సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో నిందితునిగా ఉన్న గడ్డం నిశాంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు ఏసీబీ అధికారుల ముందు ప్రతీ సోమ, బుధ వారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురుషోత్తంరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతని సమీప బంధువైన నిశాంత్‌రెడ్డి (పురుషోత్తంరెడ్డి అల్లుడు నిపుణ్‌రెడ్డి సోదరుడు)ని నిందితునిగా చేర్చారు. పురుషోత్తంరెడ్డితో ఓ ఆస్తి అభివృద్ధికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారని, పురుషోత్తంరెడ్డి డబ్బును దాచేందుకే ఇలా చేశారంటూ గత నెల 9న నిశాంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
పురుషోత్తంరెడ్డి ఆస్తులకు సంబంధించి నిశాంత్‌రెడ్డిని పలు రకాలుగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నిశాంత్‌రెడ్డి హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనను ఏసీబీ అధికారులు ప్రశ్నించడం పూర్తయిన దరమిలా బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment