ముచ్చెమటలు | Telling on the master plan | Sakshi
Sakshi News home page

ముచ్చెమటలు

Published Fri, Jan 22 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

Telling on the master plan

⇒మాస్టర్‌ప్లాన్‌పై ముక్తకంఠం
⇒ప్రతి అంశానికీ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
⇒గ్రామాల్లో ముగిసిన అవగాహన సదస్సులు
⇒ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై తీవ్ర వ్యతిరేకత
⇒జరీబు భూములు, కోర్ కేపిటల్ గ్రామాలపై స్పష్టత కరువు

 
రైతుల సందేహాలతో అధికారులు సతమతం మాస్టర్‌ప్లాన్‌పై రాజధాని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా చోట్ల నిర్వహించిన అవగాహన సదస్సులు అధిక భాగం రచ్చ రచ్చగా మారాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడంతో రైతుల సందేహాలునివృత్తి చేయలేక అధికారులు సైతం తలలు పట్టుకున్నారు. రాజధాని భూ సమీకరణకు తొలిగా ముందుకు వచ్చిన  తుళ్లూరు గ్రామంలో సైతం రైతులు సదస్సును బహిష్కరించడం మాస్టర్‌ప్లాన్‌పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది.
 
గుంటూరు : సింగపూర్ సంస్థలు రూపొందించిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులు గురువారంతో ముగిశాయి. వివాదాల కారణంగా నిలిచిపోయిన సదస్సులను శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మాస్టర్‌ప్లాన్ విడుదల చేసిన రోజు నుంచి నెల రోజుల వరకు గడువు ఉండడంతో ఈ నెల 26 వరకు సీఆర్‌డీఏ కార్యాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు.

గత నెల 25న ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేసింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 6న గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో జిల్లా కలెక్టర్, సీఆర్‌డీఏ కమిషనర్, ఇతర అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే సదస్సులు గ్రామాల్లో నిర్వహించాలని రైతులు డిమాండ్ చేయడంతో షెడ్యూల్ ప్రకటించి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. భూ సమీకరణకుమద్దతు పలికిన తుళ్లూరు గ్రామ రైతులు కూడా గురువారం సదస్సును బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ప్రతి సదస్సులో రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు, గ్రామ కంఠాల పరిధిలోని ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాజధాని గ్రామాల మధ్య నుంచి ఆరు వరుసల రహదారులు, కోర్ కేపిటల్ నిర్మాణం జరగనున్న మూడు గ్రామాల గురించి, జరీబు రైతుల నష్టపరిహారం, గ్రామ కంఠాలు తదితర అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో వారంతా అభ్యంతర పత్రాలను ఇచ్చారు.  యర్రబాలెం, నవులూరు, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల మధ్యలో ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దానివల్ల గ్రామాలు రెండుగా విడిపోవడమే కాకుండా నివాసాలు కూడా కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల నిర్మాణానికి రెట్టింపు సొమ్ము ఇస్తామని అధికారులు ముందుకు వచ్చినా, సొంతూరిపై మమకారాన్ని వదులుకునే ఉద్దేశం లేక రైతులు ఆరులైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అభ్యంతర పత్రాలు ఇచ్చారు.

 సాలీనా మూడు పంటలు పండుతున్న భూములు కలిగిన జరీబు రైతులు తమకు ఇచ్చే నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇప్పుడు ఈ సదస్సులకు హాజరుకావడం లేదని, భవిష్యత్‌లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని, అందుకనే మాస్టర్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించనున్న నష్టపరిహారం, ఇవ్వనున్న నివేశన స్థలాలు, భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతులు వంటి ముఖ్య అంశాలకు చట్టబద్ధత కల్పించి ప్రతి రైతుకు అందించాలని కోరారు.
 
రాజధానిలో 29 గ్రామాలకు అనుబంధంగా ఉన్న గ్రామ కంఠాల విషయంలో మంత్రులు, అధికారులు ఎంతో హైడ్రామా నడిపారని, గ్రామ కంఠాలు ప్రకటించలేదని, దీని వల్ల స్థలాలను అమ్ముకునే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  కోర్ కేపిటల్ నిర్మాణం జరగనున్న ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల పరిధిలో అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ మూడు గ్రామాల్లో పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. దీనిని అమలులోకి తీసుకువస్తే, ఆ గ్రామాలు పూర్తిగా గల్లంతవుతాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలంతా ఐక్యంగా మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
నగరాలకు సమీపంలోని వ్యవసాయ భూములను గ్రీన్‌బెల్ట్ పరిధిలోకి తీసుకురావడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ముఖ్యంగా జిల్లాలోని పోరంకి, ఈడుపుగల్లు, గన్నవరం మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, కొల్లిపర మండలాలు తదితర ప్రాంతాలను గ్రీన్‌బెల్ట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అపార్టుమెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రీన్‌బెల్టును అమలు లోకి తీసుకువస్తే ఈ గ్రామాల్లో ఇక నిర్మాణాలు పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుంది. ఈ గ్రామాలను గ్రీన్‌బెల్టు పరిధిలోకి తీసుకురావడంతో ఇప్పటికే అక్కడి భూముల ధరలు అనూహ్యంగా పడిపోయాయి. మున్ముందు ఇంకా పడిపోయే అవకాశం ఉండడంతో ఆ గ్రామాల రైతులు మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
అవగాహన సదస్సులు బహిష్కరణ ...

తుళ్ళూరులో గురువారం జరిగిన అవగాహన సదస్సులో రైతులు రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా వివాదానికి దిగి కార్యక్రమాన్ని బహిష్కరించారు.  మరి కొన్ని గ్రామాల్లో పోలీస్ బందోబస్త్ నడుమ అవగాహన సదస్సులు నిర్వహించినా, అభ్యంతర పత్రాలే ఎక్కువ ఇచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement