సాక్షి, నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నిర్వహణలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారంతో గడువు ముగిసింది. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకోవడంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు. ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) ద్వారా జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్‌లో మూడు ఈవీఎంలను వినియోగించనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రచారానికి మిగిలింది 12 రోజులే
ఎన్నికల్లో ప్రధాన అంకమైన పోలింగ్ ఈనెల 17వ తేదీన జరగనుంది. దీంతో 15వ తేదీన ప్రచారం ముగియనుంది. అంటే మరో పన్నెండు రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 14వ తేదీన హాలియాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 5, 6 ,7 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఏర్పాటు చేశారు. పెద్దవూర, హాలియా, నిడమనూరు, త్రిపురారం మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్ షోల్లో కేటీఆర్ పాల్గొంటారని టీఆర్‌ఎస్ వర్గాలు వివరించాయి.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ అభ్యర్థి (జానారెడ్డి) తరఫున ప్రచారం చేసేందుకు మండలాల వారీగా ఇన్‌చార్జులను నియమించింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నేతలందరూ కలసి జనగర్జన ప్రచార సభను నిర్వహించారు. మరోవైపు బీజేపీ సైతం రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనలను ఏర్పాటు చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపే.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల పర్యటనలు, సభలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment