సచివాలయ తెలంగాణ ఉద్యోగుల కమిటీ డిమాండ్
గచ్చిబౌలి భూముల కేసులో ఆయన నిందితుడని ఆరోపణ
సాక్షి; హైదరాబాద్: గచ్చిబౌలి సమీపంలోని గోపన్నపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కుంభకోణంలో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రధాన నిందితుడని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆరోపించింది. ఆయన్ను వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. సమ్మె పేరుతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వ వనరులు, సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిం చింది. ప్రభుత్వ సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిటీ కన్వీనర్ నరేందర్‌రావు విలేకరులతో మాట్లాడారు.
అశోక్‌బాబుపై కేసు నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. పరారీలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారని, రాజధాని నడిబొడ్డులో బహిరంగసభల్లో ఆయన ప్రసంగించినా కనబడలేదా? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల పనిని తెలంగాణ ఉద్యోగులకప్పగించాలని కోరినా ఉన్నతాధికారులు స్పందించట్లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పనికోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. సచివాలయంలో కొత్తగా వచ్చిన 150 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు తమ సొంత నిధులతో వారంపాటు ఉచిత శిక్షణనిస్తామని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించి బహిరంగ చర్చకు రావాలన్నారు.