పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం సాధ్యమవుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్స్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం - వర్తమాన సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు. సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని.. ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసమే ఆంధ్రా ప్రాంత ప్రజలను పాలకులు రెచ్చగొడుతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలని ఏ సందర్భంలోనూ అనలేదని స్పష్టం చేశారు. 57 ఏళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే.. అది ఏకాఏకి నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నించా రు. రాష్ట్ర అసెంబ్లీ, రాజ్యసభ, లోక్‌సభల్లో నెలల తరబడి తెలంగాణ వెనుకబాటుపై చర్చలు జరిగాయన్నారు.
హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే ఊరుకోం: ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి
సదస్సులో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా పాలకులు హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే ఊరుకునేది లేదని, సమైక్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు, భూములు అన్ని కోల్పోయామని, ఇప్పుడు తెలుగు జాతి కలిసుండాలంటున్న ఆంధ్రా పాలకులకు అభివృద్ధి విషయంలో తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ‘ఇది నిజాం కట్టిన చారిత్రక హైదరాబాద్.. హైదరాబాద్‌లేని తెలంగాణ వద్దు, కాంగ్రెస్ మరోమారు మోసం చేయబోతున్నది.. మనం ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణ అంటూనే అక్కడ సమైక్యాంధ్ర అంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోమారు మోసం చేసేందుకుయత్నిస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ పునర్నిర్మానంలోనూ తాము భాగస్వాములుగా ఉంటామన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం తెలివిలేదని, హైదరాబాద్ శాంతి భద్రతలు ఢిల్లీ చేతిలో పెట్టమనటం సిగ్గుచేటన్నారు.
నిన్నటి వరకు జై తెలంగాణ అన్న బీజేపీ నేడు వెనకడుగు వేస్తున్నదన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్, జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, వికారాబాద్ డిప్యూటీ డీఈఓ హరి శ్చందర్, టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కే.హన్మంతు, టీజీవీవీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి బస్వరాజ్, ఉపాధ్యక్షులు వెంకట్‌రాం, నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, టీజీవీపీ రాష్ట్ర నాయకులు జగన్, రమేష్, జేఏసీ జిల్లా కన్వీనర్ సదానందం, పరిగి సర్పంచ్ విజయమాల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు సాయిచంద్ కళా బృందం పాటలతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కల్కొడ నర్సింహులు, ఆంజనేయులు, లక్ష్మి, విజయలక్ష్మి, మునీర్, చెర్క సత్తయ్య, గోపాల్, మదన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే.. ఎత్తిపోతల సాధ్యం
Published Sat, Aug 24 2013 2:01 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement