పరిగి, న్యూస్‌లైన్:
తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణంతోనే సాధ్యమని రాజకీయ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు.
పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు శిక్షణా శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిగి అభివృద్ధి అనే అంశంపై అవగాహన కల్పించారు. గోదావరి నది నుంచి 4వేల టీఎంసీలు ఏటా సముద్రం పాలవుతున్నాయని, అవసరమైన చోట్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టి నీటిని ఆయా ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల కల సాకారమవుతుందన్నారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలు రూపొందించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఆయా పనులు పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చేలా రామ్మోహన్‌రెడ్డి చూస్తారని అన్నారు. పరిగిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కృషి చేయాలని టీఆర్‌ఆర్‌ను కోరారు. అంతకుముందు ‘అభివృద్ధిలో అలుపెరగని బాటసారి డాక్టర్ టీఆర్‌ఆర్’ అనే పాటల సీడీని ఆవిష్కరించారు.
వైఎస్ పథకాలతో పేదలకు మేలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ తదితర పథకాలు అన్ని వర్గాల వారిని ఆదుకున్నాయని అన్నారు. ప్రజలకు అత్యంత అవసరమున్న కార్యక్రమాలు చేపట్టారు కాబట్టే డాక్టర్ వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోయారని అన్నారు.
పరిగి అభివృద్ది రామ్మోహన్‌రెడ్డి చలవే
పరిగి నియోజకవర్గ అభివృద్ధి టి.రామ్మోహన్‌రెడ్డి చలవేనని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌కు నివేదించి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పరిగి వరకు పొడిగించే హామీని పొందారన్నారు.
నియోజకవర్గానికి తాగునీటి సరఫరా కోసం కోయిల్‌సాగర్ టెండర్ ప్రక్రియ పూర్తికావడం, 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం కావటం, 400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సీఎం కిరణ్ హామీ ఇవ్వటం, పాలమూరు ఎత్తిపోతల సర్వే, రూ.5 కోట్లతో పరిగి పట్టణ అభివృద్ధి, డిగ్రీ కళాశాల తదితర అభివృద్ధి పనులు టీఆర్‌ఆర్ కృషి ఫలితమేనని అన్నారు.
పరిగిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: టీఆర్‌ఆర్
సార్వత్రిక ఎన్నికల్లో పరిగిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయటం ఖాయమని పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవిలో లేకున్నా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బొంపల్లి రాములు, కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, రాములు, భీంరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వెంకటయ్య, సుభాష్‌చందర్ రెడ్డి, సిద్దాంతి పార్థసారథి, ఆంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతలతోనే తెలంగాణ సస్యశ్యామలం
Published Thu, Dec 26 2013 12:17 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement