టీ బిల్లు ఓడిస్తాం... సమైక్యాంధ్ర సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘‘అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లుపై చర్చకు అదనపు గడువు అడిగాం. బిల్లును ఓడిస్తాం. అలాగే క్లాజుల వారీగా చర్చించి ఓటింగ్ జరుపుతాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి ఓడిస్తాం. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు’’ అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉద్ఘాటించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా సాగింది. ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ... తొలిసారిగా ప్రజాప్రతినిధులను సభకు ఆహ్వానించామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ అహంకారంతో రూపొందించిన విభజన బిల్లును అసెంబ్లీ, పార్లమెంట్‌ల్లో ఓడించి కనువిప్పు కలిగించాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. ఇందుకు జెండాలు, ఎజెండాలు పక్కకు పెట్టి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ...అవిశ్వాసం ప్రతిపాదన తీసుకొచ్చి సత్తా చూపాం. అది కేవలం ట్రైలర్ మాత్రమే, బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరువాత అసలు సినిమా ఉంటుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే సమైక్యవాది. టి.బిల్లుపై ఓటింగ్‌కు ఎవరైనా మొహం చాటేస్తే ‘కెవ్వు కేకే.. అంటూ హెచ్చరించారు. ‘పార్లమెంటులో మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ప్రభుత్వమే ఉండదు. అయినా అసెంబ్లీలో బిల్లును ఓడించడం ద్వారా తెలంగాణను అడ్డుకుంటాం’అని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ..పార్లమెంటుకు బిల్లు వస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అని అన్నారు. మంత్రులు టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్, కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడించి తిరిగి పంపే బృహత్తర బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉందని చెప్పారు.
1972లో ఇందిరాగాంధీ దేశాన్ని ముక్కలు చేయవద్దని అన్ని ప్రాంతాలు కలిసి సాగాలని చెప్పగా, ఇప్పుడు సోనియాగాంధీ విభ జిస్తానంటున్నారని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ధర్నాలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాస్, ఉగ్ర నరసింహారెడ్డి, నాగేశ్వర్‌రావు, దేవినేని ఉమా, దాసరి బాలవర్ధన్ రావు, శివరామరాజు, శ్రీరాం తాతయ్య, గాదె వెంకటరెడ్డి, పయ్యావుల కేశవ్, ఎమ్మె ల్సీ నన్నపనేని రాజకుమారి, బీఏసీ చైర్మన్ కేఈ కృష్ణమూర్తి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతిలు ప్రసంగించగా, వెంకటరామయ్య, రమేష్, ధర్మాన ప్రసాదరావు, చిక్కాల రామచంద్రరావు, లింగారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
లగడపాటిపై దాడి
ధర్నా సందర్భంగా ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌పై తెలంగాణవాదులు దాడి చేశారు. వేదికపై ప్రసంగం ముగించి వెళ్లిపోయేందుకు సన్నద్ధం అవుతుండగా తెలంగాణ యువసేన (టీవైఎస్) కార్యకర్తలు లగడపాటి కాళ్లు పట్టుకొని లాగడంతో వేదిక పైనుంచి కిందికి పడిపోయారు. దాడిచేసిన వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా వారికి ముసు గులు వేసి తీసుకెళ్లారు. టీవైఎస్ కార్యకర్తలు ముగ్గురు, ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తి జై తెలంగాణ నినాదాలు చేశారు. మరోవైపు ఉద్యోగులు ఏర్పాటుచేసిన సభ ఆద్యంతం కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి సభలా సాగిం ది. సభకు అధ్యక్షత వహించిన అశోక్‌బాబు.. కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులనే వేదికపైకి ఆహ్వానించి ప్రసంగించేలా చేశారు.