
అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు
- ఏడాదిన్నర కిందట ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థి
- మరో నెలలో పూర్తికానున్న చదువు
జగ్గయ్యపేట: కుమారుడు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి ప్రయోజకుడవుతాడనుకున్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మరో నెలలో చదువు పూర్తిచేసుకొని స్వదేశం వస్తాడని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు.. విహారయాత్రకు వెళ్లి నదిలో గల్లంతైన కుమారుడు తీరని శోకం మిగిల్చాడు. దీంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టా పూర్ణచంద్రరావు, రమాదేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి కుమారుడు నరేశ్(27), కుమార్తె ఉన్నారు.
కూతురికి ఏడాదిన్నర కిందట వివాహమైంది. కుమారుడు నరేశ్ 2015 జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ(ఎన్‌పీయూ)లో ఎమ్మెస్ చేసేందుకు వెళ్లాడు. అక్క డ ఉన్నత అభ్యసిస్తూనే పార్ట్‌టైంగా ఓ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం తన స్నేహితులు 13 మందితో కలసి సమీపంలోని లివర్‌మోర్ నదికి విహారయాత్రకు వెళ్లాడు. నరేశ్‌తో పాటు కొందరు స్నేహితులు పడవ ఎక్కగా మరి కొందరు ఒడ్డునే ఉన్నారు. పడవ ఎక్కే సమయంలో తన మొబైల్ నీటిలో తడుస్తుందనే సందేహంతో ఒడ్డున ఉన్న స్నేహితులకిచ్చాడు.
అనంతరం నదిలో కాసేపు ఉల్లాసంగా విహరించి తిరిగి వస్తూ ఒడ్డు మరో 100 మీటర్ల దూరం ఉందనగా నరేశ్ శరీరంపై ధరించిన సేఫ్టీ కోట్‌ను తీసేశాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఎదురుగా పెద్ద అల వచ్చింది. దీంతో పడవ చివర కూర్చున్న నరేశ్ అదుపుతప్పి నదిలో పడిపోయాడు. వెంటనే స్నేహితులు కేకలు వేయటంతో పడవలోని మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే, అప్పటికే గల్లంతయ్యాడు. దాదాపు 9 గంటలు గాలించిన అనంతరం చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఒడ్డున ఉన్న స్నేహితుల వద్ద ఫోన్ ఉండటంతో ఎప్పటిలాగానే సోమవారం ఉదయం తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్నేహితులు జరిగిన సంఘటన వివరించారు.
అప్పులు చేసి చదివిస్తున్నాం
ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులు చదువుతానంటే అప్పు చేసి చదివిస్తున్నాను. మరో నెలలో చదువు పూర్తయి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తుంటే.. నదిలో గల్లంతయ్యాడనే వార్త వినాల్సివస్తుందని అనుకోలేదు. అమెరికా ప్రభుత్వం మా కుమారుడి గాలింపు చర్యలు చేపట్టాలని ప్రార్థిస్తున్నాను.
-పూర్ణచంద్రరావు, తండ్రి