మంత్రుల మధ్య మాడుగుల చిచ్చు
జిల్లా అధికారులకు శిరోభారం
మాడుగులలో కార్యక్రమాలు ఆపకుంటే కలెక్టర్‌పై సభాహక్కుల నోటీసు ఇస్తానన్న ఎంపీ
ఉన్నతాధికారులతో చర్చిస్తున్న యువరాజ్
పట్టువీడని గంటా..గవిరెడ్డి
విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీలో ఆదిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ అధికారులకు తలనొప్పిగా తయారైంది. తాజాగా మాడుగలలో అయ్యన్నవర్గం తలపెట్టిన ప్రారంభోత్సవాలు...శంఖుస్థాపన లను అడ్డుకోవాలని మంత్రి గంటా వర్గం వేస్తున్న ఎత్తుగడలు అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లా యంత్రాంగంపై, మరో వైపు పార్టీలోనూ పట్టు సాధించేందుకు రాష్ర్ట మంత్రులు సీహెచ్.అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరువర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వీరి ఆదిపత్యపోరు పార్టీఅధినేతకే కాదు..అధికారులకు తలనొప్పిగా మారింది. నెలరోజుల క్రితం తనకు చెప్పకుండా నియోజకవర్గంలో మంత్రి గంటా పర్యటించడాన్ని మాడుగల పార్టీ ఇన్‌చార్జి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. గంటా వర్గీయుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తన అనుచరులతో మాడుగల నియోజకవర్గంలో గవిరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయించడంతో టీడీపీలో అంతర్గత పోరు రోడ్డెక్కింది.
ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యాలయాన్ని వేదికగా చేసుకుని తులసీరావుపై గవిరెడ్డి బహిరంగంగా అవినీతి ఆరోపణలు గుప్పించారు. విశాఖ డెయిరీని అడ్డం పెట్టుకుని రూ.500కోట్లకు పైగా తులసీరావు దోచుకున్నారని..తక్షణమే సీబీఐతో విచారణ చేయించి సచ్చీలత నిరూపించుకోవాలంటూ గవిరెడ్డి ఏకంగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. తర్వాత ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి గంటాతో కలిసి మరోసారి గవిరెడ్డికి సమాచారం ఇవ్వకుండా మాడుగులలో పర్యటించడమే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. ఈ విషయంలో గంటా విజ్ఞతకే వదిలేస్తున్నట్టుగా ప్రకటించిన గవిరెడ్డి తన పట్టు నిరూపించుకునేందుకు ఈనెల 27వ తేదీన నియోజకవర్గంలో మంత్రి అయ్యన్నతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. నాలుగు మండలాల్లో ఒకే రోజు రూ.8.31కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు బ్రేకు వేయడం ద్వారా పట్టు నిరూపించుకోవాలని గంటా వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కలకలం రేపిన ఎంపీ లేఖ
పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తలపెడతారంటూ ఏకంగా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు ఎంపీ ముత్తంశెట్టి నోటీసు ఇచ్చారు. కార్యక్రమాలను అడ్డుకోకపోతే పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలిసింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ర్టమంత్రులతో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టకూడదన్న వాదనపై అయ్యన్న వర్గం విబేధిస్తుంది. అలా అయితే ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 27న తలపెట్టిన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ఆగబోవని అయ్యన్న వర్గీయులు తేల్చి చెబుతున్నారు.దీంతో ఏర్పాట్లు చేయాలో వద్దో తెలియక అధికారులు తల పట్టుకుంటు న్నారు.