Swatanter Kumar
-
అత్యవసర పరిస్థితిని ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ’ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న భూతాపం వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రపంచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయన్నారు. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు ‘వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంస్థ’మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. హరితవిప్లవ మండలి, క్యాపిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఎన్జీటీ మాజీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్, గ్రేస్ చైర్మన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పర్యావరణ వేత్తలు బూరె లాల్, విక్రంసోనీ, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ పుష్ప కుమార్ లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, సేవ్ రివర్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. జీవించే హక్కులో భాగం: జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అందులో మంచి వాతావరణాన్ని కలిగి ఉండడం ఒక భాగమే. మన సంప్రదాయంలో ప్రకృతిని పూజించే మనం పూజ తర్వాత చెట్లను నరికేస్తున్నాం. పర్యావరణ రక్షణకు ఎన్నో చట్టాలున్నా.. సమర్థంగా అమలు చేయడంలో లోపాలున్నాయి. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో బాధ్యత నిర్వర్తించాలి. ప్రజల్లో పూర్తి అవగాహనతో పర్యావరణ పరిరక్షణ: దిలీప్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో వెల్లువెత్తే ఆందోళన ప్రభుత్వాలను దిగివచ్చేలా చేస్తుంది. దీనికి ఉదాహరణే నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వాలు వెనక్కు తగ్గడం. ఏపీలో గత ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై ఇష్టానుసారంగా అనుమతులిచ్చింది. ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టో హామీ మేరకు ఆ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాతావరణ మార్పులతో భావితరాలు నష్టపోతాయన్న అభిప్రాయాలు కల్పించారు. కానీ నేటి తరాలూ నష్టపోతున్నాయని గ్రహించి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. దేశంలో విపరీత పరిణామాలు.. వాతావరణ మార్పుల కారణంగా దేశంలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, నీటికోసం చెన్నై ఎన్ని అవస్థలు పడుతోందో చూస్తున్నామని, వర్షాలతో ముంబై ఎలా అతలాకుతలమవుతోంది యావత్తు సమాజం చూసిందని ప్రొ.పురుషోత్తం రెడ్డి అన్నారు. -
జస్టిస్ స్వతంతర్‌పై సుప్రీంలో పిటిషన్
లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన న్యాయవిద్యార్థిని పిటిషన్‌కు ప్రముఖ న్యాయవాదుల నుంచి మద్దతు 15న విచారించేందుకు ధర్మాసనం సమ్మతి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ స్వతంతర్‌కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని.. ఆయనపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 15వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులపై ఎలాంటి ఫిర్యాదునూ స్వీకరించబోమంటూ సుప్రీంకోర్టు పూర్తి కోర్టు గత నెల ఐదో తేదీన చేసిన తీర్మానాన్ని కూడా న్యాయ విద్యార్థిని తన పిటిషన్లో సవాల్ చేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు సరైన వేదికను ఏర్పాటుచేయాలని, మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో లానే తన ఫిర్యాదునూ పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జస్టిస్ స్వతంతర్కుమార్తో పాటు, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను, భారత ప్రభుత్వాన్ని ఆమె ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ స్వతంతర్‌కుమార్ 2012లో సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జిగా ఉన్నప్పుడు.. ఆయన వద్ద న్యాయ విద్యార్థినిగా ఉన్న తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. కాబట్టి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జారీ చేసిన విశాఖ మార్గదర్శకాల ప్రకారం తన ఫిర్యాదును పరిశీలించాలని కోరారు. జస్టిస్ స్వతంతర్‌కుమార్ వద్ద ఇంటర్న్‌గా పనిచేస్తున్న తనతో ఆయన రెండు పర్యాయాలు అసభ్యంగా ప్రవర్తించారని.. తన శరీరంపై అభ్యంతరకర ప్రదేశాల్లో చేతులు వేశారని, తనచుట్టూ చేతులు వేసి భుజంపై ముద్దు పెట్టారని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. న్యాయవిద్యార్థిని పిటిషన్‌కు అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ప్రముఖ న్యాయవాదులు కామిని జైశ్వాల్, హరీశ్‌సాల్వే, వ్రిందా గ్రోవర్ల నుంచి మద్దతు లభించింది. జస్టిస్ స్వతంతర్‌కుమార్ సిటింగ్ జడ్జిగా ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చినందున.. సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేయించాలని జైశ్వాల్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన న్యాయవిద్యార్థిని మహిళా బాధితురాలైనందున ఆమె పేరు, వివరాలను పిటిషన్లో బహిర్గతం చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమెను ‘మిస్ ఎక్స్’గా ప్రస్తావించారు. ఎన్జీటీ విధులకు హాజరుకాని జస్టిస్ కుమార్ ప్రస్తుతం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్‌గా పనిచేస్తున్న జస్టిస్ స్వతంతర్‌కుమార్.. సోమవారం అనారోగ్య కారణాలు చెప్తూ విధులకు హాజరుకాలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేనందున సెలవులో ఉన్నారని ఎన్జీటీ అధికారులు పేర్కొన్నారు. జస్టిస్ స్వతంతర్కుమార్పై కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రానే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం.. సామూహిక దాడి అవుతుందంటూ ఎన్జీటీ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ‘గంగూలీ వేధించిన మహిళై’పె పిటిషన్ తిరస్కరణ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
ఎస్‌డీఎంసీకి రూ.50 వేల జరిమానా
న్యూఢిల్లీ: చెట్ల చుట్టూ ఉన్న సిమెంటు గచ్చును తొలగించే విషయంలో తమ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ)కి జాతీయ పర్యావరణ న్యాయస్థానం (ఎన్జీటీ) రూ. 50 వేల జరిమానా విధించింది. చిత్తరంజన్ పార్కు ప్రాంతంలో సిమెంటు గచ్చును తొలగించడం వల్ల చెట్ల వేర్లు బయటకు వచ్చి రెండు వృక్షాలు కూలిపోయాయని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సిమెంటు గచ్చును తొలగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోనందున జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. చెట్ల వేర్ల వద్ద నుంచి కాంక్రీట్‌ను తొలగించేందుకు యంత్రాలను వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పదే పదే అధికారులను హెచ్చరించామని, అయినప్పటికీ తమ ఆదేశాలను కార్పొరేషన్ ఉల్లంఘించిందని పేర్కొంది. భారీ యంత్రాలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను స్పష్టంగా ఆదేశించామని, తమ ఆదేశాలను వారు బేఖాతరు చేశారని తెలిపింది. ఎస్డీఎంసీ చట్టం ప్రకారం తన విధిని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని బెంచ్ పేర్కొంది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ కేసును శిక్షార్హమైనదిగా పరిగణిస్తున్నామని, దీనిని మొదటి తప్పిదంగా భావించి రూ. 50 వేల జరిమానా విధిస్తున్నామని తెలిపింది. ఈ మొత్తాన్ని ముందుగా ఎస్డీఎంసీ చెల్లించాలని, ఆ తరువాత అది బాధ్యులైన అధికారుల జీతాల నుంచి మినహాయించుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా కూలిన ఒక్కో చెట్టుకు బదులుగా 1:10 నిష్పత్తిలో 20 చెట్లను నాటాలని ఎస్డీఎంసీని ఎన్జీటీ ఆదేశించింది. ఈ తీర్పును నిలిపివేయాలంటూ ఎస్డీఎంసీ చేసిన మౌఖిక విజ్ఞప్తిని బెంచ్ తిరస్కరించింది. భారీ వర్షాలు, ఉరుముల వల్ల ఆ రెండు చెట్లు కూలిపోయాయన్న ఎస్డీఎంసీ వాదనను కూడా బెంచ్ తోసిపుచ్చింది. సీఆర్ పార్కులో ఆగస్టు 19న రెండు రావిచెట్లు కూలిపోయినట్లు అటవీ శాఖ తన నివేదికలో పేర్కొంది. చెట్ల చుట్టూ ఉన్న గచ్చును తొలగించడం వల్ల వేర్లు దెబ్బతిన్నాయని తెలిపింది.