జస్టిస్ స్వతంతర్‌పై సుప్రీంలో పిటిషన్ | Supreme court agrees to hear sexual harassment case against Justice Swatanter Kumar | Sakshi
Sakshi News home page

జస్టిస్ స్వతంతర్‌పై సుప్రీంలో పిటిషన్

Published Tue, Jan 14 2014 2:02 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

జస్టిస్ స్వతంతర్‌పై సుప్రీంలో పిటిషన్ - Sakshi

జస్టిస్ స్వతంతర్‌పై సుప్రీంలో పిటిషన్

లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన న్యాయవిద్యార్థిని
పిటిషన్‌కు ప్రముఖ న్యాయవాదుల నుంచి మద్దతు
15న విచారించేందుకు ధర్మాసనం సమ్మతి

 
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ స్వతంతర్‌కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని.. ఆయనపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 15వ తేదీన విచారణ చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులపై ఎలాంటి ఫిర్యాదునూ స్వీకరించబోమంటూ సుప్రీంకోర్టు పూర్తి కోర్టు గత నెల ఐదో తేదీన చేసిన తీర్మానాన్ని కూడా న్యాయ విద్యార్థిని తన పిటిషన్‌లో సవాల్ చేశారు.
 
 ఇలాంటి కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు సరైన వేదికను ఏర్పాటుచేయాలని, మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో లానే తన ఫిర్యాదునూ పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జస్టిస్ స్వతంతర్‌కుమార్‌తో పాటు, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను, భారత ప్రభుత్వాన్ని ఆమె ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ స్వతంతర్‌కుమార్ 2012లో సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జిగా ఉన్నప్పుడు.. ఆయన వద్ద న్యాయ విద్యార్థినిగా ఉన్న తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. కాబట్టి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జారీ చేసిన విశాఖ మార్గదర్శకాల ప్రకారం తన ఫిర్యాదును పరిశీలించాలని కోరారు.
 
  జస్టిస్ స్వతంతర్‌కుమార్ వద్ద ఇంటర్న్‌గా పనిచేస్తున్న తనతో ఆయన రెండు పర్యాయాలు అసభ్యంగా ప్రవర్తించారని.. తన శరీరంపై అభ్యంతరకర ప్రదేశాల్లో చేతులు వేశారని, తనచుట్టూ చేతులు వేసి భుజంపై ముద్దు పెట్టారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. న్యాయవిద్యార్థిని పిటిషన్‌కు అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, ప్రముఖ న్యాయవాదులు కామిని జైశ్వాల్, హరీశ్‌సాల్వే, వ్రిందా గ్రోవర్‌ల నుంచి మద్దతు లభించింది. జస్టిస్ స్వతంతర్‌కుమార్ సిటింగ్ జడ్జిగా ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చినందున.. సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేయించాలని జైశ్వాల్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన న్యాయవిద్యార్థిని మహిళా బాధితురాలైనందున ఆమె పేరు, వివరాలను పిటిషన్‌లో బహిర్గతం చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమెను ‘మిస్ ఎక్స్’గా ప్రస్తావించారు.
 
 ఎన్‌జీటీ విధులకు హాజరుకాని జస్టిస్ కుమార్
 ప్రస్తుతం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్మన్‌గా పనిచేస్తున్న జస్టిస్ స్వతంతర్‌కుమార్.. సోమవారం అనారోగ్య కారణాలు చెప్తూ విధులకు హాజరుకాలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేనందున సెలవులో ఉన్నారని ఎన్‌జీటీ అధికారులు పేర్కొన్నారు. జస్టిస్ స్వతంతర్‌కుమార్‌పై కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రానే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం.. సామూహిక దాడి అవుతుందంటూ ఎన్‌జీటీ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.
 
 ‘గంగూలీ వేధించిన మహిళై’పె పిటిషన్ తిరస్కరణ
 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది ఎం.ఎల్.శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement