రాయదుర్గం: అనంతపురం జిల్లాలో జరుగుతున్న సాగునీటి సంఘం ఎన్నికల్లో పలుచోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాయదుర్గం నీటి సంఘం ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి తగినంత మద్దతు ఉన్నా.. ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి అధికారులు యత్నిస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తమకు మద్దతు ఉన్నా ఎన్నికను ఏ విధంగా ఏకపక్షం చేస్తారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాయదుర్గం ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికారులను టీడీపీ పెద్దలు ఒత్తిడికి గురిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇది నిజంగా అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.
ఇదిలాఉండగా శింగనమల సాగునీటి సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. అయితే ఏకాభ్రిపాయం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. గుత్తి నీటి సంఘం ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆ ఎన్నికను వైఎస్సార్ సీపీ బహిష్కరించింది. ఇలా జిల్లాలో పలుచోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.