా, అకోలా, అమరావతి, వార్దా, రామ్‌టెక్, నాగపూర్, భండారా-గోండియా, గడ్చిరొలి-చిమూర్, చంద్రాపూర్, యావత్మాల్-వాషీం లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు సోమవారం పరిశీలించారు. సరైన వివరాలు లేని కారణంగా 48 నామినేషన్లు తిరస్కరించామని ప్రకటించారు. నాగపూర్‌లో దాఖలైన 51 నామినేషన్లలో ఆరు, రాంటెక్ స్థానంలో దాఖలైన 30 నామినేషన్లలో మూడు తిరస్కరించినట్టు తెలిపారు. అకోలాలో తొమ్మిది మంది అభ్యర్థులు 22 నామినేషన్లు దాఖలు చేశారని, వీటిలో బి ఫార్మ్ లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. బుల్డానా లోక్‌సభ నియోజకవర్గంలో కూడా 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 48 నామినేషన్లలో ఐదు, వార్ధాలో ఏకంగా 13 మంది నామినేషన్లను తిరస్కరించారు. అమరావతిలో మూడు, భండారా-గోండియాలో నాలుగు, చంద్రాపూర్‌లో ఆరు, గడ్చిరోలి-చిమూర్‌లో రెండు, యావత్మాల్-వాషీంలో నలుగురి నామినేషన్లు తప్పుగా ఉన్నాయని ఈసీ అధికారులు తెలిపారు. నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు నామినేషన్లను ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే అనేకమంది తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మంగళవారం కూడా మరికొంతమంది ఉపసంహరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉండనున్నారనేది ఖచ్చితంగా తెలియనుంది. -
జెడ్పీటీసీ బరిలోఅభ్యర్థులు 195
ఇందూరు, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది. జాబితాపై సోమవారం అర్ధరాత్రి వరకు అధికారులు కసరత్తు చేశారు. పరిషత్ స్థానాలకు ఎంతమంది బరిలో ఉన్నారు. పార్టీల వారీగా మంగళవారం అధికారులు అధికారికంగా జాబితా వెళ్లడించనున్నారు. జిల్లాలోని 36 జెడ్పీటీసీ స్థానాలకు 497 నామినేషన్లు వచ్చాయి. వీటిలో పరిశీలనలో 10 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ముగ్గురు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా, ఇద్దరికి అవకాశం కల్పించారు. మిగతా ఎనిమిది మంది నామినేషన్లను పరిగణలోకి తీ సుకోలేదు. మూడు, నాలు గు రోజుల వ్యవధిలో 150 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 36 జెడ్పీటీసీ స్థానాలకు 195 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మిగిలిన 142 నామినేషన్లు ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్లను వేసినవేనని, వాటిని లెక్కలోకి తీసుకోలేదని అధికారులు చెప్పారు. సోమవారం సాయంత్రానికల్లా పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను తయారు చేయాల్సిన అధికారులు పనిభారంతో వెల్లడించలేక పోయారు. ఎంపీటీసీలకు సంబంధించి 583 స్థానాలకు 4,752 నామినేషన్లు రాగా, ఇందులో దాదాపు 2,316 మంది బరిలో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నంకల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీ అభ్యర్థుల తుది జాబితాతో పాటు వారికి కేటాయించిన గుర్తుల వివరాలను గ్రామ, మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. -
బరిలో 190 మంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ అంకం సోమవారం ముగియడంతో తుది బరిలో నిలిచిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ప్రత్యర్థులు ఎవరనేది తేలడంతో అభ్యర్థులు సరికొత్త వ్యూహాలతో ప్రచార రంగంలోకి దూకారు. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 334 మంది నామినేషన్లు వేయగా వీరిలో 144 మంది సోమవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఒక్కో స్థానానికి సగటున ఆరుగురు పోటీపడుతున్నారు. పార్టీ అధిష్టాన నేతల బుజ్జగింపులు, బెదిరింపుల కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థులు పలువురు వెనక్కితగ్గారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామన్న భరోసాతో పోటీ నుంచి తప్పుకొన్నారు. జిల్లా మొత్తం మీద ఇబ్రహీంపట్నం, మంచాల జెడ్పీటీసీ స్థానాల నుంచి అత్యధిక సంఖ్యలో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. డివిజన్ల వారీగా చూస్తే తూర్పు డివిజన్లోని 8 స్థానాల్లో 72 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల నుంచి 33 మంది అభ్యర్థులను నిలపగా తెలుగుదేశం పార్టీ 30 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థులతో ఉన్న సర్దుబాటు కారణంగా మూడు స్థానాల్లో పోటీ నుంచి తప్పుకుంది. టీఆర్ఎస్ కూడా ఒక స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. సరూర్‌నగర్ నుంచి ఆ పార్టీ పోటీలో లేదు. జెడ్పీచైర్మన్ పోటీ రసవత్తరం ప్రతిష్టాత్మక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో పార్టీలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరు దాదాపు ఖరారయింది. నవాబ్‌పేట్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున లక్ష్మారెడ్డి చైర్మన్ కుర్చీ రేసులో ఉన్నారు. ఘట్కేసర్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. ఇక చైర్మన్పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి పోటీపడుతున్న మాజీ జెడ్పీచైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డి యాలాల జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. చైర్మన్ అభ్యర్థులు బరిలో ఉన్న ఈ మూడు స్థానాల్లో పోటీ రసవత్తరంగా ఉంది.