ఎస్‌డీఎంసీకి రూ.50 వేల జరిమానా
Published Fri, Sep 20 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
న్యూఢిల్లీ: చెట్ల చుట్టూ ఉన్న సిమెంటు గచ్చును తొలగించే విషయంలో తమ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ)కి జాతీయ పర్యావరణ న్యాయస్థానం (ఎన్‌జీటీ) రూ. 50 వేల జరిమానా విధించింది. చిత్తరంజన్ పార్కు ప్రాంతంలో సిమెంటు గచ్చును తొలగించడం వల్ల చెట్ల వేర్లు బయటకు వచ్చి రెండు వృక్షాలు కూలిపోయాయని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సిమెంటు గచ్చును తొలగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోనందున జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. చెట్ల వేర్ల వద్ద నుంచి కాంక్రీట్‌ను తొలగించేందుకు యంత్రాలను వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పదే పదే అధికారులను హెచ్చరించామని, అయినప్పటికీ తమ ఆదేశాలను కార్పొరేషన్ ఉల్లంఘించిందని పేర్కొంది.
భారీ యంత్రాలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను స్పష్టంగా ఆదేశించామని, తమ ఆదేశాలను వారు బేఖాతరు చేశారని తెలిపింది. ఎస్‌డీఎంసీ చట్టం ప్రకారం తన విధిని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని బెంచ్ పేర్కొంది. ఎన్‌జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ కేసును శిక్షార్హమైనదిగా పరిగణిస్తున్నామని, దీనిని మొదటి తప్పిదంగా భావించి రూ. 50 వేల జరిమానా విధిస్తున్నామని తెలిపింది. ఈ మొత్తాన్ని ముందుగా ఎస్‌డీఎంసీ చెల్లించాలని, ఆ తరువాత అది బాధ్యులైన అధికారుల జీతాల నుంచి మినహాయించుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా కూలిన ఒక్కో చెట్టుకు బదులుగా 1:10 నిష్పత్తిలో 20 చెట్లను నాటాలని ఎస్‌డీఎంసీని ఎన్‌జీటీ ఆదేశించింది.
ఈ తీర్పును నిలిపివేయాలంటూ ఎస్‌డీఎంసీ చేసిన మౌఖిక విజ్ఞప్తిని బెంచ్ తిరస్కరించింది. భారీ వర్షాలు, ఉరుముల వల్ల ఆ రెండు చెట్లు కూలిపోయాయన్న ఎస్‌డీఎంసీ వాదనను కూడా బెంచ్ తోసిపుచ్చింది. సీఆర్ పార్కులో ఆగస్టు 19న రెండు రావిచెట్లు కూలిపోయినట్లు అటవీ శాఖ తన నివేదికలో పేర్కొంది. చెట్ల చుట్టూ ఉన్న గచ్చును తొలగించడం వల్ల వేర్లు దెబ్బతిన్నాయని తెలిపింది.
Advertisement