సదస్సులో పాల్గొన్న జస్టిస్ స్వతంత్రకుమార్, పురుషోత్తంరెడ్డి, దిలీప్‌రెడ్డి తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ’ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న భూతాపం వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రపంచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయన్నారు. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు ‘వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ’మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. హరితవిప్లవ మండలి, క్యాపిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఎన్జీటీ మాజీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్, గ్రేస్ చైర్మన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పర్యావరణ వేత్తలు బూరె లాల్, విక్రంసోనీ, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ పుష్ప కుమార్ లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, సేవ్ రివర్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
జీవించే హక్కులో భాగం: జస్టిస్ స్వతంత్ర కుమార్
ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అందులో మంచి వాతావరణాన్ని కలిగి ఉండడం ఒక భాగమే. మన సంప్రదాయంలో ప్రకృతిని పూజించే మనం పూజ తర్వాత చెట్లను నరికేస్తున్నాం. పర్యావరణ రక్షణకు ఎన్నో చట్టాలున్నా.. సమర్థంగా అమలు చేయడంలో లోపాలున్నాయి. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో బాధ్యత నిర్వర్తించాలి.
ప్రజల్లో పూర్తి అవగాహనతో పర్యావరణ పరిరక్షణ: దిలీప్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో వెల్లువెత్తే ఆందోళన ప్రభుత్వాలను దిగివచ్చేలా చేస్తుంది. దీనికి ఉదాహరణే నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వాలు వెనక్కు తగ్గడం. ఏపీలో గత ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై ఇష్టానుసారంగా అనుమతులిచ్చింది. ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టో హామీ మేరకు ఆ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాతావరణ మార్పులతో భావితరాలు నష్టపోతాయన్న అభిప్రాయాలు కల్పించారు. కానీ నేటి తరాలూ నష్టపోతున్నాయని గ్రహించి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి.
దేశంలో విపరీత పరిణామాలు..
వాతావరణ మార్పుల కారణంగా దేశంలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, నీటికోసం చెన్నై ఎన్ని అవస్థలు పడుతోందో చూస్తున్నామని, వర్షాలతో ముంబై ఎలా అతలాకుతలమవుతోంది యావత్తు సమాజం చూసిందని ప్రొ.పురుషోత్తం రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment