సమైక్యానికి ‘తెలుగు ప్రజావేదిక’ పిలుపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రజాప్రతినిధులపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని, సమైక్యం కోసం పనిచేస్తున్న జేఏసీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తామని ‘తెలుగు ప్రజావేదిక’ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆదివారం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంగాధర్, పుచ్చలపల్లి మిత్రాల ఆధ్వర్యంలో ‘తెలుగు ప్రజావేదిక’ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, పయ్యావుల కేశవ్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తది తరులు మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయడానికి పోరాడతామన్నారు. కార్యక్రమంలో పా ల్గొన్న వివిధ ప్రజాసంఘాలు, రైతు, వైద్య, గెజిటెడ్, న్యాయ జేఏసీల ప్రతినిధులు మాట్లాడుతూ సమైక్యం కోసం అందరమూ కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
రాష్టస్థాయిలో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుదామని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఎంపీలను అభినందిస్తూ తీర్మానం చేశారు. అలాగే సమైక్యం కోసం కలసిరాని ప్రజాప్రతినిధులకు సాంఘిక బహిష్కారం విధించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దానికోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవాలని, వారి నుంచి లేఖలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను స్తంభిం పచేయాలని తీర్మానించారు. త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ భేటీలో న్యాయవాద జేఏసీ అధ్యక్షుడు, మాజీ అడ్వొకేట్ జనరల్ సీవీ మోహన్‌రెడ్డి, సమైక్య జేఏసీ చైర్మన్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, పాఠశాల జేఏసీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.