‘కొండ’ంత ఆశకు ‘కృష్ణ’పక్షం..!
Published Mon, Mar 10 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
ఎన్నికలు సమీపించే కొద్దీ తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం కుమ్ములాటలు
తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీలో నాయకుల నడుమ టిక్కెట్ల సిగపట్లు కార్యకర్తలను, ద్వితీయశ్రేణి నాయకులను గందరగోళానికి గురి
చేస్తున్నాయి. శత్రువుతో యుద్ధానికి శక్తియుక్తులన్నీ వినియోగించాల్సిన వేళ.. తలెత్తుతున్న ‘అంతర్యుద్ధాలు’ పార్టీని మరింత బలహీనపరుస్తాయని వారు దిగాలు పడుతున్నారు.
సాక్షి, కాకినాడ :‘కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు పార్టీ అధినేత ఝలక్ ఇవ్వనున్నారా?’ అంటే ‘అవుననే’ ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లుగా టిక్కెట్ తనకే ఖాయమైందంటూ ప్రచారం చేసుకున్న కొండబాబుకు ఈసారి ఆ చాన్స్ దక్కే ఆశలు అడుగంటినట్టేనని చెపుతున్నాయి. వరుసగా రెండుసార్లు ఓటమి చెందడంతో పాటు ప్రజల్లోనూ, పార్టీలోనూ వనమాడి పట్ల ఉన్న వ్యతిరేకతను సాకుగా చూపి ఆ పార్టీ అధినాయకత్వం ఆయన్ని ఈసారి పక్కన పట్టేందుకు సిద్ధపడినట్టు తెలియవచ్చింది. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో.. ఇప్పటి వరకూ కొండబాబు పెంచుకున్న ఆశలు ‘కృష్ణపక్ష చంద్రుని’లా నానాటికీ క్షీణిస్తున్నట్టేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.
ముత్తాకు టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆయన వర్గీయులు ఇప్పటికే చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. ఇన్నాళ్లూ తన కుమారుడు శశిధర్‌కు టికెట్ కోసం పట్టుబట్టిన గోపాలకృష్ణ తానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల మీడియా ముందుకొచ్చిన ముత్తా తాను లేదా తన కుమారుల్లో ఎవరో ఒకరు ఈసారి ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన అభ్యర్థించినట్టు శశిధర్‌కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినచంద్రబాబు.. ఆయన అభ్యర్థిత్వంపై మాత్రం సుముఖత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ముత్తాకున్న అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకోవాలన్న తలంపుతోనే చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇన్నాళ్లూ ధీమాతో ఉన్న వనమాడికి ఈసారి టిక్కెట్ హుళక్కేనన్న ప్రచారం జోరందుకుంది.
తిరుగుబాటు తప్పదంటున్న ‘వనమాడి’ వర్గం
టిక్కెట్ ఖాయమన్న ధీమాతో ముత్తా ప్రచారానికి సైతం ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. శుక్రవారం చంద్రబాబును కలిసిన ముత్తా అధినేత ఇచ్చిన హామీతోనే ఈ నెల 12వ తేదీన ఉదయం 10.50 గంటలకు తన ఇంటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంటున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ తాజా పరిణామం కొండబాబుకు శరాఘాతంగా మారింది. అధినేత వైఖరిపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా పార్టీ జెండా మోసిన కొండబాబును కాదని అసలు పార్టీలో ఉన్నారో, లేరో కూడా తెలియని ముత్తాకు ఏ విధంగా టిక్కెట్ ఇస్తారంటూ రుసరుస లాడుతున్నారు. పదేళ్ల క్రితమే పార్టీని వీడిన ముత్తా గత ఐదేళ్లుగా రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారని, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కనీస ప్రభావం కూడా చూపని ఆయనకు ఏ విధంగా టిక్కెట్ కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. ముత్తాకు టికెట్ ఖాయమైతే తామంతా తిరుగుబాటు జెండా ఎగురవేస్తామని హెచ్చరిస్తున్నారు. మరొక పక్క వరుసగా మూడుసార్లు అవకాశమిచ్చినప్పటికీ పార్టీని పటిష్టపర్చాల్సిన వనమాడి పార్టీని భ్రష్టు పట్టించారని ముత్తా అనుచరులంటున్నారు.
అడుగడుగునా భూ కబ్జాలను ప్రోత్సహించడంతో పాటు తోడు కొండబాబు తీరుతో విసుగు చెందడం వలనే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలు, క్యాడర్‌లో అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్ సిటీ కోఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంట నిలిచారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న పార్టీ అధిష్టానం కొండబాబు అభ్యర్థిత్వంపై పునరాలోచన లో పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ తనకు అనుకూలంగా మలచుకొన్న ముత్తా సీటు కోసం అధినేత వద్ద చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు చెబుతున్నారు. కొండబాబు తన ఒంటెత్తు పోకడలతో చివరకు తన సీటుకే ఎసరు పెట్టుకున్నారని ఆ పార్టీ క్యాడరే వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. కాకినాడ సిటీ సీటు కోసం జరుగుతున్న అంతర్యుద్ధం.. అసలే దుర్బలంగా ఉన్న పార్టీని మరింత కుదేలు చేస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Advertisement