లిబియాలో హైదరాబాదీ ప్రొఫెసర్ హత్య
సాక్షి, హైదరాబాద్: లిబియాలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హైదబాద్‌వాసి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు హతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ముషీరాబాద్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ నజీముద్దీన్ (53) లిబియాలోని అజుదబియాలో ఉన్న బెంఘాజి యూనివర్సిటీలో ఐదేళ్ల నుంచి ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్యా పిల్లలు ఇక్కడే ఉంటుండగా, యూనివర్సిటీ క్యాంపస్‌లోని క్వార్టర్స్‌లో నజీముద్దీన్ ఒంటిరిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తన నివాసంలో నజీముద్దీన్ హత్యకు గురైన విషయాన్ని అక్కడి యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. దోపిడీ దొంగలే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు.
మైనార్టీ కమిషన్‌ను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు...
లిబియాలో హత్యకు గురైన నజీముద్దీన్ మృతదేహాన్ని వెంటనే స్వదే శానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్‌ఖాన్‌కు శనివారం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలు చేపడతామని ఆయన వారికి హా మీ ఇచ్చారు. నజీముద్దీన్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు.