ఎన్నికలు సజావుగా ‘సాగే’నా? | Irrigation union elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలు సజావుగా ‘సాగే’నా?

Published Thu, Sep 3 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

Irrigation union elections

 బొబ్బిలి : సాగునీటి సంఘ ఎన్నికలు... చాలా కాలం తరువాత జరుగుతున్న ఎన్నికల్లో తమ వారికి పదవులు కట్టబెట్టడానికి చేతులెత్తే విధానం ప్రవేశపెట్టారు. అదే ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇరిగేషన్ అధికారులకు భారంగా మారబోతుంది. ఎన్నికల షెడ్యూల్ మినహా మరే దేనిలోనూ స్పష్టత లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో 437 మైనర్ ఇరిగేషన్, 8 మీడియం ఇరిగేషన్, నాలుగు మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల తేదీ మినహా ఎటువంటి సలహాలూ, సూచనలు, ఆదేశాలు వంటివి వెలువడలేదు.
 
 దాంతో ఇరిగేషన్ అధికారులు ఎన్నికలకు గ్రామాల్లోకి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు జరిగే ఎన్నికల కాల పరిమితి లేదు. దాంతో పాటు ఈ సంఘాలకే ఆయా ప్రాజెక్టులు, చెరువులు, సంఘాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నారు. సాగునీటి వనరులను బాగు చేయడానికి ఇప్పుడు అనేక రకాలైన నిధులు వస్తున్నాయి. ఇవన్నీ ఈ సంఘాల ఆధ్వర్యంలో త్వరలో జరగనుండడంతో ఈ సంఘాలను చేజిక్కించుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధమవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచి ఎవరు పేరును నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మండల, నియోజకవర్గ నాయకులు సూచిస్తారో.. వారికే  ఈ పీఠం అని అనుకుంటున్నారు.
 
  అయితే ఆ సంఘాల్లో స్థానం సంపాదించడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధపడడం, అవకాశమున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకూ ఎన్నికలను నీటిపారుదల శాఖ అధికారులే జరిపించాలని ఆదేశాలున్నాయి. అయితే ఓటర్లను ఎలా గుర్తించాలి, ఓటర్లుగా వచ్చిన వారికి ఆధారమేమిటి, వారిని ఎవరు గుర్తిస్తారు వంటివి ఎవరు చేయాలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఏఈ, డీఈ స్థాయి అధికారులు ఒక్కరే వె ళ్లి ఈ ఎన్నికలు జరిపించుకోవడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది. స్థానికంగా రైతులను తెలిసే రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం లేకుండా ఈ ఎన్నికలు జరపడం సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే ఎన్నికల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు, భోజన, వసతి, రవాణా చార్జీలు మాటేమిటని అధికారులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రాజెక్టు కమిటీల్లో స్థానం సంపాదించాలంటే ముందు నీటి సంఘాలకు ఎన్నికల జరిపి గెలవాల్సిన పరిస్థితి ఉండడంతో రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కమిటీలో అధ్యక్షులు, ఉపాధ్యక్షుడుతో పాటు నలుగురు సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏకాభిప్రాయంతో ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.
 
 ఇవీ ప్రాజెక్టులు, సంఘాలు
 జిల్లాలోని మేజరు ప్రాజెక్టులు లేకపోయినా జిల్లాలోని వాటి పరిధిలో ఉండే  నాలుగు సంఘాలకు ఎన్నికలు జరుపుతున్నారు. తోటపల్లి కుడి కాలువ పరిధిలోని గరుగుబిల్లి మండలంలో రెండు, జియ్యమ్మవలస మండలంలో రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో 8 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం డివిజన్‌లో ఆండ్ర, తాటిపూడి, డెంకాడ ప్రాజెక్టులుండగా, పార్వతీపురం డివిజన్‌లో పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్, పెదంకలాం, పారాది ఆనకట్టలున్నాయి. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద 437 సంఘాలున్నాయి. 7వ తేదీన మొదలు పెట్టి 25వ తేదీలోగా పూర్తి చేయాలి. ముందు మైనర్ ఇరిగేషన్ ఎన్నికలు పూర్తయితేగానీ మిగిలినవి చేపట్టడానికి కుదరదు.
 
 సాగునీటి సంఘ ఎన్నికల అధికారుల నియామకం
 బొబ్బిలి : సాగునీటి సంఘ ఎన్నికలకు అధికారులను నియమించారు. పార్వతీపురం డివిజన్‌లోని  మీడియం ఇరిగేషన్ కింద 12 మండలాల్లో 36 సంఘాలున్నాయి. అలాగే 17 మండలాల్లో 183  సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో తేదీ నాటికి రెవెన్యూ అధికారులు ఓటరు లిస్టులను అందించాలి. ఎన్నికల జరపడానికి వారం రోజుల ముందు ఎన్నికల అధికారులు నోటఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల ముందు రోజు దండోరా వేయాలి.  మీడియం ఇరిగేషన్ ఎన్నికలన్నీ ఈఈ జీవీ రమణ పర్యవేక్షణలో జరుగుతాయి. ఒక్కొక్క ఎన్నిక డీఈ నేతృత్వంలో జరుగుతాయి.
 
 ఒట్టిగెడ్డ జలాశయం ఎన్నికను ఈ నెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నారు..ఈ ప్రాజెక్టు పరిధిలో జియ్యమ్మవలస మండలంలో ఎఈ జీవి రఘు, గరుగుబిల్లి మండలంలో ఎఈఈ బి.శ్రీకాంత్‌లు ఎన్నికలను నిర్వహిస్తారు. వీటికి కురుపాం డిఈ జి.గోపాలకృష్ణ పర్యవేక్షణ చేస్తారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పరిధిలో 19వ తేదీన ఉదయం పది గంటలకు ఎన్నికల జరుగుతాయి. పెద్దగెడ్డ డీఈ లక్ష్మి పరిధిలో జరిగే ఈ ఎన్నికలకు సాలూరు మండలానికి ఎఈలు కె.శశిధర్, పాచిపెంట మండలానికి కె.శంకర్, పీవీ సతీష్‌లను నియమించారు.
 
  పెదంకలాం ఆనకట్ట పరిధిలో 22వ తేదీన ఉదయం పది గంటలకు ఎన్నికలు జరుపుతారు. వీటిని డీఈ వి.బాలసూర్యం పర్యవేక్షిస్తారు. ఈ ఆనకట్ట పరిధిలో బలిజిపేట మండలంలో ఏఈ టి.వేణుగోపాలరావును ఎన్నికల అధికారిగా నియమించారు. పారాది ఆనకట్ట పరిధిలో 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికలు జరుపుతారు. ఇవి డీఈ బాలసూర్యం అధ్వర్యంలో జరుగుతాయి,. ఈ ఆనకట్ట పరిధిలో బొబ్బిలి మండలంలో ఎన్నికలకు ఏఈ పి.పురుషోత్తం దొర, బాడంగి మండలంలోని ఎన్నికలకు ఎఈ ఎన్.హరిబాబులను అధికారులుగా నియమించారు. వెంగళరాయసాగర్ జలాశయం పరిధిలో ఈ నెల 23న ఎన్నికలను ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నారు. మక్కువ మండలానికి ఎఈ ఆర్.దారప్పడు, బొబ్బిలి మండలానికి  ఎఈ పి.పురుషోత్తం, సీతానగరం మండలానికి ఎఈఈ పి.శ్రీనివాసరావులు ఎన్నికలు నిర్వహించగా, మామిడిపల్లి డీఈ జీబి సుందరరావు పర్యవేక్షిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement