Irrigation union elections
-
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డీనేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు.కాన్ఫరెన్స్‌లో నేతలు ఏం చెప్పారంటే..సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగంకు పాల్పడుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. కానీ దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారుపోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ప్రశ్నించిన పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ పోరుబాట సక్సెస్.. వైఎస్ జగన్ కీలక ట్వీట్వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతోంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేయొద్దని, కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసగా ఈ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైయస్ జగన్‌కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
రాయదుర్గం నీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత
రాయదుర్గం: అనంతపురం జిల్లాలో జరుగుతున్న సాగునీటి సంఘం ఎన్నికల్లో పలుచోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాయదుర్గం నీటి సంఘం ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి తగినంత మద్దతు ఉన్నా.. ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి అధికారులు యత్నిస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమకు మద్దతు ఉన్నా ఎన్నికను ఏ విధంగా ఏకపక్షం చేస్తారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాయదుర్గం ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అధికారులను టీడీపీ పెద్దలు ఒత్తిడికి గురిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇది నిజంగా అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఇదిలాఉండగా శింగనమల సాగునీటి సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. అయితే ఏకాభ్రిపాయం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. గుత్తి నీటి సంఘం ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆ ఎన్నికను వైఎస్సార్ సీపీ బహిష్కరించింది. ఇలా జిల్లాలో పలుచోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
ఎన్నికలు సజావుగా ‘సాగే’నా?
బొబ్బిలి : సాగునీటి సంఘ ఎన్నికలు... చాలా కాలం తరువాత జరుగుతున్న ఎన్నికల్లో తమ వారికి పదవులు కట్టబెట్టడానికి చేతులెత్తే విధానం ప్రవేశపెట్టారు. అదే ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇరిగేషన్ అధికారులకు భారంగా మారబోతుంది. ఎన్నికల షెడ్యూల్ మినహా మరే దేనిలోనూ స్పష్టత లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో 437 మైనర్ ఇరిగేషన్, 8 మీడియం ఇరిగేషన్, నాలుగు మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల తేదీ మినహా ఎటువంటి సలహాలూ, సూచనలు, ఆదేశాలు వంటివి వెలువడలేదు. దాంతో ఇరిగేషన్ అధికారులు ఎన్నికలకు గ్రామాల్లోకి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు జరిగే ఎన్నికల కాల పరిమితి లేదు. దాంతో పాటు ఈ సంఘాలకే ఆయా ప్రాజెక్టులు, చెరువులు, సంఘాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నారు. సాగునీటి వనరులను బాగు చేయడానికి ఇప్పుడు అనేక రకాలైన నిధులు వస్తున్నాయి. ఇవన్నీ ఈ సంఘాల ఆధ్వర్యంలో త్వరలో జరగనుండడంతో ఈ సంఘాలను చేజిక్కించుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధమవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచి ఎవరు పేరును నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మండల, నియోజకవర్గ నాయకులు సూచిస్తారో.. వారికే ఈ పీఠం అని అనుకుంటున్నారు. అయితే ఆ సంఘాల్లో స్థానం సంపాదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధపడడం, అవకాశమున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకూ ఎన్నికలను నీటిపారుదల శాఖ అధికారులే జరిపించాలని ఆదేశాలున్నాయి. అయితే ఓటర్లను ఎలా గుర్తించాలి, ఓటర్లుగా వచ్చిన వారికి ఆధారమేమిటి, వారిని ఎవరు గుర్తిస్తారు వంటివి ఎవరు చేయాలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఏఈ, డీఈ స్థాయి అధికారులు ఒక్కరే వె ళ్లి ఈ ఎన్నికలు జరిపించుకోవడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది. స్థానికంగా రైతులను తెలిసే రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం లేకుండా ఈ ఎన్నికలు జరపడం సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే ఎన్నికల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు, భోజన, వసతి, రవాణా చార్జీలు మాటేమిటని అధికారులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రాజెక్టు కమిటీల్లో స్థానం సంపాదించాలంటే ముందు నీటి సంఘాలకు ఎన్నికల జరిపి గెలవాల్సిన పరిస్థితి ఉండడంతో రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కమిటీలో అధ్యక్షులు, ఉపాధ్యక్షుడుతో పాటు నలుగురు సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏకాభిప్రాయంతో ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇవీ ప్రాజెక్టులు, సంఘాలు జిల్లాలోని మేజరు ప్రాజెక్టులు లేకపోయినా జిల్లాలోని వాటి పరిధిలో ఉండే నాలుగు సంఘాలకు ఎన్నికలు జరుపుతున్నారు. తోటపల్లి కుడి కాలువ పరిధిలోని గరుగుబిల్లి మండలంలో రెండు, జియ్యమ్మవలస మండలంలో రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో 8 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం డివిజన్లో ఆండ్ర, తాటిపూడి, డెంకాడ ప్రాజెక్టులుండగా, పార్వతీపురం డివిజన్లో పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్, పెదంకలాం, పారాది ఆనకట్టలున్నాయి. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద 437 సంఘాలున్నాయి. 7వ తేదీన మొదలు పెట్టి 25వ తేదీలోగా పూర్తి చేయాలి. ముందు మైనర్ ఇరిగేషన్ ఎన్నికలు పూర్తయితేగానీ మిగిలినవి చేపట్టడానికి కుదరదు. సాగునీటి సంఘ ఎన్నికల అధికారుల నియామకం బొబ్బిలి : సాగునీటి సంఘ ఎన్నికలకు అధికారులను నియమించారు. పార్వతీపురం డివిజన్లోని మీడియం ఇరిగేషన్ కింద 12 మండలాల్లో 36 సంఘాలున్నాయి. అలాగే 17 మండలాల్లో 183 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో తేదీ నాటికి రెవెన్యూ అధికారులు ఓటరు లిస్టులను అందించాలి. ఎన్నికల జరపడానికి వారం రోజుల ముందు ఎన్నికల అధికారులు నోటఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల ముందు రోజు దండోరా వేయాలి. మీడియం ఇరిగేషన్ ఎన్నికలన్నీ ఈఈ జీవీ రమణ పర్యవేక్షణలో జరుగుతాయి. ఒక్కొక్క ఎన్నిక డీఈ నేతృత్వంలో జరుగుతాయి. ఒట్టిగెడ్డ జలాశయం ఎన్నికను ఈ నెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నారు..ఈ ప్రాజెక్టు పరిధిలో జియ్యమ్మవలస మండలంలో ఎఈ జీవి రఘు, గరుగుబిల్లి మండలంలో ఎఈఈ బి.శ్రీకాంత్‌లు ఎన్నికలను నిర్వహిస్తారు. వీటికి కురుపాం డిఈ జి.గోపాలకృష్ణ పర్యవేక్షణ చేస్తారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పరిధిలో 19వ తేదీన ఉదయం పది గంటలకు ఎన్నికల జరుగుతాయి. పెద్దగెడ్డ డీఈ లక్ష్మి పరిధిలో జరిగే ఈ ఎన్నికలకు సాలూరు మండలానికి ఎఈలు కె.శశిధర్, పాచిపెంట మండలానికి కె.శంకర్, పీవీ సతీష్‌లను నియమించారు. పెదంకలాం ఆనకట్ట పరిధిలో 22వ తేదీన ఉదయం పది గంటలకు ఎన్నికలు జరుపుతారు. వీటిని డీఈ వి.బాలసూర్యం పర్యవేక్షిస్తారు. ఈ ఆనకట్ట పరిధిలో బలిజిపేట మండలంలో ఏఈ టి.వేణుగోపాలరావును ఎన్నికల అధికారిగా నియమించారు. పారాది ఆనకట్ట పరిధిలో 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికలు జరుపుతారు. ఇవి డీఈ బాలసూర్యం అధ్వర్యంలో జరుగుతాయి,. ఈ ఆనకట్ట పరిధిలో బొబ్బిలి మండలంలో ఎన్నికలకు ఏఈ పి.పురుషోత్తం దొర, బాడంగి మండలంలోని ఎన్నికలకు ఎఈ ఎన్.హరిబాబులను అధికారులుగా నియమించారు. వెంగళరాయసాగర్ జలాశయం పరిధిలో ఈ నెల 23న ఎన్నికలను ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నారు. మక్కువ మండలానికి ఎఈ ఆర్.దారప్పడు, బొబ్బిలి మండలానికి ఎఈ పి.పురుషోత్తం, సీతానగరం మండలానికి ఎఈఈ పి.శ్రీనివాసరావులు ఎన్నికలు నిర్వహించగా, మామిడిపల్లి డీఈ జీబి సుందరరావు పర్యవేక్షిస్తారు.