కేసులు.. వేధింపులు.. అవమానాలు | Telugu Desam Party harassment to Bhuma Nagi Reddy | Sakshi
Sakshi News home page

కేసులు.. వేధింపులు.. అవమానాలు

Published Wed, Mar 15 2017 8:21 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

కేసులు.. వేధింపులు.. అవమానాలు

కేసులు.. వేధింపులు.. అవమానాలు

భూమా నాగిరెడ్డిని మొదట్నుంచీ వేధించింది తెలుగుదేశం పార్టీయే..
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రౌడీషీట్‌
పార్టీ మారేలా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు
పార్టీ మారాక మంత్రి పదవి ఇవ్వకుండా అవమానాలు  
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని గెలిపించాలని సీఎం హుకుం
మానసిక క్షోభకు గురై తుదిశ్వాస విడిచిన భూమా నాగిరెడ్డి


సాక్షి ప్రతినిధి, కర్నూలు
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మొదటి నుంచీ వేధించింది ఎవరు? ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఏకంగా రౌడీషీట్‌ తెరిచింది ఎవరు? ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? కేసులు పెట్టి, వేధింపులకు గురిచేసి పార్టీ మారేలా ఒత్తిడి తెచ్చింది ఎవరు? తీరా పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానాలకు గురిచేసింది ఎవరు? పైగా ఎమ్మెల్నీ ఎన్నికల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్థి శిల్పా గెలుపు కోసం పని చేయాలంటూ ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ విజయవాడకు పిలిపించి మరీ ఒత్తిడి పెంచింది ఎవరు? అనే అంతులేని ప్రశ్నలకు అటు ఆళ్లగడ్డతోపాటు ఇటు నంద్యాలలోని ఆయన అనుచరుల నుంచి వస్తున్న ఒకేఒక్క సమాధానం... చంద్రబాబు నాయుడు.

భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సర్‌
2014 ఎన్నికల్లో వెఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనపై కేసులు నమోదు చేయించింది. మున్సిపాలిటీలో జరిగిన గొడవలను కారణంగా చూపి 2014 అక్టోబరు 31న ఆయనపై ఒకేసారి ఏకంగా మూడు కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2015లో డీఎస్పీతో వాగ్వావాదానికి దిగారనే నెపంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లోనూ ఇరికిస్తామని ప్రభుత్వం ఆయనను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘‘భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సర్‌’’ అంటూ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.

కూరలో కరివేపాకు
తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబాన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకుని, అవసరం తీరాక పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. భూమా కుటుంబానికి ఎన్నడూ మంత్రి పదవి ఇచ్చి గౌరవించలేదు. భూమా కుటుంబాన్ని టీడీపీ నాయకత్వం కూరలో కరివేపాకులా వాడుకుంటూ వదిలేసిందనే అభిప్రాయం ఇప్పటికీ ఆయన అనుచరుల్లో ఉంది.

చిన్నకర్మ కాకుండానే అసెంబ్లీకి అఖిలప్రియ
భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియను అసెంబ్లీకి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో కనీసం చిన్నకర్మ కూడా కాకుండానే ఆమె అసెంబ్లీకి వచ్చారు. అయితే, తాము ఆమెను అసెంబ్లీకి రావాలని పిలవలేదని స్వయంగా సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని టీడీపీ కార్యకర్తలే ఖండిస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులు
కేసు 1
224/2014, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్, నంద్యాల
తేదీ: 31–10–2014
ఫిర్యాది: దేశం సులోచన, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
నిందితులు: భూమా నాగిరెడ్డి, కౌన్సిలర్లు
సెక్షన్లు: 147, 148, 324,
నేపథ్యం: మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఎమ్మెల్యే భూమా రోడ్ల విస్తరణ గురించి మాట్లాడటం ప్రారంభించగా, సమావేశం ముగిసిందని చైర్‌పర్సన్‌ బెల్‌ కొట్టారు. తాను
ఇంకా మాట్లాడాలని భూమా పట్టుబట్టారు. ఆయ నపై చైర్‌పర్సన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు 2
225/2014 నంద్యాల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌
తేదీ: 31–10–2014
ఫిర్యాది: వైస్‌చైర్మన్‌ గంగిశెట్టి విజయ్‌కుమార్, టీడీపీ ఇన్‌చార్జి శిల్పా మోహన్‌రెడ్డి అనుచరుడు
నిందితులు: భూమా నాగిరెడ్డి, మరికొందరు కౌన్సిలర్లు
సెక్షన్లు: 147, 148, 324, 506, 307, 120బీ, 109 రెడ్‌విత్‌34 ఐపీసీ.
నేపథ్యం: వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టివిజయ్‌కుమార్‌పై జరిగిన హత్యాయత్నం  

కేసు 3
226/2014, నంద్యాల టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌
తేదీ: 31–10–2014
ఫిర్యాది: అనిల్‌ అమృతరాజ్, టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్‌
నిందితులు: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, కౌన్సిలర్లు
సెక్షన్లు: 147, 148, 324, 506, రెడ్‌విత్‌ 149 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
నేపథ్యం: మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే భూమా తనను కులం పేరిట దూషించారని ఎస్సీ వర్గానికి చెందిన కౌన్సిలర్‌ ఫిర్యాదు చేశారు.

కేసు 4
132/2015 నంద్యాల త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌
తేదీ: 03–07–2015
ఫిర్యాది: దేవదానం, డీఎస్పీ
నిందితులు: భూమా నాగిరెడ్డి
సెక్షన్లు: 353, 188, 506, ఎస్సీ, ఎస్టీ
అట్రాసిటీ కేసు
నేపథ్యం: ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా డీఎస్పీ దేవదానం విధి నిర్వహణకు అడ్డుతగిలి, కులం పేరిట దూషించినట్లు నమోదైన కేసు  

ఆ రోజు ఏం జరిగింది?
అనారోగ్య కారణాలతో గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో భూమా చికిత్స పొందుతున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పాకు భూమా సహకరిస్తాడో లేదో అనే అనుమానంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో వచ్చి, తనను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటికప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, విమానంలో విజయవాడకు వెళ్లి సీఎంను కలిసినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి సహకరిస్తామని భూమాతోపాటు వచ్చిన నేతలు తెలిపారు. తమ నేత భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని నంద్యాల కౌన్సిలర్లు ఈ సమావేశంలో సీఎంను కోరినట్లు సమాచారం. అయితే, ‘ఏయ్‌... నాకు తెలుసు మీరు ఉండండి’ అంటూ చంద్రబాబు గద్దించారనే వాదన వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏ ఎమ్మెల్యేనూ పిలవకుండా, కేవలం తనను మాత్రమే పిలవడంపై కూడా భూమా మానసిక క్షోభకు గురై, గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement